బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రిజర్వేషన్ల కల్పనకు సేకరించే వివరాల కోసం
కమిషన్ ప్రత్యేకంగా ఉండాల్సిందేనని వెల్లడి
ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని కోరిన ఏజీ
ససేమిరా అన్న ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కల్పనకు సేకరించే వివరాల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ వి చారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిటిషన్ దాఖలుచేశారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగించడం సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్ తీర్పునకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న అత్యున్నత న్యా యస్థానం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, రెండు వారాల్లో స్థాయీ నివేదిక న్యాయస్థానం ముందు ఉంచాలని స్పష్టం చేశారు.
వాదనలు ఇలా..: పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. బీసీ కమిషన్‌నే ప్రత్యేక కమిషన్‌గా ప్రభుత్వం పేర్కొనడం డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్‌రావు గవాలి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధమని తెలిపారు. బీసీలకు కల్పించిన రిజర్వేషన్‌ల సమీక్ష నిమిత్తం బీసీ కమిషన్ ఏర్పాటవుతుందన్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన నిమిత్తం వాస్తవ గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
మహారాష్ట్రలో బీసీ కమిషన్‌నే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌గా నియమించగా, అది ఇచ్చిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాంథియా కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు గణాంకాలుగా పరిగణించరాదని చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసమే జీవో: ఏజీ
వాదనల అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేయగా, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేసి మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి మధ్యాహ్నం న్యాయమూర్తిని కోరారు. రెండున్నర నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన దశలో ఈ ఉత్తర్వులు సరికాదన్నారు. 2021లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు.
ఈ జీవో అమలు నిమిత్తం తిరిగి జీవో 47 జారీ చేస్తూ గణాంకాల సేకరణకు విధివిధానాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ జీవోలు జారీ చేసినందున సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 9న జీవో 47 జారీ చేసిందన్నారు. ఈ జీవోను పిటిషనర్లు సవాలు చేయలేదని తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాస్తవ గణాంకాల సేకరణకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అభ్యంతరాలుంటే కౌంటరుతోపాటు పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పారు. బీసీ కమిషన్‌నే ప్రత్యేక కమిషన్‌గా పరిగణించాలంటూ ఇచ్చిన జీవో 47 సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంతో విభేదిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాగా, హైకోర్టు తీర్పుపై ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీర్పును గౌరవించి వెంటనే నిపుణులతో కూడిన డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment