చెప్పేదొకటి .. చేసేదొకటి!
- అసైన్డ్ సాగుదారులకు పరిహారంపై మెలిక
- ఆ భూములు ప్రభుత్వానివంటూ ప్రకటనలు
- ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న రైతులు
తుళ్ళూరు : అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నచందంగా ఉందన్న విమర్శలు రైతులనుంచి వెల్లువెత్తుతున్నాయి. నూతన రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అసైన్డ్ సాగుదారులకు నివాసప్రాంతంలో 800 గజాలు, వాణిజ్యప్రాంతంలో 100 గజాలు ఇస్తామని ప్రభుత్వం నమ్మబలికింది. దీంతో అసైన్డ్ సాగుదారులుగా ఉన్న పేదరైతులు 9.3 ద్వారా భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చి 9.14 ద్వారా భూస్వాధీన ఒప్పంద పత్రాలపై అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
వెంకటపాలెం, మందడం, నీరుకొండ, కురగల్లు, ఐనవోలుతో పాటు తుళ్ళూరుకు చెందిన అసైన్డ్ సాగుదారులుగా ఉన్న దళితులు సుమారు 1,400 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారు. తీరా చూస్తే అసైన్డ్ సాగుదారులకు ఎకరాకు రూ.30వేలు కౌలు పరిహారం అందించే విషయంలో అధికారులు గందరగోళానికి తెరలేపారు. ‘ఆ భూములు మీవి కావు.. ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములు’ అంటూ మెలిక పెట్టారు. వారం క్రితం రిజిస్ట్రేషన్లు జరపరాదంటూ ఆదేశించారు.
రైతుల ఆందోళన.. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిన్నమొన్నటి వరకు రిజిస్ట్రేషన్లకు అనుమతించి ఇప్పుడు హఠాత్తుగా అసైన్డ్ భూములనే పేరుతో గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎప్పుడోబ్రిటిష్ వాళ్ల హయాంలో ఇచ్చిన భూములని, కాలక్రమంలో కొద్దిమంది రైతులు అమ్ముకోవడాన్ని సాకుగా చూపి అన్యాయం చేస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఈ భూముల విషయమై అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారులు ఈనెల 5న సీపీఎం ఆధ్వర్యంలో తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంకు వచ్చిన కలెక్టర్ కాంతిలాల్‌దండే ను ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ అసైన్డ్ భూములను వారసత్వంగా సాగు చేసుకుంటున్న వారికి మాత్రమే కౌలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములపై క్రయవిక్రయాలు జరపరాదని అలాంటి వాటిని పక్కన పెడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటపాలెం, మందడం, కురగల్లు, నీరుకొండ, ఐనవోలు, తుళ్ళూరుకు చెందిన అసైన్డ్ సాగుదారులు ఆందోళనకు సమాయత్తయవుతున్నారు.