శనివారం హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభానికి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించి సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్, మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలతో కలసి సెల్యూట్ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. ఈ కూటమిలో కీలకపాత్ర వహించడం ద్వారా దేశ ప్రజానీకానికి బాధ్యతాయుతమైన పారదర్శక ప్రభుత్వాన్ని అందించాలని తీర్మానించింది. ఇండియా కూటమిని సిద్ధాంతపరంగా, ఎన్నికల విజయ సూచికగా నిలబెట్టడం ద్వారా విభజన, విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చింది.
శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దేశం అనేక రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, చైనా దురాక్రమణ, కొత్త రాజ్యాంగ రూపకల్పన, జమిలి ఎన్నికలు, భారత్ జోడో యాత్ర, మణిపూర్ హింస, కశ్మీర్‌లో ఉగ్ర కాల్పులు తదితర 14 అంశాలపై చర్చించి తీర్మానాలు చేసింది.
సీడబ్ల్యూసీ నిర్ణయాలివీ...
1. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఆర్మీ, పోలీసు అధికారులకు సీడబ్ల్యూసీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఇలాంటి విషాద సమయంలో జాతి మొత్తం మౌనం పాటిస్తున్న తరుణంలో బీజేపీ, ప్రధానమంత్రి జీ–20 సమావేశాల విజయవంతం పేరుతో సంబురాలు చేసుకుని వారిని వారే అభినందించుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇది సహించరానిదని, అమర వీరులకు అవమానమని దుయ్యబట్టింది.
2. ఏడాది కాలంగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ అభినందించింది. ఆయన స్ఫూర్తివంతమైన నాయకుడని, సామాజిక న్యాయం కోసం రాజీలేని గొంతుకను వినిపిస్తున్నారని కొనియాడింది.
3. దేశ ప్రజలను ఐక్యం చేసి జాతీయ రాజకీయాల్లో మార్పు తెచ్చేలా రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా సీడబ్ల్యూసీ హర్షం వ్యక్తం చేసింది. భారత్‌జోడో యాత్ర స్ఫూర్తిని పార్టీలోని అన్ని స్థాయిల్లో కొనసాగించాలని, యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లో కొనసాగించాలని తీర్మానించింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్య అని, మళ్లీ ఆయన సభ్యత్వం పునరుద్ధరణతో న్యాయం, ధర్మం గెలిచాయని పేర్కొంది.
4. మణిపూర్‌లో అధికార యంత్రాంగం కుప్పకూలి హింస కొనసాగడంపై సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని మౌనం, నిర్లక్ష్యం, హోంమంత్రి వైఫల్యం, ముఖ్యమంత్రి మొండితనమే ఇంతటి దారుణానికి తెరతీసిందని ధ్వజమెత్తింది. త్వరగా మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టాలని సూచించింది.
5. కుల, మత, ప్రాంతీయ తత్వాలపై పదేళ్ల మారటోరియం ప్రకటించాలని ప్రధాని తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పినప్పటికీ సమాజంలో ఈ మూడు దురాచారాలు పేట్రేగిపోతున్నాయని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. సహకార సమాఖ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆక్షేపించింది.
6. పంటలకు మద్దతు ధరతోపాటు ఇతర అంశాలపై రైతులు, రైతుసంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానికి సీడబ్ల్యూసీ మరోమారు గుర్తు చేసింది.
7. పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పట్ల సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్లకోసారి చేపట్టే జనగణనను 2021లో నిర్వహించకపోవడం సిగ్గుచేటని పేర్కొంది. కులగణన చేపట్టకుండా ఆ ప్రతిపాదనను తిరస్కరించడం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని నిరూపిస్తోందని ఆక్షేపించింది. వెంటనే కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
8. కొత్త రాజ్యాంగ రూపకల్పన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చాలనే ప్రయత్నాన్ని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించింది. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చింది.
9. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు రూపొందించే సమయంలో జరగాల్సిన చర్చ పార్లమెంటు సాక్షిగా కనుమరుగైందని సీడబ్ల్యూసీ మండిపడింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి ఉండాల్సిన స్వయంప్రతిపత్తి కోల్పోయేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర కమిషనర్ల నియామక బిల్లు ఉందని మండిపడింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేసింది.
10. ప్రధానికి సన్నిహితుడైన ఆదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
11. ఒకే దేశం–ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) విధానం దేశ సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడిగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని, విపత్తు సహాయ నిధులివ్వడంలోనూ వివక్ష పాటిస్తోందని ఆక్షేపించింది.
12. చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలను వెంటనే పరిష్కరించుకోవాలని, దేశ భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే ధోరణిలో ఎదురయ్యే అన్ని సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని కేంద్రానికి సూచించింది.
13. మతసామరస్యం, సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించే, యువత ఆకాంక్షలను నెరవేర్చి అంతర్జాతీయ సమాజం గర్వించేలా దేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించింది. కులం–మతం, ధనిక–పేద, యువకులు–వృద్ధులు లాంటి భేదాల్లేని జాతి నిర్మాణానికి కృషి చేస్తామని తీర్మానించింది.
14. ఇండియా కూటమి ఏర్పాటును సీడబ్ల్యూసీ స్వాగతించింది. ఈ కూటమి ఏర్పాటు ప్రధానితోపాటు బీజేపీకి భయాందోళనలు కలిగించిందని ఎద్దేవా చేసింది. ఇండియా కూటమిని ఒక సైద్ధాంతిక, ఎన్నికల విజయంగా తీర్చిదిద్దడం ద్వారా దేశంలో విభజన, విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని పేర్కొంది. సామాజిక అసమానతలను రూపుమాపి న్యాయాన్ని బలోపేతం చేయడంలో కూటమి కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించింది.
పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి...
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడంతో తొలిరోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు పలువురు సభ్యులు హాజరయ్యారు.
ఖర్గే అధ్యక్షతన భారత్‌జోడో ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌రంజన్ చౌదరి, సీడబ్ల్యూసీ సభ్యులు ఏకే ఆంటోని, పి.చిదంబరం, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, దిగ్విజయ్‌సింగ్, జైరాంరమేశ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌గహ్లోత్, సిద్ధరామయ్య, భూపేశ్‌భగేల్‌తోపాటు సుఖి్వందర్‌సింగ్ సుఖు, రాజీవ్‌శుక్లా, దామోదర రాజనర్సింహ, రఘువీరారెడ్డి యాదవ్, వంశీచందర్‌రెడ్డి, సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులకు సంబంధించిన నివేదికలను ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో అందజేశారు. ఈ నివేదికలపై ఆదివారం కమిటీ చర్చించనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment