సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తమ వాటా 967 టీఎంసీల్లో చుక్కనీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటిలభ్యతను తేల్చుతూ ఇటీవల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గోదావరి బోర్డుకు సమర్పించిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కలిసేచోట నుంచి గోదావరి నది సముద్రంలో కలిసేవరకు ఉన్న జీ–10 సబ్ బేసిన్‌లోని తెలంగాణ వాటాలో 28.847 టీఎంసీలను సీడబ్ల్యూసీ తక్కువగా చూపించిందని తప్పుబట్టింది.
ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీలకుగాను తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీ–10 సబ్ బేసిన్‌లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 287.189 టీఎంసీలు అవసరమని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 126.642 టీఎంసీలు కావాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు 8.887 టీఎంసీలు, విద్యుదుత్పత్తి అవసరాలకు 12.2 టీఎంసీలు అవసరమని తేల్చిచెప్పారు.
జీ–10 సబ్ బేసిన్‌లో మొత్తం 434.918 టీఎంసీల కేటాయింపులు అవసరమని, సీడబ్ల్యూసీ నివేదికలో 406.07 టీఎంసీలను మాత్రమే చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిలభ్యత సీడబ్ల్యూసీ 498.07 టీఎంసీలని నిర్ధారించగా, సీడబ్ల్యూసీ పరిధిలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతుల ప్రకారం గోదావరి డెల్టా, పోలవరం అవసరాలకు 484.5 టీఎంసీలు అవసరమని గుర్తుచేశారు. పోలవరం దిగువ 45.83 టీఎంసీల లభ్యత ఉందని, పోలవరం అవసరాలకు 438 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment