అసైన్డ్ భూములపై నిగ్గు తేల్చిన డిప్యూటీ కలెక్టర్ల బృందం
పేదల భూములు కాజేశారంటూ కూటమి నేతల ఆరోపణలు
గత ప్రభుత్వంలో 609 ఎకరాలు ‘ఫ్రీ హోల్డ్’
హడావుడిగా కమిటీ వేసిన కూటమి ప్రభుత్వం
అన్నీ సక్రమంగా జరిగాయని ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక
మహారాణిపేట (విశాఖ): పేదల భూములు కాజేశారంటూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు చేసిన ప్రకటనలు అవాస్తవాలు అని తేలిపోయింది. ఆసైన్డ్ భూములు, డీ పట్టా భూములకు హక్కులు కల్పించేందుకు చేపట్టిన ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిప్యూటీ కలెక్టర్ల కమిటీ నిగ్గు తేల్చింది.
ఇదే నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. భూములపై విచారణకు వెళ్లిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ముందుగా వీరికి చెప్పి పంపిన పద్ధతి వేరు, గ్రామంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితి వేరుగా కనిపించింది. గ్రామంలో అడుగడుగునా విచారణ చేసిన డిప్యూటీ కలెక్టర్ల బృందానికి అక్రమాలు జరిగినట్టు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. దీంతో డిప్యూటీ కలెక్టర్లు అయోమయంలో పడ్డారు.
బెడిసికొట్టిన గోబెల్స్ ప్రచారం
ఫ్రీ హోల్డ్ పేరిట పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని చేసిన గోబెల్స్ ప్రచారం కమిటీ విచారణతో బెడిసికొట్టినట్టు అయ్యింది. అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఫ్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్ల జారీకి బ్రేకులు వేసి, రిజి్రస్టేషన్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. అంతేకాకుండా ఈ భూముల కొనుగోలు, ఇతర లావాదేవీలపై విచారణ చేయాలని నిర్ణయించి విచారణ కమిటీలను నియమించారు.
మొత్తం నాలుగు మండలాల్లో జరిగిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా కొనసాగింది. ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి చేత విచారణ చేపట్టారు. వీరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, అవకతవకలపై ప్రశ్నించారు. భూముల కోసం ఎవరైనా ఇబ్బందులు పెట్టారా? అని అడిగారు. ఎక్కడా ఫిర్యాదులు రాలేదు.
గ్రామ సభలో చెప్పలేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి చెప్పవచ్చని డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు చెప్పడం విశేషం. అయినా ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన ఫిర్యాదుల్లో లీగల్ హెయిర్ (కుటుంబ సభ్యులు) అయిన తమకు డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నారని, ఈ భూముల్లో తమకూ వాటా ఉందని, న్యాయం చేయాలనే ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్లు తలలు పట్టుకున్నారు.
పేదల భూములకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హక్కులు
పేదల భూములకు హక్కులు కల్పించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. డీ పట్టా భూములకు హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జీవో 596 జారీ చేసింది.
2002 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీ పట్టా భూములకు హక్కులు కల్పించడమే జీవో ముఖ్య ఉద్దేశం. హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేసి పేదలకు అందించేందుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జీవనాధారం కోసం భూమి క్రయ, విక్రయాలకు అవకాశం కల్పించారు.
609 ఎకరాలు ఫ్రీ హోల్డ్
ఈ జీవో ప్రకారం జిల్లాలో 609 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో 190 ఎకరాలకు రిజి్రస్టేషన్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా ఫ్రీ హోల్డ్ ప్రక్రియను నిలిపివేసింది. స్వయంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఈ భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్ల కమిటీ కూడా ఫ్రీ హోల్డ్, రిజి్రస్టేషన్ చేసిన భూముల రికార్డులతో పాటు యజమానులను కలిసి విచారించారు.
ఇందులో ఆనందపురం మండలంలో 407.77 ఎకరాలు, పద్మనాభంలో 129.60 ఎకరాలు, పెందుర్తిలో 20.04 ఎకరాలు, భీమిలిలో 52.51 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో కమిటీ ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment