హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధేతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ తమిళిసై. చిత్రంలో సీఎం కేసీఆర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం స్వీకారం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ తీర్పులు వెలువరిస్తానని ప్రమాణం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.
అనంతరం గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. సీఎస్ శాంతికుమారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జస్టిస్ అలోక్ నియామకంపై రాష్ట్రపతి జారీ చేసిన వారెంట్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుజన చదివి వినిపించారు.
ఆ వారెంట్‌ను జస్టిస్ అలోక్‌కు గవర్నర్ అందజేశారు. తర్వాత తెలంగాణ హైకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ అలోక్ కుటుంబసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
27 మంది న్యాయమూర్తులు
హైకోర్టులో ప్రస్తుతం సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరింది. ఏపీ నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ కన్నెగంటి లలిత కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. అలాగే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషీ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. ఒకరు రావడం.. ఒకరు వెళ్లడం.. జరిగినా సంఖ్య మాత్రం 27గానే ఉంటుంది. ఇక కొత్తగా కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment