ఢాకా: సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చించనుంది. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియాకు తెలిపారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటన సందర్భంగా, తీస్తా నీటి భాగస్వామ్యంపై భారత్- బంగ్లాదేశ్ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది. అయితే నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.
బంగ్లాదేశ్ జలవనరుల సలహాదారు సైదా రిజ్వానా హసన్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చలు జరుపుతుందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాతే చర్చలు జరుపుతామన్నారు. అంతర్జాతీయ నదుల నీటిని పంచుకోవడం సంక్లిష్టమైన సమస్య అని, అయితే దీనిలో రాజకీయాలకు తావు ఉండకూడదని రిజ్వానా పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలపై ఏ దేశం కూడా ఏకపక్షంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లదని, బదులుగా రెండు దేశాలూ వెళ్లాలని అన్నారు.
భారత్‌తో వర్షపాతం డేటాను పంచుకోవడం మానవతా చర్య అని రిజ్వానా పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ఈ డేటా ఉపకరిస్తుందన్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వాదనలు స్పష్టంగా, బలంగా ఉన్నాయన్నారు. దేశంలోని అంతర్గత నదులను సమిష్టిగా రక్షించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాగా ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌తో విభేదాలను పరిష్కరించడానికి తాత్కాలిక ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుందని అన్నారు.
ఇది కూడా చదవండి: చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి
Comments
Please login to add a commentAdd a comment