Government attitude
-
25 ఏళ్లయినా..గడువు కోరుతూనే ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో నీటికొరతపై సుభాష్‌చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న రైతులు
–హైకోర్టు ఆదేశాలు బేఖాతరు –హంద్రీనీవా కాలువ పనులు అడ్డుకున్న రైతులపై పోలీస్ దౌర్జన్యం – ఆత్మహత్య చేసుకోబోయిన రైతులు పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వ ఆదేశాలతో దౌర్జన్యంగా హంద్రీ-నీవా పనులు చేయబోవడంతో అడ్డుకున్న రైతులను పోలీసులు అక్రమ అరెస్టులు చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకుని హంద్రీ-నీవా కాలువ పనులు చేయడాన్ని నిరసిస్తూ పలువురు రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుట్టపర్తి పట్టణ సమీపంలో పెద్దకమ్మవారిపల్లి గ్రామం వద్ద హంద్రీనీవా 9వ ప్యాకేజీ వద్ద ఇంతవరకూ భూసేకరణ జరగలేదు. సదరు 9వ ప్యాకేజీలో సుమారు 20 మంది రైతులకు చెందిన 14.80 ఎకరాల భూమి ఉంది. అయితే సదరు భూమి పక్కనే ఉన్న సర్వే నెంబర్ నెంబర్ 340లో ప్లాట్లకు కేటాయించారనే నెపంతో ఎకరం రూ.1.62 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. దాని పక్కనే ముమ్మనేని వెంకటరాముడు, నారాయణస్వామి, కిష్టప్ప, రామమోహన్, వెంకటనారాయణ, తదితర రైతుల భూమి ఉంది. పక్కనున్న భూమికి రూ.1.62 కోట్లు చెల్లించినప్పుడు తమకూ అదే ధరను చెల్లించాలని పట్టుపట్టారు. అయితే ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. సమస్య ప్రస్తుతం చీఫ్ జస్టిస్ రంగనాథ్‌మిశ్రా ముంగిట విచారణ కొనసాగుతోంది. అయితే సమస్య కోర్టు పరిధిలో ఉన్నా అధికారులు శనివారం పోలీసుల సాయంతో ఆ భూమిలో పనులు ప్రారంభించేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న రైతులు పనులను అడ్డుకున్నారు. దీంతో కదిరి ఆర్డీఓ వెంకటేశులు, హంద్రీనీవా ఎస్డీసీ శ్రీనివాస్ కోర్టు పరిధిలోని అంశాలను ప్రస్తావించకుండా జేసీ అవార్డు మేరకు పనులు చేపడుతున్నామంటూ నచ్చజెప్పేయత్నం చేశారు. రైతుల్ని బలవంతంగా అరెస్ట్ చేయించారు. దీంతో అక్కడే ఉన్న బాధిత బంధువులు, గ్రామస్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే పోలీసులు వారి చర్యల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కోరారు. అయినా కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడం ఏంటన్నారు. అయినా అధికారులు వారిని కూడా బుక్కపట్నం పోలీస్‌స్టేషన్ తరలించి పనులు చేపట్టారు. కార్యక్రమంలో సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, రవికుమార్, ఎస్ఐలు, రాజశేఖరరెడ్డి, వెంకటేశ్వర్లు, హంద్రీనీవా డీటీ ఇంతియాజ్, తహశీల్దార్ సత్యనారాయణ, డీటీ ప్రకాష్‌రావ్ తదితరులు పాల్గొన్నారు. -
చెప్పేదొకటి .. చేసేదొకటి!
- అసైన్డ్ సాగుదారులకు పరిహారంపై మెలిక - ఆ భూములు ప్రభుత్వానివంటూ ప్రకటనలు - ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న రైతులు తుళ్ళూరు : అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నచందంగా ఉందన్న విమర్శలు రైతులనుంచి వెల్లువెత్తుతున్నాయి. నూతన రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అసైన్డ్ సాగుదారులకు నివాసప్రాంతంలో 800 గజాలు, వాణిజ్యప్రాంతంలో 100 గజాలు ఇస్తామని ప్రభుత్వం నమ్మబలికింది. దీంతో అసైన్డ్ సాగుదారులుగా ఉన్న పేదరైతులు 9.3 ద్వారా భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చి 9.14 ద్వారా భూస్వాధీన ఒప్పంద పత్రాలపై అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. వెంకటపాలెం, మందడం, నీరుకొండ, కురగల్లు, ఐనవోలుతో పాటు తుళ్ళూరుకు చెందిన అసైన్డ్ సాగుదారులుగా ఉన్న దళితులు సుమారు 1,400 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారు. తీరా చూస్తే అసైన్డ్ సాగుదారులకు ఎకరాకు రూ.30వేలు కౌలు పరిహారం అందించే విషయంలో అధికారులు గందరగోళానికి తెరలేపారు. ‘ఆ భూములు మీవి కావు.. ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములు’ అంటూ మెలిక పెట్టారు. వారం క్రితం రిజిస్ట్రేషన్లు జరపరాదంటూ ఆదేశించారు. రైతుల ఆందోళన.. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిన్నమొన్నటి వరకు రిజిస్ట్రేషన్లకు అనుమతించి ఇప్పుడు హఠాత్తుగా అసైన్డ్ భూములనే పేరుతో గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎప్పుడోబ్రిటిష్ వాళ్ల హయాంలో ఇచ్చిన భూములని, కాలక్రమంలో కొద్దిమంది రైతులు అమ్ముకోవడాన్ని సాకుగా చూపి అన్యాయం చేస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఈ భూముల విషయమై అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారులు ఈనెల 5న సీపీఎం ఆధ్వర్యంలో తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయంకు వచ్చిన కలెక్టర్ కాంతిలాల్‌దండే ను ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ అసైన్డ్ భూములను వారసత్వంగా సాగు చేసుకుంటున్న వారికి మాత్రమే కౌలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములపై క్రయవిక్రయాలు జరపరాదని అలాంటి వాటిని పక్కన పెడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటపాలెం, మందడం, కురగల్లు, నీరుకొండ, ఐనవోలు, తుళ్ళూరుకు చెందిన అసైన్డ్ సాగుదారులు ఆందోళనకు సమాయత్తయవుతున్నారు.