కోస్టల్ కారిడార్ భూముల్లో పనులను అడ్డుకున్న నిర్వాసితులు
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించే వరకు పనులు జరగనివ్వబోమని స్పష్టీకరణ
భారీగా మోహరించిన పోలీసులు
నిర్వాసితుల ఆందోళనతో పనులను తాత్కాలికంగా నిలిపివేత
హోంమంత్రి, జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్
నక్కపల్లి: నిర్వాసితుల డిమాండ్‌లు నెరవేర్చకుండా విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో చంద్రబాబు సర్కారు చేపట్టిన షెడ్లు, తాత్కాలిక వసతి సదుపాయాలు, రోడ్లు, సబ్‌స్టేషన్ వంటి నిర్మాణపు పనులను వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతల మద్దతుతో రైతులు, నిర్వాసితులు అడ్డుకున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడలో ఏపీఐఐసీవారి ఆధ్వర్యంలో రెండో రోజు పనులను ప్రారంభించారు. నక్కపల్లి, పాయకరావుపేట సీఐల ఆధ్వర్యంలో 70 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
తహసీల్దార్ అంబేద్కర్ పర్యవేక్షణలో ప్రారంభించిన ఈ పనులను కొనసాగకుండా రైతులు అడ్డుకోవడంతో 3 గంటలపాటు రైతులకు ఏపీఐఐసీ, రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. బాధిత రైతులకు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు అండగా నిలిచారు.
రైతుల డిమాండ్‌లు ఎప్పటిలోగా నెరవేరుస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పనులు జరగనివ్వబోమంటూ యంత్రాల ముందు బైఠాయించారు. ఇదే రైతులను గతంలో టీడీపీ నేతలు రెచ్చగొట్టి ఆందోళన చేయించారని, ఏ హామీల కోసం అయితే గతంలో ఆందోళన చేశారో అదే సమస్య పరిష్కరించకుండా పనులు ప్రారంభించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత వీసం రామకృష్ణ మండిపడ్డారు.
గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి ఎందుకు ఆందోళనలు చేశారని, పనులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పరిహారం చెల్లించినప్పుడు ఇంతకాలం భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తే పోలీసు బందోబస్తుతో పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రైతుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని, అప్పటి వరకు పనులు జరగనివ్వబోమని అన్నారు.
ప్రస్తుతం పనులు ప్రారంభించిన సర్వే నంబర్ 65లో ఉన్న ప్రభుత్వ భూముల్లో చాలామంది రైతులు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారని, వీరిలో కొంతమందికి పరిహారం ఇచ్చి మరికొందరికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. చివరకు అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వచ్చే మంగళవారం హోం మంత్రి, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని, చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment