
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం గృహే దీపం నమోస్తుతే ‘‘
గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస ప్రారంభంలో దేవీ నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. త్రయోదశి రోజు రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందు ఉంచాలి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయాలి. నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు స్నానం చెయ్యాలని నరక చతుర్దశి గురించి యమధర్మరాజుని ఉద్దేశించి చెప్పినట్లు భవిష్య పురాణం చెబుతోంది. దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం.
శ్రీరాముడు ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్కరోజు పరిపాలన చెయ్యి’ అన్నాడు. ఆ రోజు వెలిగించే దీపాలకే బలిదీపం అని పేరు. వరాహావతారంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు.
బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్ని బాధపెట్టాడు. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకోగా దేవేంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకుడిని వధించారు. భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమి మీద జీవించే ప్రతివారికి తల్లే కదా. పుత్ర శోకాన్ని మరచి నరకుని పేరు మీద పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ.
– డా. గొర్తి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment