సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్‌లో నీటికొరతపై సుభాష్‌చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు.
వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment