జస్టిస్‌ శరత్, రేవంత్‌ల ఫోన్లు ట్యాపింగ్‌ | Justice Sharat And CM Revanth Reddy Phones Were Tapped, More Details Inside | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ శరత్, రేవంత్‌ల ఫోన్లు ట్యాపింగ్‌

Published Thu, Jul 4 2024 1:00 AM | Last Updated on Thu, Jul 4 2024 10:43 AM

Justice Sharat and CM Revanth Reddy phones were tapped

టెలికం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించారు

చాలామంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేశారు

ఓ వివాదంలో టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయి

ఇంటెలిజెన్స్‌ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారన్న సర్కారు

అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం

ట్యాపింగ్‌ వ్యవహారంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌లు, కాల్‌ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్‌ చేసి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధ వారం హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించింది.

సుమోటోగా తీసుకున్న కోర్టు..
గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ ట్యాప్‌ అయిందని.. జడ్జీల ఫోన్లను ట్యాప్‌ చేసినట్టు ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని పత్రికల్లో వచ్చి కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం బుధవారం మధ్యాహ్న విరామం తర్వాత విచారణ చేపట్టింది.

విచారణ 23వ తేదీకి వాయిదా..
ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై అన్ని వివరాలతో కౌంటర్‌ దాఖలు చేశామని ధర్మాసనానికి వివరించారు. కేసు ఎప్పుడు నమోదు చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ అయ్యాయి? నిందితులెవరు? కేసు పురోగతి ఎంత వరకు వచ్చింది వంటి వివరాలు అందులో పేర్కొన్నామని.. కానీ ఇంకా రికార్డు కాలేదని చెప్పారు. ఈ వివరాలను రికార్డు చేయాలని కోర్టు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. 

తదుపరి విచారణలోగా కౌంటర్‌ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తాను కూడా బాధితుడినేనని, పోలీసు అధికారుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని.. తనను ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ చేయాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన హయతుద్దీన్‌ వేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని కూడా ధర్మాసనం వాయిదా వేసింది.

ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్న వివరావీ..
‘‘నాయిని భుజంగరావు (ఏ3) వాంగ్మూలం మేరకు.. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్ట్‌లు, జస్టిస్‌ కాజా శరత్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులు, పార్టీ నేతల వ్యక్తిగత జీవితం, చేసే పనులు తెలుసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడల్లా అవతలి వారి ఫోన్లు ట్యాప్‌ చేసి బెదిరించేవాళ్లు. 

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులో, టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశం సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ‘నేను కీలక వ్యక్తుల పేర్లు, ఫోన్‌ నంబర్లు సేకరించి ప్రణీత్‌కుమార్‌కు అందజేసేవాడిని. వారి ఫొటోలు, అడ్రస్‌లు సేకరించి చర్యలు తీసుకోవడం కోసం ఇంటెలిజెన్స్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు పంపేవాళ్లం’ అని భుజంగరావు చెప్పారు. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించినట్టు, ఫోన్‌ నంబర్‌ చెబితే వారి కాల్‌లకు సంబంధించి వివరాలు కూడా సర్వీస్‌ ప్రొవైడర్లు ఇచ్చినట్టు తెలిసింది. జస్టిస్‌ కాజా శరత్, ఆయన సతీమణి మాధవి నంబర్లు, కాల్‌ల వివరాలు, అడ్రస్‌లు జియో ఆఫీస్‌ నుంచి తెలుసుకున్నారు. 

కీలక వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌..
సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి, విజయ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, శివధర్‌రెడ్డి, ఏఆర్‌ శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, రోనాల్డ్‌ రోస్, ధర్మపురి అర్వింద్, ఎం.రమేశ్‌రెడ్డి, మేఘా శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిశోర్, ఐఏఎస్‌ దివ్య, తాటినేటి శశాంక్, రాజ్‌న్యూస్‌ సునీల్‌రెడ్డి, చిలుకా రాజేందర్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్‌ చౌదరి, తీన్మార్‌ మల్లన్న (నవీన్‌), ఏఎంఆర్‌ ఇన్‌ఫ్రా మహేశ్‌రెడ్డి, వీరమళ్ల సత్యం, గాలి అనిల్‌కుమార్, రామసాయం సురేందర్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరెడ్డి స్వప్నిక, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లే సరిత, అంజన్న (ఈటల గన్‌మన్‌), అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్, మనాల మోహన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు మరికొందరి ఫోన్లను ట్యాప్‌ చేశారు.

మధ్యవర్తిగా టీవీ 5 సాంబశివరావు..
సంధ్య కన్వెన్షన్‌ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్‌ఎస్‌కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు. 

శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్‌ఎస్‌ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది. వీటితోపాటు మరిన్ని వివరాలనూ వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement