సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ 2023–24 ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసులతో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఈ మేరకు ఆమె నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్ సిఫారసుల కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్‌భవన్‌లోనే ఉండిపోయాయి. తమిళిసై సోమవారం హైదరాబాద్‌కు రానున్నారని, ప్రతిపాదనలను ఆమోదించి ప్రభుత్వానికి తిరిగి పంపించే విషయంపై నిర్ణయం తీసుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
విభేదాల నేపథ్యంలో..
రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుండగా, ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది.
తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగాన్ని రద్దు చేసుకుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే సిఫారసు చేయకుండా పెండింగ్‌లో ఉంచగలనని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment