అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలనడం దుర్మార్గం
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ధ్వజం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూములపై లబ్ధిదారులైన పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఆ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ ఆదేశాలివ్వడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలైన లబ్ధిదారుల పేరుపై మాత్రమే రిజిస్టర్ చేసి వారికి మాత్రమే అమ్ముకునే అవకాశం వైఎస్ జగన్ హయాంలో ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని చెప్పారు. ఆ అసైన్డ్ భూములపై ఇప్పటికే అధికార పార్టీ నాయకులు కన్నేశారని, పలు చోట్ల వారు పేదలను బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో పలు రకాల భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించి, భూములపై హక్కులు కల్పించడం ద్వారా రైతులకు మేలు చేస్తే, చంద్రబాబు ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు భూమి కూడా రైతులకు ఇవ్వలేదని, కానీ గత ప్రభుత్వం కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేసిందని తెలిపారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment