సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్‌లో ఈసీ పేర్కొంది.
రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది.
అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment