సాక్షి, విశాఖపట్నం: ఏపీలో నీటి యాజమాన్య పద్ధతులు సత్ఫలితాలిస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్ ఓరా కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న నీటి కొరతపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సదస్సులో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన ఐసీఐడీ సదస్సు జరుగుతోన్న విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సులో నీటి ఉత్పాదక పెంపునకు దోహదపడే అంశాలపై సిఫార్సులను ఆహ్వానించినట్లు తెలిపారు.
వాతావరణ మార్పు ప్రభావం నీటి పారుదల రంగంపై ఎక్కువగా ఉందని.. దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చ జరుగుతోందన్నారు. ఇటీవల కాలంలో కురిస్తే కుండపోత, లేదంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, గణాంకాల ప్రకారం సగటు వర్షపాతం నమోదవుతున్నా సకాలంలో వానలు కురవకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లు, జల విద్యుత్‌కేంద్రాలను అకాల వరదలు దెబ్బతీస్తున్నాయని, దీంతో వాటి కట్టడాల పటిష్టత, డిజైన్లపై సమీక్షించాల్ని అవసరం ఉందన్నారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం రానున్న రెండు మూడు దశాబ్దాలకు రుతుపవనాలు అనుకూలంగా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలు వృద్ధి చేయడం, నీటిని పొదుపుగా వాడడం తప్పనిసరైందన్నారు. వాటర్ రీసైక్లింగ్‌పై భారత్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే డిసాలినేషన్ ప్లాంట్లకు అధిక వ్యయం అవుతోందన్నారు. అందుకే మంచినీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనే వీటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఉంటోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటి వ్యయం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment