ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న రైతులు
–హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
–హంద్రీనీవా కాలువ పనులు అడ్డుకున్న రైతులపై పోలీస్ దౌర్జన్యం
– ఆత్మహత్య చేసుకోబోయిన రైతులు
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వ ఆదేశాలతో దౌర్జన్యంగా హంద్రీ-నీవా పనులు చేయబోవడంతో అడ్డుకున్న రైతులను పోలీసులు అక్రమ అరెస్టులు చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకుని హంద్రీ-నీవా కాలువ పనులు చేయడాన్ని నిరసిస్తూ పలువురు రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుట్టపర్తి పట్టణ సమీపంలో పెద్దకమ్మవారిపల్లి గ్రామం వద్ద హంద్రీనీవా 9వ ప్యాకేజీ వద్ద ఇంతవరకూ భూసేకరణ జరగలేదు. సదరు 9వ ప్యాకేజీలో సుమారు 20 మంది రైతులకు చెందిన 14.80 ఎకరాల భూమి ఉంది.
అయితే సదరు భూమి పక్కనే ఉన్న సర్వే నెంబర్ నెంబర్ 340లో ప్లాట్లకు కేటాయించారనే నెపంతో ఎకరం రూ.1.62 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. దాని పక్కనే ముమ్మనేని వెంకటరాముడు, నారాయణస్వామి, కిష్టప్ప, రామమోహన్, వెంకటనారాయణ, తదితర రైతుల భూమి ఉంది. పక్కనున్న భూమికి రూ.1.62 కోట్లు చెల్లించినప్పుడు తమకూ అదే ధరను చెల్లించాలని పట్టుపట్టారు. అయితే ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. సమస్య ప్రస్తుతం చీఫ్ జస్టిస్ రంగనాథ్‌మిశ్రా ముంగిట విచారణ కొనసాగుతోంది. అయితే సమస్య కోర్టు పరిధిలో ఉన్నా అధికారులు శనివారం పోలీసుల సాయంతో ఆ భూమిలో పనులు ప్రారంభించేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న రైతులు పనులను అడ్డుకున్నారు.
దీంతో కదిరి ఆర్డీఓ వెంకటేశులు, హంద్రీనీవా ఎస్‌డీసీ శ్రీనివాస్ కోర్టు పరిధిలోని అంశాలను ప్రస్తావించకుండా జేసీ అవార్డు మేరకు పనులు చేపడుతున్నామంటూ నచ్చజెప్పేయత్నం చేశారు. రైతుల్ని బలవంతంగా అరెస్ట్ చేయించారు. దీంతో అక్కడే ఉన్న బాధిత బంధువులు, గ్రామస్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే పోలీసులు వారి చర్యల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కోరారు. అయినా కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడం ఏంటన్నారు. అయినా అధికారులు వారిని కూడా బుక్కపట్నం పోలీస్‌స్టేషన్ తరలించి పనులు చేపట్టారు. కార్యక్రమంలో సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, రవికుమార్, ఎస్‌ఐలు, రాజశేఖరరెడ్డి, వెంకటేశ్వర్లు, హంద్రీనీవా డీటీ ఇంతియాజ్, తహశీల్దార్ సత్యనారాయణ, డీటీ ప్రకాష్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.