‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో ఐశ్వర్యారాయ్; ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో తాను డిజైన్ చేసిన ఆభరణాలను చూపిస్తున్న ప్రతీక్ష ప్రశాంత్
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది.
ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం.
అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను.
విదేశీ మణిమాణిక్యాలు
చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి.
ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే.
అప్పట్లో కోర్సుల్లేవు
ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె.
చారిత్రక దృశ్యమాలిక
ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది.
తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్‌లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను.
– ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment