architecture
-
ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!
ఎంతోమంది రాజులు రాజ్యాలేలారు.. కాలంతో పాటు కనుమరుగైపోయారు. అయితే వారు కట్టిన కట్టడాలు మాత్రం ఇప్పటికీ వారి ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. కట్టడాలకు అంత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా కొంత మంది ఆర్కిటెక్చర్లు లేదా సంస్థలు కనీవినీ ఎరుగని కట్టడాలను నిర్మించి అక్కడి ప్రాంతాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలు భూమిపై అనేకం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది (2025) 11 ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.న్యూ సిడ్నీ ఫిష్ మార్కెట్ (సిడ్నీ)ప్రపంచంలోని మూడో అతిపెద్ద చేపల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన 'సిడ్నీ ఫిష్ మార్కెట్' (Sydney Fish Market) మరింత పెద్దదికానుంది. దీనికోసం 3XN ఆర్కిటెక్ట్‌లు, ఆస్ట్రేలియన్ సంస్థ BVN ముందడుగు వేసాయి. లాజిస్టిక్‌లు, ఇతర కార్యకలాపాలు గ్రౌండ్ ఫ్లోర్లో నిర్వహించనున్నారు. పై అంతస్తులలో సందర్శకుల కోసం మార్కెట్ హాల్, వేలం హాలు ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్లు, రిటైలర్లు పాంటూన్లు వంటివన్నీ చూడవచ్చు.గ్రాండ్ రింగ్, ఒసాకా (జపాన్)ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. జపాన్ రెండవ నగరమైన ఒసాకాలో నిర్వహించే ఎక్స్పో 2025 కార్యక్రమానికి 28 మిలియన్ల మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. వేదిక మధ్య భాగంలో ఉంటుంది. గ్రాండ్ రింగ్ వృత్తాకార చెక్క నిర్మాణంతో పూర్తవుతుంది. 1970లో ఒసాకా మొదటిసారిగా ఎక్స్పోను నిర్వహించినప్పుడు, ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అవాంట్-గార్డ్ జపనీస్ వాస్తుశిల్పులు భారీ స్పేస్-ఫ్రేమ్ పైకప్పును నిర్మించారు. దాదాపు 6,46,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇది ప్రపంచంలోని అతిపెద్ద చెక్క భవనాలలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్, ఆక్స్ఫర్డ్ (యూకే)లైఫ్ అండ్ మైండ్ బిల్డింగ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చరిత్రలో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్ట్. ఈ నిర్మాణ డిజైన్ సూత్రాలు విద్యాసంబంధమైన వాటికి దగ్గరగా ఉన్నాయి. లోపల ఫ్లెక్సిబుల్ ల్యాబ్ స్పేస్‌లు వివిధ విభాగాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఇది కూడా గొప్ప ఆర్కిటెక్చర్ నిర్మాణాలలో ఒకటిగా ఉంటుంది.కెనడియన్ స్కూల్, చోలులా (మెక్సికో)మెక్సికోలోని చోలులాలోని ఆర్కిటెక్చర్ సంస్థ సోర్‌డో మడలెనోస్ కెనడియన్ స్కూల్ ప్రాజెక్ట్ చేపట్టింది. ప్రకృతిలో మమేకమయ్యే ఈ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులకంటే భిన్నంగా ఉంటుంది. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మెక్సికన్ ఆర్కిటెక్ట్ ఫెర్నాండో సోర్‌డో మడలెనో.. దీనిని పర్యావరణంతో మిళితం చేయడంతో పాటు భవనం కూడా ఆట స్థలంలో భాగమవుతుందని పేర్కొన్నాడు.టెక్కో అంతర్జాతీయ విమానాశ్రయం, నమ్ పెన్ (కంబోడియా)కంబోడియా దాని రాజధాని నమ్ పెన్.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత పెద్దది కానుంది. ఇది ఇప్పటి కంటే ఆరు రెట్లు ఎక్కువ మంది సందర్శకులను నిర్వహించగల సామర్థ్యం పొందనుంది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. సిటీ సెంటర్‌కు దక్షిణంగా 12 మైళ్ల దూరంలో ఉన్న ఈ టెర్మినల్ భవనం ఆగ్నేయాసియాలో అతిపెద్దది.సౌత్ స్టేషన్ రీడెవలప్మెంట్, బోస్టన్ (ఇంగ్లాండ్)న్యూ ఇంగ్లాండ్‌లో అత్యంత రద్దీగా ఉండే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ హబ్ అయిన బోస్టన్ సౌత్ స్టేషన్‌ను కూడా రీడెవలప్మెంట్ చేయనున్నారు. ఇది పూర్తయితే.. బస్సు, రైలు సామర్థ్యం వరుసగా 50 శాతం, 70 శాతం పెరుగుతుంది. 1899 నుంచి అలాగే ఉన్న ఈ నిర్మాణం కొత్త హంగులు సంతరించుకోనుంది.గోథే ఇన్స్టిట్యూట్, డాకర్ (సెనెగల్)"నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్"గా ప్రసిద్ధి చెందిన ప్రిట్జ్కర్ ప్రైజ్‌ని.. మొట్టమొదటి ఆఫ్రికన్ విజేత ఫ్రాన్సిస్ కేరే తన స్వదేశీ ఖండంలో నిర్మించిన వాతావరణాన్ని మార్చనున్నారు. 18,300 చదరపు అడుగుల భవనం వక్రతలు చుట్టుపక్కల ఉన్న పందిరి రూపురేఖలను ప్రతిబింబించేలా రూపొందించారు. దీనిని ప్రధానంగా స్థానికంగా లభించే ఇటుకలతో నిర్మించారు. కాగా ఇది ఈ ఏడాది మరింత సుందరంగా మారనుంది.అర్బన్ గ్లెన్, హాంగ్జౌ (చైనా)బీజింగ్‌లోని సీసీటీవీ హెడ్‌క్వార్టర్స్.. చైనాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సమకాలీన భవనంగా మారనుంది. తూర్పు నగరమైన హాంగ్జౌలో దాదాపు 9,00,000 చదరపు అడుగుల ఆఫీసు, హోటల్, విశ్రాంతి స్థలాన్ని కలిగి ఉన్న ఒక జత టవర్లు అర్బన్ గ్లెన్లో అత్యంత అద్భుతమైనవిగా రూపుదిద్దుకోనుంది.రియాద్ మెట్రో, రియాద్ (సౌదీ అరేబియా)2020లలో సౌదీ అరేబియాలో ఈ రియాద్ మెట్రో వెంచర్లను ప్రకటించారు. ఇది క్యూబ్ ఆకారంలో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా మారనుంది. ఇది ఆరు లైన్లతో ఉంటుంది. దీని రోజువారీ సామర్థ్యం రోజుకు 3.6 మిలియన్లు. ఈ ప్రాజెక్టు నవంబర్‌లో ప్రారంభమైంది.స్కైపార్క్ బిజినెస్ సెంటర్, లక్సెంబర్గ్ (ఫ్రాన్స్)యూరప్ దేశంలోని కొత్త పబ్లిక్ భవనాలు కనీసం 50 శాతం కలపను కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే లక్సెంబర్గ్ రూపుదిద్దుకుంటోంది. ఇది ఖండంలోని అతిపెద్ద హైబ్రిడ్ చెక్క భవనాలలో ఒకటిగా మారనుంది. దీని విస్తీర్ణం 8,44,000 చదరపు అడుగులు. ఇందులో సుమారు 5,42,000 క్యూబిక్ అడుగులు కలపతో మిర్మించనున్నారు. ఈ భవనం, మొదటి దశ ఫిబ్రవరితో పూర్తవుతుంది.డాంజియాంగ్ బ్రిడ్జ్, తైపీ (తైవాన్)డాన్జియాంగ్ బ్రిడ్జ్ దాదాపు తొమ్మిదేళ్లుగా, దివంగత జహా హదీద్ సంస్థ తన వారసత్వాన్ని కొనసాగించింది. 3,018 అడుగుల పొడవైన నిర్మాణం తైవాన్ రాజధాని తైపీ గుండా ప్రవహించే తమ్సుయ్ నది ముఖద్వారం మీదుగా నాలుగు ప్రధాన రహదారులను కలుపుతుంది. మొత్తం నిర్మాణం కేవలం ఒకే కాంక్రీట్ మాస్ట్‌తో ఉంటుంది. ఇది పూర్తయిన తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్-మాస్ట్ అసమాన కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్ అవుతుంది. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. రేమండ్ కట్టడం
సైదాబాద్: నిజాం రాజు సైనికాధికారి, క్రైస్తవుడైన జనరల్ మాన్షియర్ రేమండ్‌ను అప్పటి స్థానికులైన ముస్లింలు మూసారహీంగా, హిందువులు రామ్‌గా పిలిచి తమ అభిమానాన్ని చాటుకునేవారు. అందుకే ఆయన పేరుగా ఆయన నివసించిన ఆ ప్రాంతం మూసారాంబాగ్గా ఏర్పడింది. అంతగా ప్రజల మన్ననలు పొందిన ఆయన స్మారకార్థం నిర్మించినవే రేమండ్ స్థూపం, సమాధులు. రెండో నిజాం రాజు నిజాం అలీ ఖాన్ పాలనలో ఫ్రెంచ్ దేశస్తుడైన రేమండ్ సైనికాధికారిగా రాజు సైన్యంలోని ఫిరంగి సేనలను పటిష్టంగా తీర్చిదిద్దారు. 1798లో ఆయన మరణానంతరం ఆయన మృతి చిహా్నలుగా అప్పటి మలక్‌పేటలోని ఎత్తైన కొండ ప్రాంతమైన ఆస్మాన్‌ఘడ్‌లో నిర్మాణాలు చేశారు. 18వ శతాబ్దంలో యూరోపియన్ రీతిలో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఎత్తైన కొండపై... ఎత్తైన కొండ ప్రాంతంపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడల్పుతో గద్దెను నిర్మించారు. ఆ గద్దెపై 23 అడుగుల ఎత్తులో రేమాండ్ స్మారక స్థూపాన్ని నిర్మించారు. స్తూపం పక్కనే 28 స్తంభాలతో గ్రీకు శిల్పకళారీతిలో నిర్మించిన ఆయన సమాధి ఉంటుంది. ఆయన స్థూపానికి సమీపంలోనే వారి కుటుంబ సభ్యుల పెంపుడు జంతువులైన గుర్రం, శునకం సమాధులను సైతం నిర్మించారు. 18వ శతాబ్దపు నిర్మాణ శైలితో ఉండే ఈ కట్టడాలు చూపరులను ఆకట్టుకుంటాయి.పురావస్తు శాఖ చొరవతో..దశాబ్దం క్రితం వరకూ ఈ కట్టడాల ప్రాంతంపై అధికారుల పర్యవేక్షణ కొరవడి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఆ తరువాత పురవాస్తుశాఖ అధికారుల చొరవతో కట్టడాల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పచ్చటి లాన్లతో, మెరుగైన సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తైన ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఇటీవల సినిమాలు, సీరియళ్లు సైతం విరివిగా చిత్రీకరిస్తున్నారు. -
Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు. ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు. సృజనతో అడుగు పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.. ’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది. అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు. 200 భవనాల జాబితా భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది. ‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్టాక్కి కన్వీనర్‌గా ఉన్నాను. లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్! 2018లో లేహ్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను. లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను. ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే. -
ప్రపంచ నగరిగా అయోధ్య
సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. నగరాన్ని భారీగా విస్తరించి.. కొత్త మాస్టర్ ప్లాన్‌లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్‌తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్‌ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్‌షిప్‌లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు. ► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. సోలార్ సిటీగా అయోధ్య అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్‌పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్‌్కలు, మొబైల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్‌తోనే పనిచేయనున్నాయి. ► సరయూ నదిలో సౌర విద్యుత్‌తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి ఇంధనం అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది. విస్తృతంగా వసతి సౌకర్యాలు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది. -
సోషల్ మీడియాతో పాపులర్ సింగర్ అయిన డిసోజా
బెంగళూరుకు చెందిన సింగర్, సాంగ్ రైటర్ ఫ్రిజెల్ డిసోజా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రకరకాల పాటల గురించి పోస్ట్‌లు, వీడియోలు పెట్టడం ద్వారా ఇండియన్ ఇండీ మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చింది. లాక్డౌన్ కాలంలో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘సమ్‌థింగ్ న్యూ’ పాట ఐడియా వచ్చింది. ఈ డెబ్యూ సాంగ్ ద్వారా డిసోజా మెలోడియస్ వాయిస్‌కు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించి, వినిపించే డిసోజా లైవ్ ప్రోగ్రామ్స్‌లో కూడా పాల్గొంది. ఫస్ట్ టూర్లో వచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక రచన విషయానికి వస్తే...లవ్, హార్ట్‌బ్రేక్‌కు సంబంధించిన అంశాలపై పాటలు రాయడం డిసోజాకు ఇష్టం.‘వ్యక్తిగత అనుభవాల నుంచి చూసిన, విన్న విషయాల ఆధారంగా పాటలు రాయడం నాకు సులభం’ అంటుంది. మొదట్లో తన పాటల్లో ఎలక్ట్రిక్ గిటార్, డ్రమ్‌ల శబ్దం లిరిక్స్‌ను డామినేట్ చేసేది. ఇప్పుడు మాత్రం లిరిక్స్ కూడా స్పష్టంగా వినబడే ఈజీ–టు–లిజెన్ వైబ్కు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేట్ అయిన డిసోజా ఫుల్–టైమ్ మ్యూజిషియన్‌గా ఉండడమే తనకు ఇష్టం అంటుంది. View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) -
గ్రౌండ్ జీరో హీరో
కళారూ΄ాలు అద్భుతాలకు మాత్రమే పరిమితం కానక్కర్లేదని చెబుతాయి సాహిల్ నాయక్ మినీయేచర్లు. అతడి కళాప్రపంచంలో నిర్మాణాల రూపంలో అసహాయుల హాహాకారాలు వినిపిస్తాయి. మహా నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీల జాడలు దొరుకుతాయి. పల్లకీ మోసిన బోయీల అడుగు జాడలు కనిపిస్తాయి.... గోవాలోని పొండలో పెరిగిన సాహిల్ నాయక్‌కు చిన్నప్పుడు ఒక్క దీపావళి పండగ వస్తే... వంద పండగలు వచ్చినంత సంబరంగా ఉండేది. రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారుచేసే పనుల్లో బిజీ బిజీగా ఉండేవాడు. చిన్నప్పుడు నేర్చుకున్న బొమ్మలకళ ఊరకే పోలేదు. భవిష్యత్‌లో స్కల్ప›్టర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోడానికి పునాదిగా నిలిచింది. బరోడాలోని ఎంఎస్ యూనివర్శిటీలో చదువుకున్న సాహిల్ తన డెబ్యూ సోలో ఎగ్జిబిషన్‌ను ఆ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి షో కోల్‌కత్తాలోని ఎక్స్పెరిమెంటల్ గ్యాలరీలో జరిగింది. ‘గ్రౌండ్ జీరో’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లోని మినీయేచర్లు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. సాహిల్ కళాప్రపంచం గురించి చె΄్పాలంటే... అందానికి, అద్భుతానికి మాత్రమే పరిమితమై ఉంటే ‘గ్రౌండ్ జీరో’లో విశేషం ఉండేది కాదేమో! సాహిల్ మినీయేచర్స్ను ‘ఆర్టిస్టిక్ రిప్రెంజటేషన్’కు మాత్రమే పరిమితం చేయడం సరికాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాహిల్ కళా ప్రపంచంలో యుద్ధానంతర, ప్రకృతి విలయం తరువాత కట్టడాల కళ్లలో కనిపించే దైన్యం కదిలిస్తుంది. ప్రశ్నిస్తుంది. ప్రకృతి విలయాల తరువాత దృశ్యాలపై ఆసక్తితో వందలాది ఫొటోలను అంతర్జాలంలో చూసేవాడు. పాత పుస్తకాల్లో దృశ్యాల వెంట వెళ్లేవాడు సాహిల్. అద్భుతమైన ఆర్కిటెక్చర్ కొలువుదీరిన ఊళ్లను వెదుక్కుంటూ వెళ్లేవాడు. ఈ ప్రయాణంలో తనకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన గ్రామాల్లో ఒకటి గోవాలోని కుర్దీ. డ్యామ్ నిర్మాణం వల్ల ఈ ఊళ్లోని వాళ్లు నిరాశ్రయులు అయ్యారు. ఎక్కడెక్కడికో వెళ్లి బతుకుతున్న వాళ్లు వేసవి సమయంలో మాత్రం తమ ఊరి ఆనవాళ్లను చూసుకోవడానికి తప్పకుండా వస్తారు. శిథిలమై, చిరునామా లేని ఊరిని తన కళలోకి తీసుకువస్తాడు సాహిల్. టెక్ట్స్, క్లిప్స్, రి΄ోర్ట్... తన అన్వేషణలో ఏదీ వృథా పోయేది కాదు. కొన్ని కట్టడాలను ఆర్ట్‌కి తీసుకురావడానికి ప్రత్యేకమైన పరికరాలను ఆశ్రయించడమో, తయారుచేయడమో జరిగేది. ‘ఆర్కిటెక్చర్ అనేది కళ కంటే ఎక్కువ. చరిత్రకు మౌనసాక్షి’ అంటాడు సాహిల్. ఆ మౌన సాక్షిని తన కళతో అనర్ఘళంగా మాట్లాడించడం సాహిల్ ప్రత్యేకత! ‘మాన్యుమెంట్స్, మెమోరియల్ అండ్ మోడ్రనిజం’ పేరుతో చేసిన సెకండ్ సోలో షోకు కూడా మంచి స్పందన లభించింది. చాలా మంది సాహిల్ మొదటి షో ‘గ్రౌండ్ జీరో: సైట్ యాజ్ విట్నెస్/ఆర్కిటెక్చర్ యాజ్ ఎవిడెన్స్’ తో ΄ోల్చుకొని మంచి మార్కులు వేశారు. ‘ఎక్కడా తగ్గలేదు’ అని ప్రశంసించారు. కోల్‌కత్తాలో జరిగినా, అక్కడెక్కడో జ΄ాన్లోని కాంటెంపరరీ ఆర్ట్స్ సెంటర్లో జరిగినా సాహిల్ ఎగ్జిబిషన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఒక్కటే. ‘మన ఆలోచనల్లో ఉండే సంక్లిష్టతను కళలోకి తీసుకురావడం అంత తేలిక కాదు. సాహిల్ మాత్రం ఆ క్లిష్టమైన పనిని తేలిక చేసుకున్నాడు’ అంటారు ‘ఖోజ్’ గ్యాలరీ క్యూరెటర్, ్ర΄ోగ్రామ్ మేనేజర్ రాధ మహేందు. గోవాలో మొదలైన సాహిల్ ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే ‘గౌండ్ జీరో’ రూపంలో గ్రౌండ్ రియాలిటీకి ఎప్పుడూ దూరం కాలేదు. అదే అతడి విజయ రహస్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్కిటెక్చర్ దుర్మరణం
మైసూరు: నగరంలోని పోలీస్ లేఔట్లో నివాసముంటున్న బీఎస్ఎన్ఎల్ రిటైర్డు ఉద్యోగి కూతురు లత (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్న లత శుక్రవారం స్కూటర్లో ఆఫీసుకు వెళ్తోంది. రింగ్ రోడ్డులో బండిపాళ్య వద్ద వేగంగా వచ్చిన మరో స్కూటర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లత తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. సిద్ధార్థ నగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ) -
ఆర్కిటెక్చర్ వాక్.. అడుగు అడుగులో నిర్మాణం
నడవాలి.. నడతలు మార్చడానికి నడవాలి.. నడతలు నేర్పడానికి ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్ ‘నడక’ గురించి తెలుసుకుంటే ఈ మాటలు ముమ్మాటికి నిజం అనిపిస్తుంటుంది. 1700 కిలోమీటర్లు... కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు దాదాపు రెండు నెలల ప్రయాణం 54 ఏళ్ల వయసులో వందల కిలోమీటర్ల నడక దేనికోసం..? ‘నవభారత నిర్మాణం’ కోసం అంటూ ఆర్కిటెక్చర్ వాక్ గురించి ఆనందంగా వివరిస్తారు ఆమె. గీతా బాలకృష్ణన్ పుట్టింది చెన్నైలో. చదివిందంతా హైదరాబాద్‌లో. 1982లో కలకత్తాకు వెళ్లిపోయి, అక్కడే ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగుతున్నారు. దేశంలో భవన నిర్మాణ రంగం గురించి రాబోయే తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ఒంటరిగా 1,700 కిలోమీటర్లు నడిచిన ఈ ఆర్కిటెక్ట్ దారి గురించి మరింత వివరంగా.. ► ప్రయాణంలో గ్రహించిన విషయాలు.. అనుకున్న ప్లాన్ ప్రకారం గత శనివారం ఉదయం 5:30కి ఢిల్లీకి చేరుకోవడంతో నా ‘వాక్’ పూర్తయింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో తప్ప ఆర్కిటెక్చర్ గురించి చాలా మందికి తెలియదని ఈ ‘వాక్’ ద్వారా మరింతగా అర్థమయ్యింది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటారు తప్ప ఆర్కిటెక్ట్ కావాలని, అదొక రంగం ఉంటుందని తెలియదు. చిన్న చిన్న టౌన్లు మొదలు పల్లెల్లో జనానికి భవన నిర్మాణాల డిజైన్స్ గురించి, ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలనుకుని ఫిబ్రవరి 13న ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఈ ప్రయాణం మొదలైన మొదటి రోజు భవన నిర్మాణాలు జరుగుతున్న చోటుకు వెళ్లాను. ‘ఎందుకు కడుతున్నారు, ఏం పనిచేస్తున్నారు.. ప్లానింగ్ ఏంటి?’ అని అడిగితే ‘అవేమీ మాకు తెలియదు. కాంట్రాక్టర్ వస్తారు. ఇంత ఎత్తులో కట్టండి, అలా పని చేయండి.. అని చెబితే అలాగే చేస్తాం’ అని చెప్పారు. ఆర్కిటెక్ట్ వచ్చి వారితో మాట్లాడి, తగిన డిజైన్ ఇస్తే కదా.. ఆ పనివాళ్లలో నిర్మాణం పట్ల ప్రేమ కలిగేది. ఇల్లు, భవనం అంటే.. నాలుగు గోడలు రూఫ్ మాత్రమే కాదు కదా! ఇది కూడా బాధ్యతగా చేయాల్సిన పని అని ఎవరికీ తెలియడం లేదు. ► ఈ ‘వాక్’ వల్ల జనాల్లో అవగాహన వస్తుందంటారా? నా ఒక్కదాని వల్ల అందరిలోనూ అవగాహన వస్తుందని చెప్పలేను. కానీ, జనాల్లోకి కొంతవరకు సందేశం వెళుతుంది. ప్రభుత్వం, ఆర్కిటెక్ట్ అసోషియేషన్స్.. అందరూ కలిసి అవగాహన కల్పించడానికి ఇదో మార్గం అనుకున్నాను. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆర్కిటెక్చర్ ఈ రెండు కౌన్సిల్స్ నేను చేసే వాక్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జర్నీలో చాలా సమస్యలు ఉన్న ప్రాంతాలను సందర్శించాను. వాటిని గుర్తించి, ఒక డాక్యుమెంట్ చేసే పనిలో ఉన్నాను. నాకు ఇది ఒక పరిశోధనగా ఉపయోగపడింది. ఈ వాక్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ► మీ రోజువారీ ప్రయాణం ఎలా ఉండేది? మొదట ఉదయం 6 గంటలకు ప్రారంభించినా, ఎండకారణంగా ఉదయం 4 గంటలకే నడక మొదలుపెట్టేదాన్ని. ఈ జర్నీలో చాలామంది నుంచి చాలా ప్రేమ దక్కింది. కొందరు వచ్చి యోగక్షేమాలు అడిగేవారు. కొందరు మంచి నీళ్లు, టీ ఇచ్చేవారు. మరికొందరు టిఫిన్‌కు ఆహ్వానించేవారు. కొన్ని చోట్ల వాళ్ల ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసి, మరీ పిలిచారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రజల్లో ఉన్న ఇంత మంచిని నేరుగా చూడగలిగాను. నేను నడుస్తూ వెళుతుంటే స్థానిక మీడియా వాళ్లు చూసి, విషయమేంటో కనుక్కొని, నన్ను అనుసరిస్తూ నా గురించి పేపర్లలో రాశారు. నేను ముందుకు వెళ్లినప్పుడల్లా స్థానికులు ‘మీ గురించి చదివాం, చూశాం..’ అని చెబుతుండేవారు. ► ప్రయాణంలో అద్భుతం అనిపించినవి? మార్గంలో నా చూపంతా భవననిర్మాణాలవైపుగా ఉండేది. వెస్ట్ బెంగాల్ ఆర్కిటెక్చర్, జార్ఞాండ్లోని ఆర్కిటెక్చర్ చాలా భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో భర్రా అని గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కట్టిన ఒక ఇంటికి వెళ్లాను. మట్టితో కట్టిన ఇల్లు అది. వాళ్ల కుటుంబసభ్యులే కలిసి స్వయంగా కట్టుకున్నారు. రూఫ్‌కి కూడా వాళ్లే తయారు చేసుకున్న మట్టి పెంకులు వాడారు. ఇంట్లో బెడ్ నుంచి ప్రతీది వారి రూపకల్పనే. అలాంటి ఇళ్లు అక్కడ మరికొన్ని చూశాను. ఇంటి నిర్మాణాల్లో వారి ప్రతిభ చాలా వండర్ అనిపించింది. ► వందల కిలోమీటర్ల వాక్ ఒంటరిగా చేయడానికి మీ కుటుంబం ఒప్పుకుందా? ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. ఇన్నేళ్లకు ఓ ఉదయం లేచి సడెన్‌గా ఇంట్లోవారికి నా కల గురించి చెబితే వెంటనే సపోర్ట్ చేయరు. మొదటి నుంచి నా కుటుంబ సభ్యులకు నా ఇష్టాయిష్టాలేంటో తెలుసు. నేను చేస్తున్నపని తెలుసు. అలాగే, సొంతంగా తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసు. వారితో నా రంగానికి సంబంధించిన విషయాలనూ చర్చిస్తూనే ఉంటాను. నా భర్త, నా కొడుకు కూడా నాతో కలిసి 200 కిలోమీటర్ల వరకు వచ్చారు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ప్రమాదాల గురించి మనం భయపడినా, ఇంట్లో వాళ్లు ఆపేసినా ముందడుగు వేయలేం. గ్యాలియర్‌లో ఒక సైక్లింగ్ యాక్సిడెంట్లో కింద పడిపోయాను. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందన్నారు. చేరాల్సిన గమ్యం ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. బ్రేక్ వస్తుందేమో అనుకున్నాను. కానీ, పర్వాలేదు. 4–5 రోజుల్లో కోలుకుని, నా నడకను కొనసాగించాను. ► మీరు మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లారు కదా... అక్కడి వారికి ఏం చెప్పారు? గ్రామాల్లో ఎవరైనా పిల్లవాడిని ‘భవిష్యత్తులో ఏమవుతావు’ అంటే ‘టీచర్’ అనే సమాధానం ఎక్కువ విన్నాను. అంటే, వాళ్ల కళ్ల ముందు రోజూ టీచర్ ఒకరే కనిపిస్తారు. మరో వృత్తి గురించి వారికి అంతగా తెలియదు. అందుకే, టీచర్లను కలిసి ఆర్కిటెక్చర్ వృత్తి గురించి, బిల్డింగ్ డిజైన్ గురించి పిల్లలకు చెప్పమని, వారిని ట్రెయిన్ చేయమని వివరించాను. ► మీరు రన్నర్ అని కూడా విన్నాం. ఈ వాక్‌కి మీరు ముందు చేసిన కార్యక్రమాలు..? 2014లో రన్నింగ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు చిన్న చిన్న వ్యాయామాలు చేసేదాన్ని. అప్పటినుంచి 10 కిలోమీటర్ల వాక్, 20 కిలోమీటర్లు రన్, 30 కిలోమీటర్ల మారథాన్ చేశాను. ఇలా లాంగ్ వాక్ చేయడం మాత్రం మొదటిసారి. ఈ వాక్‌లో ఒక రోజు వాక్ అండ్ రన్, మరో రోజు వాక్. మిక్స్‌డ్‌గా చేశాను. రోజూ 20–30 కిలోమీటర్లు నడిచాను. ఈ వాక్ రాబోయే రోజుల్లో చేసే పనులకు ముందడుగు అనుకుంటున్నాను. ► ఆర్కిటెక్ట్‌గా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నవి..? ఈ వాక్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక డాక్యుమెంటరీ చేయడానికి మరో 3–4 నెలల సమయం పడుతుంది. వాక్ గురించి కాకపోయినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక... లలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నాను. దేశంలోని అన్ని జిల్లాలకు వెళ్లాలని, ఆర్కిటెక్చర్ రంగం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ రంగంలోకి రావాలని, ప్రతిభ కనబరుస్తున్న స్టూడెంట్స్‌కి ఫెలోషిప్స్ ఇస్తూ ప్రోత్సహించాలి. ఎక్కడ ఆర్కిటెక్చర్ రంగంలో సమస్యలు ఉన్నాయో గుర్తించి, పరిష్కరిస్తూ వెళ్లాలనుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
అధిరోహణ: బుక్ షెల్ఫ్ నుంచి భవనం దాకా!
శిఖరాలను అధిరోహించాలంటే పర్వతాల దగ్గరకే చేరుకోనక్కర్లేదు. ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడం కూడా అధిరోహణే. ప్రతి అధిరోహణలోనూ సవాళ్లు ఉంటాయి. సానుకూలంగా గమనిస్తూ అధిగమిస్తేనే దారి సుగమమం అవుతుంది. ఢిల్లీలో ఉంటున్న 30 ఏళ్ల భవ్నా ఖన్నా పురుషుల ప్రపంచమైన భవన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేసి ‘శభాష్’ అనిపించుకుంటోంది. తనే శిఖరమంతగా ఎదిగి మరికొందరికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఆర్కిటెక్చర్ రంగం దాదాపు పురుషులదే అయి ఉంటుంది. అలాంటి రంగంలో మూడు వేల రూపాయల నుంచి వర్క్ మొదలుపెట్టిన భవ్నా ఖన్నా నేడు మూడు కోట్ల ప్రాజెక్ట్‌లను కూడా అందిపుచ్చుకుంటోంది. ఢిల్లీవాసి అయిన భవ్నా పెద్ద పెద్ద భవనాలను, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్, రిసార్ట్స్నూ డిజైన్ చేస్తోంది. 30 ఏళ్ల భవ్నా భవన నిర్మాణ రంగంలో ఎదుగుతున్న తీరు, సమస్యలను అధిగమిస్తున్న విధానం నవతరానికి స్ఫూర్తిదాయకం. ‘‘ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్తైన భవనాలను చూసి, ఎంతో ఇష్టపడేదాన్ని. కొన్నాళ్లకు నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న నా 13వ పుట్టిన రోజున బిల్డింగ్ గేమ్ కానుకగా ఇచ్చారు. ఆ గేమ్‌లో బ్లాకులను కలుపుతూ ఏదైనా భవనాన్ని కట్టచ్చు. ఆ ఆటలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయేదాన్ని. కట్టిన వాటిని పడేస్తూ, తిరిగి కడుతూ చాలా సమయం గడిపేసేదాన్ని. పన్నెండవ తరగతి తర్వాత, ఐదేళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ కోర్సు చేశాను. ఏడాది పాటు ఉద్యోగం చేశాను. తర్వాత ఉద్యోగంలో నాకోసం నేనేదీ చేయలేనని అర్థం చేసుకున్నాను. నా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకున్నాను. ఎవరి సూచనలతోనో పనిచేయలేకపోయాను. నాకు నా సొంత ఆలోచనలు ఉన్నాయి. భవనం లేదా ఫామ్ హౌజ్ లేదా కోట దేనిని నిర్మించాలన్నా ముందగా నా ఆలోచనలను కాగితంమీద పెట్టేదాన్ని. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ.. భవనాన్ని నిర్మించాలంటే ఒక్కో ఇటుకను పేర్చాలి. అలాగే, సిమెంట్, స్టీల్, స్టోన్.. ప్రతీ పనిలో నైపుణ్యం చూపాలి. అందుకు తగిన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నా నైపుణ్యాలు నాకు అర్థమయిన తర్వాత నా ఉద్యోగం వదిలి, ఆపై నా పనిని ప్రారంభించాను. స్టూడియో ఆస్ట్రిడ్ ఇండియా పేరుతో కంపెనీని ప్రారంభించాను. ఈ రంగంలో నాకు గాడ్‌ఫాదర్ లేకపోవడంతో నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం సవాళ్లతో కూడుకున్నది. ప్రతీ పని స్వయంగా తెలుసుకుంటూ చేయాలి. ముందు ఎవ్వరూ టీమ్‌గా చేరలేదు. నెమ్మదిగా కలిశారు. చిన్న పుస్తకాల షెల్ఫ్‌తో మొదలు.. కొన్ని రోజుల వరకు నా కంపెనీ పనిలో నేనున్నాను. 2016లో ఒకరోజు త్రీ బై త్రీ బుక్ షెల్ఫ్ చేసివ్వమని ఒక ఆర్డర్ వచ్చింది. మూడు వేల రూపాయలతో వచ్చిన చిన్న ప్రాజెక్ట్ అది. నా కలలు పెద్దవే. కానీ, మొదటి ప్రాజెక్ట్, అందుకే కష్టపడ్డాను. ఆ చిన్న బుక్ షెల్ఫ్ నుంచి ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు, రిసార్టులు డిజైన్ చేస్తున్నాను. 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా తీసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎల్తైన భవనాలు, మెరిసే అద్దాల గోడలు నా కళ్లలో కలల ఇంటిని కట్టుకునేవి. చిన్నతనంలో నా అరచేతిలో రూపుదిద్దుకున్న చిట్టి చిట్టి భవనాలపైనే నాకు అంత ఆకర్షణ ఉందని అప్పట్లో తెలియదు. పెద్దయ్యాక ఆ కలే నన్ను ఆర్కిటెక్ట్‌గా ఎదిగేందుకు ప్రోత్సాహమిచ్చింది. క్లయింట్ అవసరాలు వినడం నుంచి అమలు చేయడం వరకు అన్ని పనులు స్వయంగా చూస్తుంటాను. సవాళ్లను ఎదుర్కొంటేనే సరైన దారి ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు నాలో మార్పు స్పష్టంగా చూశాను. నామీద నాకు చాలా నమ్మకం వచ్చింది. అనుభవం పెరిగింది. ఎక్స్పోజర్ పెరిగింది. ఆరు సంవత్సరాలలో నైపుణ్యం కలిగిన క్రియేటివ్ డైరెక్టర్‌గా నన్ను నేను చూసుకుంటున్నాను. ఆడపిల్లలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు చేసే రోజులు పోయాయి అని నన్ను నేను చూసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించింది. నా స్నేహితుల జాబితాలో కూడా నలుగురిలో మాట్లాడటానికి సిగ్గుపడే అమ్మాయిలు ఇప్పుడు మంచి వక్తలుగా మారారు. శిల్పకళ లేదా వ్యాపార రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు పదే పదే చెప్పే మాట ‘ప్రతి రంగానికి దానికి తగిన సవాళ్లు ఉంటాయి. వాటిని వదులుకోవద్దు. మార్గం ధైర్యంతోనే వేయబడుతుంది. మీరు వృద్ధిలోకి వస్తున్నప్పుడు మరికొన్ని మార్గాలను కనుక్కుంటారు’ అని వివరిస్తారు భవ్నా ఖన్నా. ఈ ఆరేళ్లలో స్పార్క్ ఎక్సలెన్స్ అవార్డు, యువ పారిశ్రామికవేత్త బిరుదును అందుకున్న భవ్నాఖన్నా గురించి ప్రముఖ జాతీయ మ్యాగజైన్లు కవర్‌పేజీ కథనాలతో ఆమె ఘనతను చాటాయి. విజయం ఒక్కరోజులోనే అందకపోవచ్చు. ప్రతీరోజు ప్రయత్నంతోనే మొదలవ్వాలి. ప్రతీ ప్రయత్నం విజయంవైపుగా కృషి చేయాలి. సవాళ్లను స్థైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ ఆర్కిటెక్చర్ జీవనం ఎంతోమందికి ప్రేరణనిస్తోంది. -
20 వరకు వైఎస్సార్ఏఎఫ్యూ పీజీసెట్ దరఖాస్తు గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కడపలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 6 కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీసెట్)కు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు నిర్ణయించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథరెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ప్లానింగ్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్), మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్), పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ కోర్సుల్లో 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హతలు, ఇతర వివరాలకు www.ysrafu.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. ఈ కోర్సుల్లో చేరాలనుకొనే వారు డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 రాయవలసి ఉంటుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 20 చివరి తేదీ. ఆలస్య రుసుముతో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 8790571779 నంబర్లో సంప్రదించవచ్చు. ఆయా కోర్సుల్లో సీట్లు ఇలా.. ♦మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ప్లానింగ్: 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్): 20 సీట్లు ♦మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్స్): 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ: 20 సీట్లు ♦పీజీ డిప్లొమా ఇన్ సైంటిఫిక్ వాస్తు శాస్త్ర: 20 సీట్లు -
ఇక కొలువు సులువు..
మనసులోని భావాలకు దృశ్యరూపం ఇచ్చే అరుదైన కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లోని యానిమేషన్ కోర్సు. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కోర్సు డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. 100 శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న ఈ కోర్సు ప్రత్యేకతలపై కథనం. సాక్షి,కడప(వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి స్పెషలైజ్డ్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నగరాలకే పరిమితమైన యానిమేషన్ కోర్సును బీఎఫ్ఏ యానిమేషన్ కోర్సుగా కడప విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలను తీర్చేవిధంగా తీర్చిదిద్దిన ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా సొంతగా, వివిధ సంస్థల్లో పనిచేసి పేరుప్రఖ్యాతులు, ఆకర్షణీయమైన వేతనాలు పొందవచ్చును. అర్హత : ఇంటర్మీడియట్లో ఏదైనా కోర్సు పూర్తిచేసిన ఇందులో చేరడానికి అర్హులు. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 ద్వారా ప్రవేశాలు పొందచ్చు. నాలుగు సంవత్సరాల ఈ కోర్సుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. కోర్సులో ప్రవేశం పొందిన వారికి వివిధ రకాల సాంకేతికతను వినియోగించి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అవకాశాల వెల్లువ.. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నది నిపుణుల మాట. చదువకుంటూ వివిధ సంస్థల్లో ఫ్రీలాన్స్‌గా కూడా ఉద్యోగం చేసుకునే సౌకర్యం ఉంది. ఆన్లైన్ ద్వారా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఫిల్మ్‌మేకింగ్, గేమ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ చేసే అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యానిమేషన్, గేమ్ డిజైనింగ్, కార్టూన్, టీవీఛానల్స్, బుక్ మేగజైన్స్, వెబ్ మాధ్యమాల్లో అపారంగా అవకాశాలు ఉన్నాయి. 2డీ, 3డీ యానిమేటర్లుగాను, లైటింగ్, రిగ్గింగ్ ఆర్టిస్ట్‌గాను, కేరక్టర్ డిజైనర్‌గాను, స్క్రిప్ట్ రైటర్, వీడియో, ఆడియో ఎడిటర్‌గా, పోస్ట్ ప్రొడక్షన్లో వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా, గ్రాఫిక్ డిజైనర్, టాయ్ యానిమేటర్, స్టోరీబోర్డు ఆర్టిస్టుగా, ఇలస్ట్రేటర్‌గా, టైటిల్ డిజైనర్, కంపోస్టర్, విజువల్ డెవలపర్, ఫ్లాష్న్యూస్మేకర్స్, ప్రొడక్షన్ డిజైనర్, లేఅవుట్ ఆర్టిస్ట్, 3డీ మోడులర్, కీ ప్రైమ్ యానిమేటర్, ఇమేజ్ ఎడిటర్‌గా, ఫోరెన్సిక్ యానిమేటర్ వంటి వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చదవండి: వైవీయూకు ఏపీ పీజీసెట్–21 నిర్వహణ బాధ్యతలు -
అవినీతిని ‘వాస్తు’ దాచునా..!.
సాక్షి, అనంతపురం : రోడ్డు రవాణాశాఖ అధికారులకు వాస్తు భయం పట్టుకుంది. గతకొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న చాంబర్లను మార్పు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఉన్నతాధికారి అయిన ఉప రవాణా కమిషనర్ చాంబర్‌ను ఆర్టీఓ చాంబర్లోకి మారుస్తున్నారు. ఆర్టీఓకు మరో చాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులుగా రవాణాశాఖ కార్యాలయంలో ఈ పనులు జరుగుతున్నాయి. దీంతో అధికారులు ఇతర గదుల్లో కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన సీ.హెచ్.ప్రతాప్, సుందర్వద్దీలకు అవినీతి, అక్రమాల మరకలు అంటుకోవడంతో ప్రస్తుత డీటీసీ శివరామప్రసాద్ వాస్తు ప్రకారం చాంబర్ మార్చుకోవాలని భావించినట్లు కార్యాలయవర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తు పనుల్లో భాగంగా గ్రానైట్ ఫ్లోరింగ్, పీఓపీ సీలింగ్ తదితర పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.3లక్షలకు పైగానే ఖర్చవుతున్నట్లు తెలిసింది. కాగా ఇందుకోసం రవాణశాఖ కమిషనరేట్ నుంచి నిధులు కోరగా.. రూ.2లక్షల వరకే అనుమతిచ్చినట్లు సమాచారం. అయితే మిగిలిన డబ్బును ఏదోలా సర్దుబాటు చేయొచ్చని భావిస్తున్నారు. వాస్తు మార్చాలనుకోవడంలో తప్పు లేదు.. కానీ బాగా ఉన్న చాంబర్లను వాస్తు పేరుతో మారుస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. -
భువన విజయం
బ్రహ్మ చేసిన సృష్టికి దీటుగా ప్రతిసృష్టి చేయగలవారు శిల్పులు. యుగాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఈ శిల్ప కళావృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. మగవాళ్లకు సహాయంగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఆడవాళ్లు. ఈ ‘సాధారణంగా’ అనే ఆనవాయితీని చెరిపేశారు భువనేశ్వరి. ఆళ్లగడ్డలో శిల్పకారులుంటారనే సంగతి ఆ జిల్లా వాళ్లకు తప్ప బయటి ప్రపంచానికి తెలియని స్థితి నుంచి ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియాలకు కూడా ఆళ్లగడ్డ తెలిసిందంటే ఆ ఘనత.. భువనేశ్వరి శిల్పకళా నైపుణ్యానిదే. భువనేశ్వరి మొదట్లో శిల్పిగా స్థిరపడాలనుకోలేదు. టెన్ టు ఫైవ్ ఆఫీస్ జాబ్ లాంటిది చేయాలనుకున్నారు. ప్రొఫెషనల్‌గా స్థిరపడాలనుకున్నప్పుడు కూడా బొటిక్ పెట్టాలనుకున్నారు. బొటిక్ పెట్టడానికి ముందు వస్త్రరంగం మీద పట్టు సాధించడానికి స్వయంగా అధ్యయనం మొదలుపెట్టారు. అధ్యయనం అంటే సూరత్‌కో, ముంబైకో వెళ్లి వస్త్ర పరిశ్రమలను చూడడం, డిజైనర్ల స్టూడియోలను సందర్శించడం. అయితే అది సాధ్యమయ్యే పని కాదనిపించి, అన్నింటికీ ఇంటర్నెట్నే ఆధారం చేసుకున్నారామె. నెలల పాటు ఈ సెర్చింగ్‌లో ఉండగా ఆమె మెదడులో ఓ ఆలోచన మెరిసింది. లూయీ పాశ్చర్ పరిశోధనలు చేసి చేసి, ఏళ్ల తర్వాత రేబిస్కి మందు కుక్క మెదడులోనే ఉందని తెలుసుకోవడం లాంటిదే భువనేశ్వరికి వచ్చిన ఆలోచన కూడా. ఇంటర్నెట్లో శోధిస్తుంటే తనకు తెలిసినవి, తెలియనివి ఎన్నెన్నో బయటపడుతున్నాయి. కానీ తన ఇంట్లో తయారవుతున్నటువంటి శిల్పాలు మాత్రం కనిపించలేదు. ప్రపంచం భూగోళమంత పెద్దదే అయినా విశ్వం అరచేతిలో ఇమిడిపోయేటంత అనువైనది కూడా అనిపించిందామెకు. టన్నుల బరువైన శిల్పాలను ఫొటో తీసి ఫేస్బుక్లో, ఓఎల్ఎక్స్, క్వికర్‌లలో పెట్టి, వాటి వివరాలను ప్రాధాన్యతలను వివరించడం మొదలుపెట్టింది. అమెరికా కస్టమర్ మేరీ యాన్ మెగసెసె తనను వెతుక్కుంటూ ఆళ్లగడ్డ వచ్చినప్పుడు అనిపించిందామెకు తాను చేస్తున్న ప్రయత్నం విజయవంతం అయి తీరుతుందని. రెండున్నర లక్షల రూపాయల ఆర్డర్ వచ్చింది. ఫేస్బుక్ ఆధారంగా భువనేశ్వరి అందుకున్న తొలి ఆర్డర్ అదే. నాన్నకు నమ్మకం కలిగింది భువనేశ్వరి తండ్రి రవీంద్రాచారి జీవితాన్ని శిల్పకళకే అంకితం చేశారు. ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి బాలవీరాచారి కాలం చేశారు. రోజుకు ఇరవై రూపాయల కూలికి పని చేసి, కొన్నేళ్లకు వృత్తిలో స్థిరపడి, తండ్రి స్థాపించిన శిల్పకళామందిరానికి పూర్వవైభవం తెచ్చారాయన. భువనేశ్వరికి ఇంట్లో రోజూ ఉలి చప్పుళ్లు వినిపిస్తూనే ఉండేవి. ఆసక్తి కొద్దీ తమ్ముడితోపాటు శిల్పాల దగ్గరకు వెళ్లినా సరే... రవీంద్రాచారికి మనసొప్పేది కాదు. కూతురు దుమ్ములో పని చేయడం నచ్చేది కాదాయనకు. సున్నితమైన చేతులు ఉలిని పట్టుకుని గట్టిపడిపోతాయని వద్దనే వాడు. అంత గారంగా పెంచుకున్న తండ్రి... కూతురి జీవితం కూడలిలో ఉందని తెలిసినప్పుడు ఒక మాటన్నారు. ‘బాధపడుతూ ఎటూ తేల్చుకోలేక ఎంత కాలం గడిపినా సరే, పరిష్కారం దొరకదు. పని మీద ధ్యాస పెట్టు, గమ్యం తెలిసే వరకు పనిలోనే మునిగిపో’ అని చెప్పాడు. నైపుణ్యం వచ్చే వరకు శిక్షణనిచ్చాడాయన. భువనేశ్వరి విదేశీ కస్టమర్ నుంచి తొలి ఆర్డర్ అందుకున్నప్పుడు ఆయనకు కూతురి భవిష్యత్తు పట్ల భరోసా కలిగింది. శిల్పాల పురిటిగడ్డ! ఆళ్లగడ్డలో శిల్పుల కుటుంబాలు రెండొందలకు పైగా ఉన్నాయి. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన నిపుణులున్నారు. అయితే బొమ్మల కోసం తమ దగ్గరకు వినియోగదారులను తీసుకురావడం ఎలాగో తెలియదు. కులవృత్తితో భుక్తి జరగక తిప్పలు పడుతున్న వాళ్లే ఎక్కువ. అలాంటిది భువనేశ్వరి ప్రయత్నంతో ఆళ్లగడ్డ అంటే శిల్పాల పురిటిగడ్డ అనుకుంటోంది ప్రపంచం. ఆమెతోపాటు ఆ గ్రామంలో అనేక మందికి ఉపాధి మెరుగైంది. ఆమె దగ్గర ఆళ్లగడ్డలో యాభై మంది, క్యాంపుల్లో ముప్పై మంది శిల్పులు పని చేస్తున్నారు. ప్రస్తుతం యాదగిరి గుట్టలో శిల్పాలు చెక్కుతున్నారు. ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్లో కూడా శిల్పాల ప్రాధాన్యం పెరిగింది. ఇళ్లలో డైనింగ్ టేబుల్, కార్నర్ స్టాచ్యూలు, గార్డెన్లో పర్గోలా (రాతి మండపం)లు పెట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్ కూడా శిల్పకారులకు మంచి ఉపాధిగా మారింది. కులవృత్తి ఊరుదాటలేక అంతరించి పోతున్న ఈ టెక్ యుగంలో టెక్నాలజీనే ప్లాట్‌ఫామ్‌గా చేసుకుని వంశపారంపర్యంగా వచ్చిన కళకు జీవం పోస్తున్నారు భువనేశ్వరి. దేవుడి విగ్రహానికి సెంటిమెంట్ దేవుడి విగ్రహాలకు కళ్లను శిల్పకళామందిరాల్లో గీయరు. విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లిన తర్వాత శిల్పి గర్భగుడిలోకి వెళ్లి బంగారు లేదా వెండి సూదితో కళ్లను చెక్కుతారు. ఎందుకంటే.. ‘దేవుడు ముందే కళ్లు తెరిచి తనను ఆలయంలోకి ఎప్పుడు చేరుస్తారా, భక్తులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడకూడదు. భక్తులు ఎదురు చూస్తుండగా దేవుడు కళ్లు తెరవాలి’ అని చెబుతారు. ఇల్లే యూనివర్సిటీ ‘‘కులవృత్తిలో నైపుణ్యం సంపాదించడం యూనివర్సిటీలో కోర్సు చేయడం కంటే ఎక్కువే. నిత్యం ప్రాక్టికల్ క్లాసులకు హాజరైనట్లే. మా విశ్వబ్రహ్మల కుటుంబాల్లో పిల్లలు పలక బలపం పట్టుకోవడం వచ్చినప్పటి నుంచి బొమ్మలు గీస్తుంటారు. ప్రతి శిల్పకారునిలోనూ చిత్రకారులుంటారు. మాస్టర్ శిల్పి కావాలంటే బొమ్మ గీయడం బాగా వచ్చి ఉండాలి. అలాగే శిల్పకారులు తప్పని సరిగా తమ మానసిక స్థితిని సాంత్వన పరుచుకుని పనిలోకి దిగాలి. ఎందుకంటే... మన మనసులోని భావాలు శిల్పం ముఖంలో ప్రతిబింబించి తీరుతాయి. అయితే ఈ కళలో ఉండే గొప్పతనం ఏమిటంటే... కష్టాలను, బాధలను అదిమిపెట్టుకుని, మనసు చిక్కబట్టుకుని పని మొదలు పెట్టిన కొంత సేపటికే పనిలో నిమగ్నమైపోతాం. పని పూర్తయిన తర్వాత తేలికపడిన మనసుతో ఉలి పక్కన పెడతాం. రకరకాల శిల్పాలు చేస్తాం కానీ బుద్ధుడి విగ్రహం చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆయన ముఖంలో ప్రశాంతత, ఉంగరాలు తిరిగిన జుట్టు, సున్నితమైన వేళ్లు... వేటికవే క్లిష్టంగా ఉంటాయి. వాటన్నింటికంటే అర్ధనిమీలిత నేత్రాలను చెక్కడం నిజంగా బ్రహ్మ విద్య అనే చెప్పాలి’’ అంటారు భువనేశ్వరి. ఆరు భాగాలు.. ఆరు దశలు ఒక శిల్పం రూపుదిద్దుకోవాలంటే తల, మెడ, నడుము, మోకాళ్లు, చీలమండలు, పాదాలు... ఇలా ఆరు భాగాలుగా పని జరుగుతుంది. ముఖం పొడవు ఇన్ని అంగుళాలుంటే... మెడ ఎంత ఉండాలి, దేహం పొడవు, కాళ్లు, పాదాల పొడవు... ప్రతిదీ కొలత ప్రకారం జరగాలి. శాస్త్రబద్ధంగా లెక్క ఉంటుంది. మాకు పెద్దవాళ్లు నోటిమాటగా చెప్పి నేర్పించేస్తారు. పుస్తకం చూడాల్సిన అవసరం రాదు. మొదట రాయి మీద బొమ్మ వేస్తారు. ఈ పనిని మా నాన్నలాగ మాస్టర్లే చేయాలి. ఆ తర్వాత బ్లేడ్ మెషీన్‌తో ఎక్స్‌ట్రాలు తీసేయాలి. మూడవ దశలో శిల్పంలో ప్రధాన ఆకారం వచ్చేటట్లు బిట్ మెషీన్‌తో చెక్కాలి. ఆ తర్వాత శిల్పానికి పాలిష్. ఐదవ దశలో వేళ్లు, ఆభరణాలు, వస్త్రాలు, జుట్టు వంటి లైనింగ్ వర్క్ చేసి, డైమండ్ టూల్‌తో జీవరేకలు గీయాలి. చివరగా కళ్లు పెట్టాలి. మా తాత శ్రీశైలంలోని భ్రమరాంబిక ఆలయం, మహానంది ఆలయంలో అద్దాల మండపం, అహోబిలంలో కోనేరు వంటి ప్రసిద్ధ నిర్మాణాలు చేశారు. ఆయన స్థాపించినదే ‘శారద శిల్పకళామందిరం’. నాన్న అనారోగ్యం వల్ల ఇప్పుడు నేను, తమ్ముడు చూసుకుంటున్నాం. కస్టమర్లు ఫేస్బుక్, వాట్సాప్‌లలో కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్లకు ఆళ్లగడ్డ రావడం కంటే కర్నూలు సౌకర్యంగా ఉంటుందని అక్కడో బ్రాంచ్ పెట్టాను. మైసూర్, పులివెందుల దగ్గర మల్యాల, కర్నూలు దగ్గర వెల్దుర్తి నుంచి రాళ్లను తెచ్చుకుంటాం. విగ్రహానికి రాయిని ఎన్నుకోవవడంలోనే నైపుణ్యం ఉంటుంది. దేవుడు కృష్ణశిల (నల్లరాయి)లో ఉంటాడని చెబుతారు. రాయి లోపల సన్న పగులు ఉన్నా సరే దానిని పక్కన పడేయాల్సిందే. ఉలితో శిల మీద దెబ్బ వేయగానే వచ్చిన శబ్దం చెప్పేస్తుంది ఆ రాయి గట్టిదా డొల్లదా అని. నేను ఎక్కువ కష్టపడిన విగ్రహాల్లో ద్రాక్షారామంలోని శివుడు ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం కోసం, లేపాక్షి నంది విగ్రహం కోసం మాత్రమే. అది నిజానికి కష్టం కాదు ఆందోళన. గోదావరి పుష్కరాల కోసం 13 అడుగుల విగ్రహం ఆర్డర్ చేశారు, 25 రోజుల్లో పూర్తి చేయాలి. మొత్తం ఇరవై మందిమి... పగలు పది మంది, రాత్రి పదిమంది షిఫ్టుల్లో పనిచేశాం. కృష్ణాపుష్కరాల కోసం చేసిన కృష్ణవేణి విగ్రహం (శ్రీశైలం పాతాళగంగ ఘాట్), శ్రీశైలం శిఖరం మీద ఉండే నంది విగ్రహం చాలా సంతోషాన్నిచ్చాయి. మా తాత శిల్పాలున్న శ్రీశైలంలో నా శిల్పాలు కూడా ఉండడం నాకు సంతోషాన్నిచ్చింది. – భువనేశ్వరి, శిల్పి, శారద శిల్పకళామందిరం నిర్వాహకురాలు ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు: బి. వి. కృష్టయ్య -
భారతీయుడికి ఆర్కిటెక్చర్ ‘నొబెల్ ’..!
నిర్మాణ, వాస్తు శాస్త్ర రంగం (ఆర్కిటెక్చర్) లో నోబెల్ బహుమతి అంత స్థాయిగా పరిగణించే ప్రిజ్కర్ అవార్డును ఇటీవల టోరొంటోలో 91 ఏళ్ల ప్రొ. బాల్కృష్ణ విఠల్దాస్ దోషి అందుకున్నారు. ఆర్కిటెక్టులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ గౌరవాన్ని సాధించిన తొలి భారతీయుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆర్కిటెక్చర్ రంగంలో కృషి చేస్తున్న ఆయన తనదైన సొంత శైలితో పొందిన గుర్తింపుతో దక్షిణాసియాలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్‌గా పేరుగడించారు. 1989లో ఇండోర్‌లోని ‘అరణ్య లోకాస్ట్ హౌసింగ్ డెవలప్మెంట్’ ప్రాజెక్టు’ కోసం జోషి రూపొందించిన డిజైన్‌కు ఆగాఖాన్ అవార్డ్ ఫర్ ఆర్కిటెక్చర్ అవార్డు లభించింది. వివిధ సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వచ్చేలా అల్పాదాయ వర్గాలు మొదలు ఇతర వర్గాల వారి కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల మంది లబ్దిపొందారు. రాయల్ ఇనిసిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెక్ట్స్ ఫెలోగా ఉన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిసిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) డిజైన్లు ఇప్పటికీ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, టెక్నాలజీ, టాగోర్ మెమోరియల్ హాల్, ద ఇనిసిట్యూట్ ఆఫ్ ఇండోలజీ డిజైన్లకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తాను ‘వాస్తు శిల్ప’ పేరిట అహ్మదాబాద్‌లో ప్రారంభించిన కన్సల్టెన్సీ సంస్థలో దోషి నేటికి చురుకుగా పనిచేస్తున్నారు. జీవనసాఫల్య పురస్కారం... ‘ఈ అవార్డును అందుకోవడం అత్యంత సంతృప్తి కలిగించింది. జీవితంలో ఇలాంటి పురస్కారం వస్తుందని ఊహించలేము. ఇంత కంటే ఇంకా ఏమి కోరుకోవాలి ?ఈ వయసులో ఇలాంటి అవార్డును స్వీకరించడం ఎంతో సాధించామన్న అనుభూతిని కలిగిస్తోంది’ అంటూ ఈ అవార్డును అందుకున్నారు. ‘ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో పట్టణీకరణ, ప్రణాళికలు, గ్రామీణాభివృద్ధి, ఆర్థికరంగం, ఉపాధి వంటి కీలక అంశాల గురించి చర్చిస్తున్నాం. వీటి గురించి ఇతర దేశాలు ఎప్పుడో ఆలోచించి, మార్గదర్శకత్వంతో ముందుకెళ్లాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు దేశీయ ఆర్కిటెక్టులను (అన్నింటికి విదే«శీ ఆర్కిటెక్టులపైన ఆధారపడకుండా) కూడా విశ్వాసంలోకి తీసుకుని, వారిని ప్రజల అవసరాల కోసం పనిచేసేలా చేయాలి’ అని దోషి సూచించారు. ఆ డిజైన్లు జ్ఞాపకాల దొంతరలు... 1927 ఆగస్టు 26న పుణెలో జన్మించారు. ఫర్నీచర్ తయారీ, అమ్మకం వ్యాపార కుటుంబానికి చెందిన ఆయన అనుకోకుండా ఆర్కిటెక్చర్ రంగంలోకి అడుగుపెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించిన కాలంలో జోషి ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సృజనాత్మక ఆర్కిటెక్ట్ చార్లస్ ఎడ్వర్డ్ జీనెరెట్ ( లే కోర్బుసియర్గా ప్రసిద్ధులు) ఆయన గురువుగా పరిగణిస్తారు. తన వినూత్న డిజైన్లతో ఆధునిక నగరాలుగా ఛండీగఢ్, అహ్మదాబాద్‌లను తీర్చిదిద్దిన కోర్బుసియర్కు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ‘ ఒకే కన్మని’ తమిళ సినిమా, ‘ఒకే జాను’ పేరిట తీసిన హిందీ రీమేక్‌లోనూ ఆయన నటించారు. దోషి ముఖ్యమైన భవనాల్లో కొన్ని... –1969–71లో హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) టౌన్షిప్ –1979–80 అహ్మదాబాద్‌లో బీవీ దోషి కార్యాలయం ‘సంగత్’ –1972లో అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్లానింగ్ టెక్నాలజీ –1962–74 మధ్యలో బెంగళూరులోని ఇండియన్ ఇనిసిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ –1989 ఢిల్లీలోని నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ –1990 అహ్మదాబాద్‌లో అమ్దావద్ ని గుఫా (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
తెలివైన థామస్
కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లోకి రాగానే చదువుని పక్కన పెట్టేస్తారు. కానీ నివేథా థామస్ సినిమాలను పక్కన పెట్టారు. డిగ్రీ కంప్లీట్ చేయాల్సిందే అనుకున్నారు. ‘నిన్ను కోరి, జై లవకుశ’ సినిమాలతో లాస్ట్ ఇయర్ తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ మలయాళీ కుట్టి కేవలం అందంతోనే కాదు.. అభినయంతోనూ మంచి మార్కులు కొట్టేశారు. ఈ సంవత్సరం మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. దీనికి కారణం ఏంటి? అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ‘‘నా నెక్ట్స్ సినిమా ఏంటీ అని అందరూ అడుగుతున్నారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. ‘జై లవకుశ’ తర్వాత నా గ్రాడ్యుయేషన్ లాస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశా. ఈ గ్యాప్‌లో చాలా స్క్రిప్ట్‌లు చదివాను, విన్నాను. త్వరలోనే ఓ సినిమా డీటైల్స్ షేర్ చేస్తాను’’ అన్నారు నివేథా. చెన్నై ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చినా ‘ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్’ అని డిగ్రీ కంప్లీట్ చేశారంటే నివేథా థామస్ బ్యూటీ విత్ బ్రెయిన్ అనే చెప్పాలి. -
శిల్పశాస్త్రంలో చక్కటి పరిశోధన గ్రంథం
అజంతా ఎల్లోరా, ఖజురాహో వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ శిల్పసౌందర్యాన్ని చూసి వేనోళ్ల కొనియాడతాం. అంతెందుకు, ఆలయానికి వెళ్లినా ఆ దేవుని మూర్తిని చూసి అప్రతిభులవుతాం. అలాగే ఏదైనా అందమైన భవనాన్ని చూసినా, అలాంటి భావనే కలుగుతుంది మనకు. అయితే, వాటి నిర్మాణ విశేషాలను మాత్రం అంతగా గమనించ(లే)ము. ఒకవేళ గమనించినా, దాని గురించి వివరించే వాళ్లు మనకు అందుబాటులో ఉండరు. ఈ లోటును పూరించడానికా అన్నట్లు ఆగమ శాస్త్ర పండితుడు, శిల్పశాస్త్ర ప్రవీణుడు, శ్రీశైలప్రభ అనే ధార్మిక పత్రికకు సహాయ సంపాదకులుగా పని చేస్తున్న కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ‘శ్రీ మయమత శిల్పశాస్త్రం’ అనే గ్రంథాన్ని రచించారు. మయమతమనగానే మనకు మహాభారతంలోని మయసభా సన్నివేశం కదలాడడం కద్దు. విశ్వకర్మ కుమారుడైన మయబ్రహ్మ పాండవులకు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి ఇచ్చిన శిల్పశాస్త్రాచార్యుడు. తెలుగునాట మయమహర్షి రచించిన గ్రంథాలకు ఎంతో ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో మయమతమనే ఈ గ్రంథాన్నే వివిధ భాగాలుగా విభజించి, వాటిలో ప్రథమంగా ప్రతిమాలక్షణమనే అధ్యాయాన్ని చక్కటి వాడుక భాషలో అందించారు బ్రహ్మాచార్య. ఆలయాలలోనూ, ఆలయ ప్రాకారాలపైనా అగుపించే వివిధ దేవతాప్రతిమలను ఎలా నిర్మించాలో సచిత్రంగా వివరించే ఈ గ్రంథం నూతనంగా దేవాలయ నిర్మాణం చేసేవారికి, ఆలయ జీర్ణోద్ధరణ చేసే అధికారులకు, శిల్పశాస్త్ర విద్యార్థులకు కరదీపిక వంటిది. శ్రీ మయమత శిల్పశాస్త్రము అనువాదం: కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య పుటలు: 60; వెల రూ. 150 (తపాలా ఖర్చులతో సహా) ప్రతులకు సంప్రదించవలసిన చరవాణి: 9491411090 -
ఈ ఇల్లు చూస్తే సూపర్ అంటారు!
‘జీవితంలో ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’.. అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే అంత కష్టం మరీ. ఇక హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే కత్తి మీద సామే. కేవలం స్థలం కొనాలంటేనే కోట్లు కావాలి. ఈ సమస్య ఒక హైదరాబాద్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ విషయాన్నే గ్రహించిన ఓ ఆర్కిటెక్ట్ ఓ వినూత్నఇళ్లు డిజైన్‌కు శ్రీకారం చుట్టారు. 90 చదరపు మీటర్లోనే పూర్తయ్యే ఈ ఇంటికి కేవలం 30వేల యూఎస్ డాలర్లు(రూ. 22లక్షలు) ఖర్చవుతుందట! ఒకే గదిలా ఉండే ఈ ఇంటిలో కిచన్, బెడ్ రూం, వాష్‌రూమ్ వంటి సకల వసతులున్నాయి. ఒకే గదిలో ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటాన్నారే ఇక్కడే ఉంది ట్విస్ట్. బెడ్‌ను మడత బెట్టినట్టు కిచన్, బెడ్రూమ్, వాష్‌రూమ్‌లను మడతబెట్టుకోవచ్చు. అవసరమైన వాటిని వాడుకొని, మిగతావీ మూసేయడమే. అంతే కాదండోయ్ ట్రక్కులా ఉండే ఈ ఇల్లును ఏ ప్రాంతానికైనా సులభంగా తరలించవచ్చు. ఈ వినూత్న ఆలోచనను లియోనార్డో డి చియారా అనే ఆర్కిటెక్ట్ టినీ హౌజ్ యూనివర్సిటీ సహకారంతో రూపొందించారు. దీనికి అవాయిడ్ అని నామకరణం చేశారు. ఈ డిజైన్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. తన చిన్నప్పుడు తల్లితండ్రులతో కలిసి చిన్న ఇంటిలో నివసించిన అనుభవమే ఈ ఆలోచనను తట్టేలా చేసిందని లియోనార్డో చెప్పుకొచ్చారు. ఈ ప్రస్తుత డిజైన్ బెర్లిన్‌లోని బహస్-ఆర్కివ్ మ్యూజియం గార్డెన్లో ఉందని, మరిన్నీ సూచనలతో మరింత మెరుగుపరుస్తానని తెలిపారు. -
పెళ్లిలో గౌరీపూజ ఎందుకు?
• ఒక నిమిషం – ఒక విశేషం పెళ్లిళ్లలో గౌరీపూజ ప్రధాన క్రతువు. ఇంతకూ గౌరీపూజ ఎందుకు చేస్తారో తెలుసా? గౌరి అంటే గౌరవర్ణం కలది అని అర్థం. తెలుపు, ఎరుపు, పసుపు, బంగారం, కుంకుమపువ్వు వర్ణాలు కలగలసిన తల్లి గౌరి. నల్లగా ఉన్న పార్వతీదేవిని కాళి అని పరిహసించాడు పరమేశ్వరుడు. ఆ పరిహాసానికి ఆత్మాభిమానం దెబ్బతిని, స్వామివారిని వీడి, భూలోకానికి వచ్చి, తపస్సు చేసి, తన రంగును మార్చుకుని, శివుణ్ణి మెప్పించి వివాహమాడింది. అంటే భర్త తిరస్కరించినా, అదేవిధంగా పార్వతీదేవి మాంగల్యబలం చాలా గొప్పది. తన మాంగల్యబలం మీదున్న నమ్మకంతోటే తన పతి దేవుడు క్షీరసాగర మథనంలో వెలువడిన కాలకూట విషాన్ని ఉండగా చేసుకుని, మింగుతున్నా, వారించలేదు. ఆ నమ్మకం వమ్ముకాలేదు. బ్రహ్మవిష్ణువులు కూడా సాహసించని విషాన్ని మింగినా గరళకంఠుడు, విషకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు తప్ప ఆయనకు ఏమీ కాలేదు. ఆ మాంగల్యబలం ఉండాలనే వివాహానికి ముందు కన్నెపిల్లల చేత గౌరీపూజ చేయిస్తారు. కాబోయే దంపతులు ఆదిదంపతులైన గౌరీశంకరుల ఆశీర్వాదాలతో ఆదిదంపతుల్లా నిలిచి ఉండాలన్న ఆకాంక్షతో. వాస్తు ఎందుకు? మన శరీరం పాంచభౌతికమైనది. అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలతో నిర్మితమైంది. మనిషి జీవించే గృహం కూడా అలాగే ఉండాలి. ఇంటి వాస్తు సక్రమంగా ఉంటే, పంచభూతాలు తమ అనుకూల ప్రకంపనలతో ఇంటిని నందనవనం చేస్తాయి. గృహనిర్మాణ సమయం లోనే వాస్తు సూత్రాలను పాటిస్తే తర్వాత ఇబ్బందులు ఉండవు. ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంటిలో ఉండే వారిమీదే ఉంటుంది. ఆ ఇంటి యజమాని వేరొక నగరంలో ఉన్నా, ఇతర దేశాలలో ఉన్నా, ఆ ప్రభావం వారి మీద దాదాపు ఉండదని, కాకపోతే అదే ఊరిలో వారికి ఇల్లు ఉండి, వేరొకచోట అద్దెకు ఉంటే వారి మీద సొంత ఇంటి వాస్తుప్రభావం 20 శాతం వరకు ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఒక్క ఇంటివాస్తే కాకుండా, ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం కూడా ఆ ఇంటిమీద ఉంటుందని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. • సూక్తులు... సుభాషితాలు శాంతి, సౌఖ్యం నీలోనే ఉన్నాయి! ప్రపంచంలో మతానికి సంబంధించిన సిద్ధాంతాలు, శాస్త్రాలు అనేకం ఉన్నా, జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉన్నది ఒక్క మతమే అన్న సంగతి బోధపడుతుంది. ఉన్నతమైన వ్యక్తిత్వం, మానసిక పరిశుద్ధత, భగవంతుని యెడల ప్రేమ, సత్యాన్ని చేరుకోవాలనే తపన ఈ ఒక్కమతంలో ఇమిడి ఉంది. ఎంత ఎక్కువగా నీవు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావో, అంత తక్కువగా నీవు అతణ్ణి అర్థం చేసుకుంటావు. జీవిత లక్ష్యం భగవంతుడిని ప్రేమించడం. జీవిత గమ్యం భగవంతుడిలో ఐక్యమవటం. భగవంతుడినుంచి ఏదో ఆశించి భగవంతుడిని ప్రేమించటం, నిజంగా అతణ్ణి ప్రేమించటం కాదు. భగవంతుడి నుండి నీవు ఏదో ఆశించి, నీవు దేనినో త్యాగం చేయడం ఎలా ఉంటుందంటే, గుడ్డివాడు చూపుకోసం తన కళ్లను త్యాగం చేయటంలా ఉంటుంది. శాంతి, సౌఖ్యం పోరాటం వలన సిద్ధించేవి కావు. తనలోనే వాటిని వెతకవలసి ఉంది. ఈ సత్యాన్ని ఎప్పుడయితే తెలుసు కుంటారో, అప్పుడే పోరాటాన్ని వదిలి, ప్రశాంతంగా ఉండగలరు. – అవతార్ మెహర్ బాబా -
గాలి పందిరి... గమ్మత్తు లోగిలి...
ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందంటే ఒకటో రెండో షామియానాలు వేయించాలి కదా... కానీ అదేం అంత సులభం కాదు. టెంట్‌హౌస్‌కు చెప్తే వాళ్లు వెంటనే వచ్చేస్తారన్న గ్యారంటీ లేదు. గడియకోసారి ఫోన్ చేయాలి... వాళ్లు వచ్చి షామియానాలు వేయడానికి నానా అవస్థలు పడాలి. పైగా... గాలి కొడితే అవి కూలి పోకుండా హైరానా పడాలి. ఈ న్యూసెన్స్ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే పక్కనున్న ఫొటో చూడండి. ఇవి కూడా షామియానాలే. కాకపోతే గాలి షామియానాలు. అత్యంత పలుచనైన, దృఢమైన ప్లాస్టిక్‌తో తయారు చేశారు వీటిని. స్పెయిన్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ డోసిస్ వీటి రూపకర్త. చిన్న చిన్న మోటార్లతో నిమిషాల వ్యవధిలో గాలి నింపితే ఫొటోల్లో ఉన్నట్టుగా తయారవుతాయి. 4300 చదరపు అడుగుల విశాలమైన, ఎనిమిది అడుగుల ఎత్తై ఫంక్షన్ హాల్‌గా మారిపోతాయి. మొత్తం ఒకే హాల్లా కాకుండా అక్కడక్కడా ప్రత్యేకమైన గదులు కూడా ఉండటం వీటిలోని విశేషం. ఈ మధ్యనే ఈ వినూత్న షామియానాను లండన్‌లోని ఓ విశాలమైన పార్క్‌లో ‘షఫల్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి వినియోగించారు. చిన్న స్క్రీన్లపై సినిమాలు ప్రదర్శించడంతోపాటు కొన్ని వర్క్‌షాప్‌లు, సైన్స్ ప్రయోగాలు కూడా నిర్వహించారు. పైకప్పు ఉండటం వల్ల వానొస్తుందన్న భయం లేదు. గాలి వేగం ఎక్కువైతే అందుకు తగ్గట్టుగా ఈ షామియానా తన షేపును మార్చుకుంటుంటే తప్ప కూలిపోయి రభస సృష్టించదు. బాగుంది కదూ ఈ గాలి షామియానా... టెక్నాలజీ నజరానా. -
పడకగది ఏ దిక్కులో ఉండాలి?
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం, క్షణం తీరిక లేకుండా గడిపి.. ఇంటికొచ్చాక సేద తీరేది పడక గదిలోనే. అందుకే ఇల్లు, ఇంట్లోని బెడ్రూమ్ అన్నీ పక్కాగా వాస్తు ప్రకారం ఉంటేనే ఇంట్లోని వారికి మనశ్యాంతి కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. • ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది. • కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులోనే ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పైఅంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసర కలహాలకు దారి తీయవచ్చు. • పిల్లలకు పడక గది పశ్చిమ దిశలో ఉంటే మేలు. పెళ్లి కాని పిల్లలకు, ఇంటికి వచ్చే అతిథుల కోసం తూర్పు దిశగా ఉండే పడక గది అనువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంట మాత్రం ఈ దిశలోని పడక గదిని ఉపయోగించకపోవడం మంచిది. • ఈశాన్యం దేవతలకు స్థానం కాబట్టి.. ఏ పడక గది కూడా ఈ దిశలో ఉండకూడదు. పడక గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంటే.. అకార ణంగా దంపతుల మధ్య కీచులాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులూ అధికమవుతాయి. • నైరుతీ దిశలోనే గదిలో నైరుతీ మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. మంచం విషయానికొస్తే పడక గదిలో మంచం దక్షిణం, పశ్చిమం లేదంటే నైరుతి దిశల్లో ఉండొచ్చు. • తూర్పు వైపు కాళ్లు పెట్టుకొని పడుకుంటే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఐశ్యర్య వృద్ధికి అవకాశాలుంటాయి. అదే పశ్చిమం వైపు అయితే ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఉత్తర దిశలో అయితే సంపద వృద్ధికి అవకాశాలుంటాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు కాళ్లు పెడితే మాత్రం చక్కటి నిద్రకు దూరమవుతారు. • పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉత్తర దిశకు తూర్పు వైపు ఉండాలి. చదువుకోవటం, రాసుకోవటం వంటివి పడక గదిలో పశ్చిమ దిశలో చేయాలి. తూర్పు వైపు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. • ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు, న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబం ధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
12న ఆర్కిటెక్చర్ కోర్సులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఆర్కిటెక్చర్, ఫైనార్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ కోర్సులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కేవలం అయిదు కాలేజీలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కాలేజీలు కాకినాడ జేఎన్టీయూ అఫిలియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ (జేఎన్‌యూఏఎఫ్) పరిధిలో వీటికి అఫిలియేషన్ ఉండేది. రాష్ట్ర విభజనతో ఈ వర్సిటీ పదో షెడ్యూల్లో చే రడంతో తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొంది. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ఏపీలోని ఆర్కిటెక్చర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జేఎన్‌యూఏఎఫ్ ఇటీవల ప్రవేశాల ప్రకటన విడుదల చేసినా అందులో ఏపీలోని కాలేజీలను చేర్చలేదు. కేవలం తెలంగాణలోని కాలేజీలకు మాత్రమే ప్రవేశాలుంటాయని స్పష్టంచేసింది. దీంతో ఏపీలోని కాలేజీలకు వేరుగా ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు సోమవారం మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆర్కిటెక్చర్ కాలేజీలు కాకినాడ జేఎన్టీయూ అఫిలియేషన్‌ను తీసుకోవాలి. అప్పుడే ప్రవేశాలకు అనుమతి ఇవ్వనున్నారు. కొన్ని కాలేజీలు ఏయూ నుంచి అఫిలియేషన్‌ను తీసుకుంటామని పేర్కొనడంతో అందుకు మండలి అంగీకరించింది. ఈనెల 12న ఈ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని సెట్ల అడ్మిషన్ల ప్రత్యేకాధికారి రఘునాథ్ తెలిపారు. ఈ నెల 30వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. -
కేఎల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు
సాక్షి, విజయవాడ: కేఎల్ యూనివర్సిటీలో 2015-16 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వైస్ చైర్మన్ కోనేరు రాజా హరేన్ తెలిపారు. ఐదేళ్ల బీఆర్క్, లా, ఫైన్ ఆర్ట్స్‌లో పలు కోర్సులను ప్రారంభిస్తున్నామని వివరించారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ను అన్ని అనుమతులతో ప్రారంభిస్తున్నామన్నారు. మొదటి సంవత్సరం 40 సీట్లు ఉన్నాయన్నారు. బీబీఏ, ఎల్ఎల్బీ ఐదేళ్ల లా కోర్సును కూడా ప్రారంభిస్తున్నామని, వాటికి కొద్దిరోజుల్లోనే అనుమతి వస్తుందన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎల్‌ఎల్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రభుత్వ అనుమతులతో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా 1,680 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయన్నారు. -
ఆధునిక రూపశిల్పి హైదరాబాదీయే
సమకాలీన నిర్మాణశైలికి చార్లెస్ కొరియా ఆద్యులు సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతీయ కట్టడాల రూపశిల్పి చార్లెస్ కొరియాకు నగరంతో విడదీయరాని అనుబంధం ముడిపడి ఉంది. ఈసీఐఎల్ పరిపాలన భవనం, గచ్చిబౌలీలోని జవ హర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆఫీస్ వంటి అద్భుతమైన నిర్మాణాలకు రూపకర్త. కొరియా సమకాలీన నిర్మాణ శైలికి ఆద్యులు. స్వాతంత్య్రానికి ముందు ప్రాచుర్యంలో ఉన్న ఇండో అరబిక్, ఇండో గ్రీక్ శైలుల తరువాత కొరియా నిర్మాణశైలితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప కట్టడాలను ఆవిష్కరించారు. అలాంటి నవ భారత శిల్పి తన 84వ ఏట అనారోగ్యంతో ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన పార్ధివదేహానికి దాదర్‌లో అంత్యక్రియలు జరిగాయి. విద్యాభ్యాసం మొదలుకొని ఆర్కిటెక్ట్‌గా ఉన్నత శిఖరాలను చేరుకోవడం వరకు ముంబై కేంద్రంగానే చార్లిస్ కొరియా ఎదిగినప్పటికీ ఆయనకు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. ఆయన తండ్రి కార్లోస్ కొరియా గోవా నుంచి సికింద్రాబాద్‌కు మకాం మార్చారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన విధి నిర్వహణలో భాగంగానే హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. కానీ చార్లెస్ తండ్రిని చూడలేకపోయారు. ఆయన జన్మించడానికి వారం ముందే తండ్రి మరణించారు. 1930 సెప్టెంబర్ 1న చార్లెస్ కొరియా జన్మించారు. చార్లెస్ కుటుంబం లాలాగూడలో ఉండేది. భర్త మరణించిన కొద్ది రోజులకు చార్లెస్ తల్లి తన తండ్రి సొంత ఊరు ముంబైకి వెళ్లిపోయారు. దాంతో చార్లెస్ బాల్యం, విద్యాభ్యాసం ముంబైలోనే గడిచాయి. ముంబై వాసిగా కొనసాగినప్పటికీ హైదరాబాద్‌తో ఆయన అనుబంధం నిర్మాణరంగంలో చెక్కుచెదరని అద్భుతమైన కళాఖండాలుగా నిలిచిపోయింది. ఈసీఐఎల్ సహా పలు భవనాలకు డిజైనింగ్ రూపొందించారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న ఎల్ఐసీ భవనాలకు కూడా ఆయన రూపకర్త అని సమాచారం. నగరంలోని పలు ఐటీ కార్యాలయాలను, వారసత్వ కట్టడాలను ఆయన సందర్శించారు. 2008లో ఆయన తన తండ్రి సమాధిని సందర్శించేందుకు సికింద్రాబాద్‌కు వచ్చారు. చార్లెస్ అల్లుడు రాహుల్ మెహ్రోత్రా ముంబైలో ప్రముఖ ఆర్కిటెక్ట్. చార్లెస్ మరణం పట్ల పలువురు నగర వాసులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. సీఎం సంతాపం.. ప్రముఖ ఆర్కిటెక్ట్ చార్లిస్ కొరియా మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. అత్యాధునిక శైలిలో గొప్ప గొప్ప కట్టడాలను ఆవిష్కరించిన చార్లెస్ సేవలను సీఎం కొనియాడారు.హైదరాబాద్ నగరంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సహజత్వం ఉట్టిపడేలా కట్టడాలు... అహ్మదాబాద్ సబర్మతీ ఆశ్రమంలోని గాంధీ స్మారక మ్యూజియం మొదలుకొని దేశ, విదేశాల్లో ఆయన రూపొందించిన అద్భుతమైన కట్టడాలు సహజమైన గాలి, వెలుతురు ప్రసరించే విధంగా రూపుదిద్దుకున్నాయి. భవన నిర్మాణానికి ఆయన విరివిగా గ్లాసెస్ వినియోగిస్తారు.పర్గోలా శైలిగా వ్యవహరించే ఈ నిర్మాణంలో సూర్యుని వెలుతురు అద్దాలపైన పడి భవనం అంతా సహజమైన వెలుతురుతో అలరారుతుంది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ఆయన నిర్మాణశైలిలోని ప్రత్యేకత. ఈసీఐఎల్ పరిపాలనా భవనం అదేవిధంగా రూపుదిద్దుకుంది. ఇప్పటికీ ఎంతోమంది ఆర్కిటెక్ట్ విద్యార్థులు ఆ భవనాన్ని సందర్శించి నిర్మాణశైలిని అధ్యయనం చేయడం విశేషం. చార్లెస్ రూపొందించే భవనాలు సహజత్వం ఉట్టిపడేవిధంగా ఉంటాయి. అందమైన లాండ్స్కేప్లుగా తీర్చిదిద్దుతారు. విశాలమైన ఖాళీ స్థలాలు, పార్కులు, జలాశయాలతో సహజత్వం ప్రతిబింబించే విధంగా ఆయన శైలి ఉంటుంది. నగరవాసి కావడం గర్వంగా ఉంది చార్లెస్ కొరియా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉంది. అంతర్జాతీయంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఆయన పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన తండ్రి కార్లోస్ కొరియా సమాధి సికింద్రాబాద్‌లోనే ఉన్నట్లు తెలిసింది. ఎక్కడో కనుక్కొని వెళ్లాలనుకుంటున్నాను. - అనురాధ, ఇంటాక్ గొప్పవాళ్లు మన మధ్యే ఉన్నారు.. చార్లెస్ కొరియా వంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. రాజధాని నిర్మాణం, విశ్వనగర నిర్మాణాల కోసం సింగపూర్‌కో, మరో దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక నిర్మాణాలకు చార్లెస్ రూపశిల్పి కావడం, ఆ నిర్మాత మన హైదరాబాద్‌కు చెందినవాడు కావడం చాలా సంతోషంగా ఉంది. - ఎం. వేదకుమార్, ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ -
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు భయం
ప్రొఫెసర్ కంచ ఐలయ్య బషీర్‌బాగ్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వాస్తు భయం వెంటాడడం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను బేరం పెడుతున్నారని, పరిపాలనపై దృష్టి పెట్టలేక పోతున్నారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శ్రీ రాపోలు రాములు అధ్యక్షతన తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ‘ముస్లిం -క్రైస్తవ మైనార్టీలు- రాజ్యాధికారం’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధాన వ్యక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వాస్తు భయంతో కొత్త భవంతుల నిర్మాణాల వైపు వెళుతున్నారన్నారు. మూఢ నమ్మకాలతో, శాస్త్రీయ పరిశీలనను కోల్పోయిన పాలకులు ప్రజలను ఎటువైపు తీసుకెళుతారని ఆయన ప్రశ్నించారు. నేడు డబ్బు కోసం ప్రభుత్వ స్థలాలను బేరం పెడుతున్నారని, భవిష్యత్తులో అసెంబ్లీతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలనూ బేరానికి పెట్టొచ్చని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కూడా వాస్తు భయం పట్టుకుందని, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల సమస్యల గురించి ఆలోచించడం లేదన్నారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రధాన కార్యదర్శి వి.జి.ఆర్.నారగోని మాట్లాడుతూ.. ముస్లింలు, క్రైస్తవులకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా కల్పించాలన్నారు. మైనార్టీలపై జరుగుతున్న హింసాకాండ, ప్రాథమిక హక్కుల అణచివేతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయా కులాలకు కేవలం భవనాల నిర్మాణాలతో పొద్దు వెళ్లబుచ్చుతోందని, పరిపాలన అంటే అగ్రకులాల సొమ్ముగా భావిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించాలని, బీసీల రిజర్వేషన్లు 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ‘సియాసత్’ ఎడిటర్ అమీర్ అలీఖాన్, నేషనల్ అలయన్స్ దళిత ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి చార్లెస్ వెస్లీ మూసా, నాయకులు కె.చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.