బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన
ఫార్ములా–ఈ కారు రేసు విషయంలో ఈడీ కేసు
మనీలాండరింగ్‌పై దర్యాప్తు జరుపుతున్న సంస్థ
9న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
మరోసారి విచారణకు ఏసీబీ నోటీసులిచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు. గతంలో విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం కావాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే.
ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన.
విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి
ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది. ఏసీబీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా వెనక్కు తీసుకోవాల్సి రావటంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో ఈడీ విచారణపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోసారి ఏసీబీ నోటీసులు..
కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment