‘సూటిగా కేసీఆర్‌ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?’ | CM Revanth Reddy Slams BJP and BRS | Sakshi
Sakshi News home page

‘సూటిగా కేసీఆర్‌ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?’

Published Mon, Feb 24 2025 8:33 PM | Last Updated on Mon, Feb 24 2025 8:35 PM

CM Revanth Reddy Slams BJP and BRS

కరీంనగర్ జిల్లా:  కరీంనగర్ సభను సక్సెస్ చేసి కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోట అని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘కరీంనగర్ జిల్లాకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా ఎదగడానికి ఘనత వహించిన పీవీ ఇక్కడివారు. అలాంటివారెందరికో కరీంనగర్ వేదిక. కరీంనగర్ చైతన్యవంతమైన వేదిక  ఆనాడు ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మంథని, సంగారెడ్డిల్లో మాత్రమే మనకు శాసనసభ్యులుండె. అయినా, జీవన్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించారు. 
కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని బీఆర్ఎస్ కోరుతుంది కదా మరి ఎవరిని వాళ్ళు గెలిపించాలని కోరుతున్నారో సమాధానం చెప్పాలి. సూటిగా కేసీఆర్ ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?, 

ఢిల్లీ కాళ్ళ ముందు బీఆర్ఎస్ నాయకులు సాగిలపడ్డారు  ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని బీఅర్ఎస్ ఉప ఎన్నికలు వేస్తే గెలుస్తామంటోంది. మీ నీతేంది, జాతేందని అడుగుతున్నా . ఈ 14 నెలల్లో మేం టీచర్స్ బదిలీలు, గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు కల్పించకపోతే మాకు ఓటు వేయకండని నేనే చెబుతున్నా. పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు ఓట్లెయకుంటే మీరు ఓటెయ్యొద్దని చెబుతున్నా . కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వకుండా అడుక్కునేలా చేశాడు ఇవాళ మీ జీతాలు సమయానికి వేస్తున్నాం కదా ఆలోచించి ఓటేయండని కోరుతున్నా. ఐటీఐలను టాటాలతో కలిసి ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం. 

60 ఎకరాల్లో 600 కోట్ల కార్పస్ ఫండ్ తో నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం . ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు . ఇవన్నీ చూసి ఆలోచించి మాకు ఓటేయండి. నిఖిత్ జరీన్, సిరాజ్ వంటివారిని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..?, బీఆర్ఎస్ సీటును గుంజుకున్నామనే బీఆర్ఎస్ అక్కసు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వానికి తెల్వకుండా ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు నిధులడుగుతున్నామని చెప్పడమేంటి..?, బీఆర్ఎస్ రైతుబంధులో ఇచ్చిన దానికంటే తాలుతప్ప పేరిట ధాన్యం కోత పెట్టి పంచుకుందెక్కువ. పదేళ్లలో నువ్వు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ల మోడీ నిర్లక్ష్యం పక్కనబెట్టి మమ్మల్ని ఓడగొట్టాలా?, సందెట్లో సడేమియా అన్నట్టు సంజయ్ బయల్దేరిండు. మా పొన్నం తెలంగాణా కోసం కొట్లాడిండు. ఈ సంజయ్ ఏం తెచ్చిండు..? చిల్లిగవ్వ తేలే.

ఏం తేలేకపోయినా పర్లేదు.. పెద్ద బీసీ మోదీ,  చిన్న బీసీ సంజయ్ బీసీ లెక్కలైనా తేల్చారా కనీసం?, కేసీఆర్ లెక్కలు నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అవే చిలుకపలుకులు పలుకుతున్నారు  1979లోనే మండల్ కమిషన్ 29 ముస్లింలలోని తెగలను బీసీల్లో కలిపింది. బండికి అవగాహన లేకుంటే వారి అధికారులను కనుక్కోవాలని చెబుతున్నా. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లింలను చేర్చలేదా.. మోదీ ఆ విషయాలు చెప్పలేదా..?, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వి చావు తెలివితేటలు.  మతం పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం కాదు తెలంగాణా. బండి సంజయ్ ని ఓర్వలేక అధ్యక్షుడి సీటు గుంజుకుండు. బండారు దత్తాత్రేయను పక్కకు జరిపి తాను సీటెక్కిండు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గా పక్కకు జరిగి ఓ బీసీ అయిన మహేష్ గౌడ్ కు సీటు అప్పజెప్పినా. మోదీ కౌగిలిలో మందకృష్ణ నలిగిపోయిండు. ఈ ఎమ్మెల్సీ సీటు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేదేముండదు. కానీ, దీనివెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉంది’ అని రేవంత్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement