సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణకు వచ్చారు.
ఈమేరకు కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయ శాఖ గత వారం ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపట్టారు.
కర్ణాటక నుంచి తెలంగాణకు...
మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 1964, ఏప్రిల్ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో పేరు గడించారు.
2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016, సెప్టెంబర్ 16న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు. 2018, నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు.
నాలుగేళ్లలో ఆరో సీజే
ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన 2019, జనవరి 1న జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు సీజేలుగా పనిచేశారు. నాలుగేళ్ల కాలంలో సీజేలుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పనిచేశారు. జస్టిస్ అలోక్ అరాధే ఆరో సీజే కానున్నారు. వీరిలో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment