పతాక ఆవిష్కరణ అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లోనే 7,877 కేసులను పరిష్కారించామని, ఈ విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఇతర సిబ్బంది కృషి ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ఆన్‌లైన్ సేవలను మరింత చేరువ చేయడం, కాగిత రహిత ఫైలింగ్ వంటి అంశాలు కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభం కానుందని, అందరికీ అన్ని వసతులు, సాంకేతికతతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ న్యాయస్థానాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఈ జిల్లాల్లో అన్ని వసతులతో భవన నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ..
హైకోర్టు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీజే జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం భూమిపూజ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment