సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నిర్మాణ రంగంలోని బ్రిగేడ్ గ్రూపు నగరంలో తొలిసారిగా ఆదివారం ‘ది స్కైస్క్రాపర్ డాష్’ వర్టికల్ రన్‌ను (నిటారుగా పరుగెత్తడం) నిర్వహించింది. స్థానిక యశ్వంతపుర-రాజాజీ నగరలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 650 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన పోటీలు 10.15 గంటలకు ముగిశాయి. మారథాన్ రన్నర్స్ పాల్గొన్న ఈ పోటీల్లో పదేసి మందితో ఓ గ్రూపుగా ఏర్పడి, 31 అంతస్తుల్లోని 850 మెట్లను 70 సార్లు పరిగెడుతూ అధిరోహించారు. అంటే...ఎవరెస్ట్ శిఖరాన్ని (8,848 మీటర్లు) అధిరోహించినట్లు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వివేక్ పరిఖ్ రూ.20 వేల నగదుతో పాటు పతకాలను గెలుచుకున్నాడు. ఇతర సభ్యులతో జట్టుగా ఏర్పడినప్పుడు ఈ పోటీల్లో గెలిచి తీరాలని దృఢ సంకల్పంతో పాల్గొన్నామని అతను చెప్పాడు. తమ జట్టు సభ్యులకు గతంలో అనేక మారథాన్‌లలో పాల్గొన్న అనుభవం ఉందని తెలిపాడు. అయితే ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారని చెప్పాడు.
వెర్టికల్ రన్ వినూత్నమైనదే కాకుండా, సవాలుతో కూడినదని చెబుతూ, గతవారం ప్రయోగాత్మకంగా పరిగెత్తామని వివ రించాడు. కాగా ఈ పోటీల్లో పాల్గొన్న వారంతా బ్రిగేడ్ క్యాంపస్‌లోని షెరటాన్, ఓరియన్ మాల్‌లలో సుమారు 2.5 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు. చివరగా 850 మెట్లపై పరిగెడుతూ భవంతిపైకి చేరుకున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం నలుగురు విజేతలుగా నిలిచారు.
మెట్లపై పరిగెత్తే పోటీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడ అని, ఈ పోటీకి వరల్డ్ టవర్ రన్నింగ్ అసోసియేషన్ గుర్తింపు ఉందని బ్రిగేడ్ హాస్పిటాలిటీ డెరైక్టర్ నిరుప శంకర్ తెలిపారు. వరల్డ్ కప్ ర్యాంకింగ్స్‌కు కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న వారికందరికీ టైమింగ్ సర్టిఫికెట్లతో పాటు బహుమతులు ఇచ్చామని ఆమె తెలిపారు.
పరిగెడుతూ...మెట్లెక్కుతూ...
Published Mon, Jun 16 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM
Advertisement
Advertisement