సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ నిర్ణయంతో ఇకపై అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు లభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్నిరకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేస్తున్నాను’ అని చెప్పారు.
20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు..
ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ 1977లో ఏపీ శాసనసభ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ (పీఓటీ)–1977 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన పెద్దలు, ప్రభుత్వం.. పేదలకు ఇస్తున్న భూమి జమీందార్లకు, భూస్వాములకు అమ్మకం చేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధికల్పించడానికి ఇచ్చిన భూమి వారి వద్ద లేకుండా పోతుందనే విషయాన్ని గ్రహించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటున్న నేపథ్యంలో 1977 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 40 ఏళ్లు దాటాయి.
దేశంలోనూ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిరుపేదల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు లేకుండా.. అందరికీ అనేక ఉపాధిమార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈనేపథ్యంలో ఒక మేజర్ సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేశారు. ఆ ఆలోచనే.. ఏపీ కేబినెట్‌లో తీర్మానించినట్టుగా, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపైనున్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. అంటే, ఒక ప్రయివేటు భూమిపై వ్యక్తులకున్న హక్కులన్నీ... నేటికి 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్‌భూమి రైతులకు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది’ అని అన్నారు.
రైత్వారీ పట్టాపొందిన వారికే ఆ భూమిపై హక్కు
చట్టాలు తెలియక, లేదంటే అన్యాక్రాంతం చేసినా, లేక ఇప్పటికే భూములు అమ్ముకున్నట్లైతే.. వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం పీఓటీ చట్టంలో రిలీఫ్ ఉండదని చెప్పారు. చట్టంలో దాని స్థాయి యథారీతిగానే ఉంటుందని.. ఆ భూమిపై హక్కు అప్పట్లో ఒరిజినల్ రైత్వారీ పట్టా పొందిన రైతుకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేశారు. కనుక ఇప్పటికే సదరు అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకున్నవారికి హక్కులు ఉండవని అర్ధం చేసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూమి పొంది, 20 ఏళ్లకు పైబడి సాగుచేసుకుంటున్న భూమిపై సంబంధిత రైతుకు పూర్తిహక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.
15.21 లక్షల మంది రైతులకు లబ్ధి..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... రాష్ట్రంలో సుమారుగా 15.21లక్షల మంది అసైన్డ్ రైతులు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ‘20 ఏళ్లుదాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నవారి సంఖ్య ఇది. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 33.29 లక్షల ఎకరాల్ని రైతులకు అసైన్డ్ చేయగా 19.21 లక్షలమంది లబ్ధిదారులు ఉన్నారని.. వీటిల్లో 27.41 లక్షల ఎకరాల భూమిపై ప్రస్తుతం కేబినెట్ నిర్ణయంతో ఆంక్షల్ని ఎత్తివేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment