నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ అలోక్ | Next Generation Leader in Alok | Sakshi
Sakshi News home page

నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ అలోక్

Published Mon, Sep 22 2014 11:22 PM | Last Updated on Thu, Jul 11 2019 6:15 PM

నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ అలోక్ - Sakshi

నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ అలోక్

స్ఫూర్తి
 
కొందరు విజయం సాధించడానికి జీవితమంతా పోరాడుతూనే ఉంటారు. కానీ కొందరు విజయం సాధించడం కోసమే పుడతారు.
 అలోక్‌శెట్టి ఈ రెండో కోవకు చెందినవారు. ఆయన ఏదైనా అనుకోవడానికి వెనుక ముఖ్యమైన కారణం ఉంటుంది.
 అనుకున్నది సాధించడం వెనుక అలుపెరుగని కృషి ఉంటుంది.
 అదే ఆయనను ఇరవై ఎనిమిదేళ్లకే తిరుగులేని విజేతను చేసింది.
ఇటీవలే టైమ్స్ వారు ఎంపిక చేసిన ఆరుగురు ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్’లో ఒకరిగా నిలిచిన అలోక్ ప్రస్థానం, ఎంతో ఆసక్తికరం...

 
రెండు దశాబ్దాల క్రితం... బెంగళూరులోని ఓ సైట్‌లో కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. అంతలో ఒకాయన తన కొడుకును తీసుకుని వచ్చారు. తను పని చేసుకుంటుంటే, పిల్లాడు ఆడుకుంటాడులే అనుకున్నారాయన. కానీ ఆ అబ్బాయి ఆడుకోలేదు. అక్కడ జరిగే ప్రతి పనినీ గమనించాడు. అప్పుడే కాదు... తన తండ్రితో కన్‌స్ట్రక్షన్ సైటుకి వెళ్లిన ప్రతిసారీ ఆ బుడతడి కళ్లు అన్నిటినీ నిశితంగా పరిశీలించేవి. అక్కడ చెక్కముక్కలు, ఇనుపరేకులు, విరిగిన ఇటుకలు పడి వుండటం చూసి, అవన్నీ అలా వృథా అయిపోవాల్సిందేనా అనుకునేవాడు. ఆ ఆలోచనే నిర్మాణ రంగంలో సరికొత్త విధానాలకు తెర తీసేందుకు అతణ్ని ప్రోత్సహించింది. వ్యర్థాలతో సైతం నిర్మా ణాలు జరిపేందుకు పురికొల్పింది. అంతే కాదు... నిర్మాణ కూలీల అగచాట్లను చూసి ఆ పసిమనసు కదిలిపోయింది. తల దాచుకోవడానికి సరయిన చోటు కూడా లేక, పని జరిగేచోటే పాలిథీన్ షీట్లతో, గోనెలతో గుడిసెలు వేసుకునే వారి దీనస్థితి, పెద్దయిన తర్వాత పదిమంది గురించీ ఆలోచించేలా చేసింది. ఇవాళ ప్రపంచం ముందు అతణ్ని హీరోగా నిలబెట్టింది.
 
ప్రతి అడుగూ వినూత్నమే...

అందరూ చేసే పని అయినా, దాన్ని కొత్త తరహాలో చేయడమే తన శైలి అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడు అలోక్. ఈజిప్టు నాగరికతను పరిశీలిస్తే... ఇళ్లన్నీ రాళ్లతో నిర్మితమై ఉంటాయి. ఎందుకంటే, వారికి రాయి విరివిగా దొరికేది. మెసపొటేమియా నాగరికతా కాలంలో ఇటుకలతో నిర్మాణం కావించేవారు. ఎందుకంటే, వారికి మన్ను బాగా దొరికేది. కానీ ఈ కాలంలో ఇళ్లను నిర్మించాలంటే ఎక్కువగా లభించేది ఏంటి? ఈ ప్రశ్నకు అలోక్ చెప్పే సమాధానం చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ సమాధానం ఏమిటో తెలుసా... చెత్త. అవును. అలోక్ అదే చెబుతాడు. ఆయా నాగరికతల కాలంలో దొరికేది వాళ్లు వాడినప్పుడు, మన కాలంలో దొరికేది మనం వాడాలి కదా అంటాడు నవ్వుతూ. మన దేశంలో ఎక్కడ చూసినా కనిపించేది చెత్తే, దానివల్ల కాలుష్యం పెరుగుతుంది, వ్యాధులు ప్రబలుతాయి. పోనీ దాన్ని ఏరి పారేద్దామా అంటే అందుకు కొన్ని కోట్లు ఖర్చవుతాయి. అందుకే చెత్తను రూపుమాపడానికి దాన్ని తన పనికి ముడి సరుకుగా చేసుకున్న మేధావి అలోక్. రీసైక్లింగ్ వస్తువులతో పాటు స్థానికంగా దొరికే కలప, వెదురు వంటి వాటితో అతడు నిర్మించిన ఇళ్లను చూస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
 
అయితే ఇంత సృజనాత్మకత అతడికి అనుభవంతో రాలేదు. అలోక్ సహజంగానే సృజనశీలి. లేదంటే, పంతొమ్మిదేళ్ల వయసులోనే ఓ ఆసుపత్రిని డిజైన్ ఎలా చేయగలుగుతాడు?! బెంగళూరులోని ఆర్వీ కాలేజీలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు... ఓ కాంపిటీషన్ కోసం హాస్పిటల్ నమూనాను రూపొందించాడు అలోక్. మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. అది చూసిన ఓ వ్యాపారవేత్త... తాను జైపూర్‌లో నిర్మించాలనుకున్న హాస్పిటల్‌ని డిజైన్ చేయమని అడిగారు. ఆ వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అతడు పెద్ద కసరత్తే చేశాడు. పలువురు డాక్టర్లు, నర్సులను కలిశాడు. హాస్పిటల్ ఎలా ఉండాలనుకుంటారు అంటూ వాళ్ల ఆలోచనలను తెలుసుకున్నాడు. పలు ఆసుపత్రుల్లోని పేషెంట్లను కలిసి, మీకు హాస్పిటల్ ఎలా ఉంటే ఇష్టం అనడిగాడు. అందరి అభిప్రాయాలనూ తరచి చూసి, మంచి హాస్పిటల్ అంటే ఎలా ఉండాలో నిర్ణయించుకుని, అలా డిజైన్ చేశాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
 
మనసుతో చేస్తాడు...

ఓ ఇంటిని నిర్మించడమంటే... ఇటుకలు పేర్చి, సిమెంటు రాసి, పైకప్పు పరచడం కాదు అలోక్‌కి. అది చాలా గొప్ప పని అంటాడు. ముఖ్యంగా పేదవారికి ఓ ఇల్లు కట్టేటప్పుడు తను పొందే ఆనందం అంతా ఇంతా కాదంటాడు.
 
కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి వచ్చాక, డబ్బు ఎలా సంపాదిద్దాం అని ఆలోచించలేదు అలోక్. తన ప్రతిభను  దేశానికి, తనవారికి ఎలా ఉపయోగించాలా అని ఆలోచించాడు. పూరి గుడిసెలు చూసినప్పుడల్లా మథన పడేవాడు. వాన గట్టిగా కురిస్తే ఎగిరిపోయే టార్పాలిన్ పైకప్పులు, వరద నీటి ప్రవాహంలో కరిగి కలిసిపోయే మట్టి గోడలు చూసి... వారి కోసం తానేం చేయగలనా అని ఆలోచించాడు. వానకూ వరదకూ చెక్కు చెదరని ఇళ్లకు రూపకల్పన చేశాడు. వెదురు, కలపల సహాయంతో అతడు నిర్మించే ఆ ఇళ్లు చాలా తేలికగా ఉంటాయి. తుపాను, వరదల సమయంలో వేరే చోటికి కూడా తరలించేసుకోవచ్చు. కొన్ని ఇళ్లయితే డిస్‌మ్యాండిల్ చేసి మళ్లీ అతికించుకోవచ్చు. వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు. అందుకే అంటాడు అలోక్... ‘ఒక ధనవంతుడు సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి వెచ్చించే సొమ్ముతో పేదవాడికి ప్రశాంతమైన నివాసాన్ని ఏర్పరచవచ్చు’ అని!
 
ఇంకా నిర్మాణ రంగంలో అతడు చేసిన ప్రయోగాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ఓడల మీద సరుకులను రవాణా చేసే భారీ కంటెయినర్లను రెండు వందలకు మంది పైగా కూర్చోగల ఆడిటోరియమ్స్‌గా మార్చి చూపించాడు. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో... వ్యర్థాలతో తయారుచేసిన తేలికైన ఇటుకలతో ఇళ్లు నిర్మించాడు. అవి కూలినా ఆస్తి నష్టం, ప్రాణనష్టం ఉండదు. ఇలా అతడు నిర్మాణరంగంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి కాకముందే తాను నెలకొల్పిన ‘భూమిపుత్ర’ అనే నిర్మాణ సంస్థ ద్వారా తన ఆశయాలను నెరవేర్చుకుంటున్నాడు. మరో పదిమంది ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ సాయంతో దేశవ్యాప్తంతో ఎన్నో భారీ నిర్మాణాలను పూర్తి చేశాడు. అయితే వాటికంటే ఎక్కువ ఆనందం... పేదవారికి గూడు ఏర్పరచినప్పుడే కలుగుతోందని చెప్పే అలోక్ ఆదర్శనీయుడు, అనితరసాధ్యుడు!
 
- సమీర నేలపూడి
 
కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేసే మా నాన్నను చూసి నేను కూడా నిర్మాణ రంగంలోనే స్థిరపడాలనుకున్నాను.  డబ్బు సంపాదించడానికి కాక సమాజానికి ఉపయోగపడే ఆర్కిటెక్టును కావాలను కున్నాను. అలా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాను. అందుకే నేను చేసేదాన్ని ఆర్కిటెక్చర్ అనను. ప్రాబ్లెమ్ సాల్వింగ్ అంటాను.
 
తన భూమిపుత్ర సంస్థ ద్వారా స్కాలర్‌షిప్‌ను ఏర్పాటు చేసి, ఎంతోమంది పేద చిన్నారులకు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు అలోక్. బెంగళూరులోని ‘పరిణామ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు అలోక్. తీరిక దొరికితే వెళ్లి చేయడం కాదు... సేవ కోసం తీరిక చేసుకుంటాడు. ‘స్లమ్ డెవెలప్‌మెంట్ ప్రాజెక్ట్’  ద్వారా వారంలో ఒకరోజు తన టీమ్‌తో కలిసి మురికివాడల్లోని వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పనిలోనే ఉంటాడు. నిర్మాణాన్ని నిలబెట్టేందుకు ఉపయోగించే బొంగులు, నిర్మాణ సమయంలో మిగిలిపోయే వస్తు వుల్ని సేకరించి, వాటిని పేదవారి ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తుంటాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement