యాజమాన్య హక్కుల కోసం 18 లక్షల మందికిపైగాపేద రైతుల ఎదురుచూపులు
దీనిపై ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ.. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా కదలని ఫైలు
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే అసైన్డ్ భూములపై హక్కులిచ్చిన ఆయా ప్రభుత్వాలు
ఈ అంశంపై భిన్నాభిప్రాయాలెన్నో.. బిల్లు పెడతారా, కమిటీ వేస్తారా?
భూబదలాయింపు నిరోధ చట్టానికి సవరణ చేస్తేనే సమస్యకు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే అంశంలో అడుగు ముందుకుపడటం లేదు. రాష్ట్రంలోని 18 లక్షల మందికిపైగా పేద రైతులు అసైన్డ్ భూములపై హక్కులు ఎప్పుడు కల్పిస్తారా అని ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూపరిపాలన అంశాలపై దృష్టి సారించి ఎంతో కొంత ముందుకెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అసైన్డ్‌పై హక్కుల అంశాన్ని మాత్రం పక్కన పెట్టినట్టు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.
చట్టాన్ని సవరించాల్సిందే!
భూమి లేని పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం, సామాజిక గుర్తింపు ఇవ్వడమే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణలో దశాబ్దాలుగా భూమి పంపిణీ జరుగుతోంది. పలు రకాల భూములను పేదలకు కేటాయిస్తూ వస్తున్నారు. ఇలా అసైన్ చేసిన భూములు అన్యాక్రాంతం కాకూడదనే ఉద్దేశంతో అసైన్‌మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ)– 1977 తీసుకొచ్చారు.
దాని ప్రకారం ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమి పొందినవారు.. ఆ భూమిని ఇతరులకు విక్రయించకూడదు. దానం చేయకూడదు. కౌలుకు కూడా ఇవ్వకూడదు. వారసత్వంగా అనుభవిస్తూ వెళ్లే హక్కులు మాత్రమే ఉంటాయి. అయితే మాజీ సైనికులు పదేళ్ల తర్వాత, రాజకీయ బాధితులు మార్కెట్ ధర చెల్లించి ఉంటే వెంటనే అమ్ముకునే హక్కులు కల్పించారు.
అయితే రైతుల అసైన్డ్ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు జరగాలంటే భూబదలాయింపు నిరోధ చట్టాన్ని సవరించాలి. ఇందుకోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది.
కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చేశారు!
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించడంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే వాటిపై అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 15 ఏళ్లకు, తమిళనాడులో 20 ఏళ్లకు, కేరళలో 25 ఏళ్లకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తాయి.
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో అయితే పదేళ్లకే యాజమాన్య హక్కులు వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అసైన్డ్ భూములపై హక్కులు కల్పించాలనే డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ దిశగా పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
భిన్నాభిప్రాయాలతో..
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించే అంశంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ హక్కుల కల్పన ద్వారా తెలంగాణలో పెరిగిన భూముల ధరలతో పేద రైతులకు ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కు టుంబ అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో భూములను అమ్ముకుని గట్టెక్కవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇలా హక్కులిస్తే ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతుందని.. సంపన్నుల చేతుల్లోకి భూమి వెళుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో కమిటీ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం భూభారతి చట్టం, ఇతర భూసంబంధిత అంశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో ఈ అసైన్డ్ భూముల అంశం పక్కన పడింది. ఇప్పటికైనా అసైన్డ్ భూ ముల విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment