రాజధానిలో ‘భూ’మంతర్‌ | Assigned Lands Looted From Farmers in amravati | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 17 2018 11:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

 Assigned Lands Looted From Farmers in amravati - Sakshi

రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూములు: 2,028 ఎకరాలు
లంక, శివామ్‌ జమీందార్‌ భూములు: 2,284 ఎకరాలు
ఎకరం అసైన్డ్‌ జరీబు భూమి విలువ: దాదాపు రూ.2.28 కోట్లు  
ఎకరం అసైన్డ్‌ మెట్ట భూమి విలువ: దాదాపు రూ.2.02 కోట్లు

సాక్షి, తుళ్లూరు: రాష్ట్ర రాజధాని అమరావతిలో పేద దళిత, గిరిజన రైతులను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు దారుణంగా వంచించారు. భూసమీకరణ కింద పరిహారం రాదంటూ మభ్యపెట్టి అసైన్ట్‌ భూములను కారుచౌకగా కొట్టేశారు. వాటిని భూసమీకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి, పరిహారం కింద నివాస, వాణిజ్య స్థలాలు సొంతం చేసుకున్నారు. అమాయక దళిత, గిరిజనుల భూములను లాక్కోవడానికి భూబకాసురులు సాగించిన కుట్రలు, కుతంత్రాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం సర్కారు మోసపూరితంగా వ్యవహరించింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తారనే ప్రకటన వచ్చాక ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల కన్ను పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూములపై పడింది.

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్‌ జమీందార్‌ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్‌ జమీందార్‌ భూములు. వీటిని 1954, 1971, 1976, 2005 సంవత్సరాల్లో భూమిలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం పంచి పెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను టార్గెట్‌ చేశారు. వీటి అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు.

బినామీలతో తప్పుడు ప్రచారం
అసైన్డ్‌ భూములను గతంలో ప్రభుత్వాలే ఇచ్చాయి కాబట్టి వాటిని భూసమీకరణ కింద సీఆర్‌డీఏ వెనక్కి తీసుకుని పైసా కూడా పరిహారం ఇవ్వదు అంటూ టీడీపీ నాయకులు, మంత్రులు తమ బినామీలతో ప్రచారం చేయించారు. ఇప్పుడు అమ్ముకుంటే ఎంతో కొంత సొమ్ము వస్తుందంటూ అసైన్డ్‌ భూముల అనుభవదారులను మాటలతో వంచించారు. అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులు కూడా వంతపాడారు. దీంతో భయాందోళనకు గురైన అసైన్డ్‌ రైతులు తమ భూములను నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసి ఇచ్చేశారు. ఆ వెంటనే సీఆర్‌డీఏ అధికారులు అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటించారు. తక్కువ ధరకు పేదల నుంచి భూములను కొట్టేసిన బడాబాబులు వాటిని ప్రభుత్వానికి ఇచ్చి, భారీగా పరిహారం జేబులో వేసుకున్నారు.  

అసైన్డ్‌ రైతులకు తీరని అన్యాయం
అధికార పార్టీ నేతలు అసైన్డ్‌ రైతులను బెదరగొట్టి ఎకరా భూమికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపే చెల్లించారు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్‌ భూముల ప్యాకేజీ ప్రకారం.. ఎకరానికి 500 గజాల చొప్పున నివాస స్థలం, 100 గజాల చొప్పున వాణిజ్య స్థలం దక్కించుకున్నారు. నివాస స్థలం గజం విలువ రూ.22,000, వాణిజ్య స్థలం రూ.26,000 పలుకుతోంది. దాని ప్రకారం 500 గజాల విలువ రూ.1.10 కోట్లు. 100 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.26 లక్షలు. అంటే ఎకరానికి రూ.1.36 కోట్ల విలువ ఉంది. అసైన్డ్‌ రైతులే తమ భూములను నేరుగా ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే జరీబు ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం దక్కేది. 800 గజాల నివాస స్థలం విలువ రూ.1.76 కోట్లు, 200 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.52 లక్షలు. అంటే ఎకరం భూమిని కారుచౌకగా ప్రభుత్వ పెద్దలకు విక్రయించడం వల్ల అసైన్డ్‌ రైతు రూ.2.28 కోట్లు నష్టపోయినట్లు లెక్క. మెట్ట భూమి ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ఈ లెక్కన ఎకరం మెట్ట భూమి విలువ రూ.2.02 కోట్లు. జరీబు రైతులకు రూ.50 వేలు, మెట్ట రైతులకు రూ.30 వేల చొప్పున పదేళ్లపాటు ప్రభుత్వం నుంచి పరిహారం ఆందుతుంది. ఈ పరిహారాన్ని కూడా అసైన్డ్‌ రైతులు కోల్పోయారు.

మా భూములు మాకిప్పించండి
‘‘రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నాయకులు తమ బినామీలను గ్రామాల్లోకి పంపించి.. అసైన్డ్‌ భూములకు పరిహారం రాదు, వీటిని తీసేసుకుంటుంది, కొనేవాళ్లు దొరికితే ఇప్పుడే అమ్మేసుకోండి అంటూ పుకార్లు పుట్టించారు. అధికారులు కూడా ఇవే మాటలు చెప్పారు. దీంతో భయపడి ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఆ భూములు రూ.కోట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయాలి’’
– పొన్నూరి నాగేశ్వరరావు,
అసైన్డ్‌ రైతు, ఉద్ధండ్రాయునిపాలెం

చట్టం.. మాకు చుట్టమే!

చట్టం ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయకూడదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆయా భూములను తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికి ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేద కుటుంబాలకు పంపిణీ చేయాలి. అయితే, అధికార పార్టీ నాయకులు చట్టాన్ని సైతం లెక్కచేయలేదు. అసైన్డ్‌ రైతులను భయపెట్టి భూములను లాగేసుకున్నారు. ఇదంతా బహిరంగంగానే జరిగినా అదేమిటని అడిగే నాథుడే లేకుండాపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement