అక్కా! నువ్వు చేయించుకున్నావ్ కదా!
నాక్కూడా చేయించవే!!
ఏమండీ!నా తోటికోడలు చేయించుకుందిగా!!
అత్తా! మీ అమ్మాయికి చేయించారుగా!!
వదినా! మా అన్నయ్య నీకు చేయించాడుగా!!
పండగ చేసుకునే సమయంలో ఈ చేయించడమేంటీ?!
ఇవాళ ధనత్రయోదశి.. ఎల్లుండి పండగ! మరి కన్నుల పండుగ చేయించాలి కదా!
ఆభరణాల కొనుగోలులోనే కాదు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడూ అవి కొత్తదనంతో ఆకట్టుకుంటూ ఉండాలి. ఒకసారి నగ కొన్నాక అదెప్పుడూ ట్రెండ్‌లో ఉండాలి. అలాంటి ఆభరణాలు ఎన్నో మెడల్స్‌లో వచ్చాయి. అతివల మనసు దోచేస్తున్నాయి. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అనిపించే డిజైన్స్‌ను ధరించిన మన ‘తారా’మణులు ఆభరణాలకు కొత్త సింగారాలను అద్దుతున్నారు. వీటిలో ఖరీదైనవే కాదు అచ్చూ అలాగే ఉండే ఇమిటేషన్ జువెల్రీ కొంగొత్తగా ఆకట్టుకుంటుంది. ఏ వేడుకకు ఏ ఆభరణమో ఎంపికలోనే ఉంటుంది అసలు అందం.
♦ వరుసలుగా కూర్చిన పేటల హారాలు, జంతువులు, పక్షుల డిజైన్లతో రూపొందించిన హారాలు అన్నింటి ఔరా! అనిపిస్తూనే ఉన్నాయి.
♦ పోల్కీ కుందన్స్ సెట్ సంప్రదాయ వస్త్రాలంకరణ లోనే కాదు వెస్ట్రన్ డ్రెస్సులకు ఓ ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. అందుకే తారల అలంకరణలో తప్పనిసరి ఆభరణం అయ్యింది.
♦ మామిడి పిందెల హారాలు ఏ సందర్భాన్నైనా కాంతివంతంగా మార్చేస్తాయి. కాలాలు మారినా మారని ఈ డిజైన్ అతివలకు ఎప్పుడూ ఆకర్షణీయమే!
♦ మిగతా ఆభరణాలేవీ అవసరం లేకుండా పెద్ద పెద్ద చెవి బుట్టాలు ఏ వేడుకనైనా ప్రత్యేకతను నిలిపేలా చేస్తున్నాయి.
♦ పెద్ద పెద్ద పోల్కీచోకర్ సెట్స్ వేడుకకు ఒక రాణివాసపు లుక్‌ను తీసుకువస్తున్నాయి. అందుకే మన సంప్రదాయ వేడుకలో తప్పనిసరి గ్రాండ్ ఆభరణమైంది.
♦ దేవతా మూర్తుల రూపాలతో డిజైన్ చేసిన ఆభరణాలు (టెంపుల్ జువెల్రీ) సంప్రదాయ వేడుకలో హైలైట్‌గా నిలుస్తున్నాయి.
♦ ముత్యాల సొగసు ఎప్పుడూ కొత్త సింగారాలను మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి వేడుకను ముత్యాల ఆభరణాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి.
♦ వజ్రాభరణాలు ఏ వయసు వారికైనా తీరైనా ఖరీదైన అందాన్ని తీసుకువస్తాయి. మగువల మనసు దోచే ఆభరణాలలో ఒక్కటైనా వజ్రాభరణం ఉండాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment