సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే...ధిక్కరణ పిటిషన్ వేయాలని న్యాయవాది వేణుమాధవ్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది.
తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళ్‌పేటకు చెందిన తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకా రుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టు లో 2022లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామని తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాది వేణుమాధవ్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment