దీపావళి: పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా.. | How Is Diwali Is Celebrated In All Over India | Sakshi
Sakshi News home page

ఆనందాల కేళీ.. దీపావళి: ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..

Published Sat, Oct 26 2019 1:05 PM | Last Updated on Sat, Oct 26 2019 3:07 PM

How Is Diwali Is Celebrated In All Over India - Sakshi

దీపావళి అంటే దీపాల పండుగ అని అర్ధం. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దేశవ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరిగే దీపావళి పూజా సాంప్రదాయం దేశమంతా వెలుగులు పూయిస్తుంది.

దీపావళి నాడు ప్రత్యేకంగా..
దీపావళి రోజున వీధులు, దుకాణాలు, భవనాలు విద్యుత్‌ వెలుగులతో విరాజిల్లుతుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే రాజస్తాన్‌లోని పింక్‌సిటీలో జోహారీ బజార్‌ దీపావళికి చాలా ప్రత్యేకం. అక్కడి భవనాలు, వీధులే కాకుండా నగరంలోని ప్రతీ ప్యాలెస్‌ విద్యుత్‌ వెలుగులతో అందంగా ముస్తాబవుతుంది. అక్కడి మార్కెట్లు  లైట్ల వెలుగుల్లో ప్రకాశిస్తాయి. ప్రతీ సంవరత్సరం అందంగా,సృజనాత్మకంగా  అలంకరించబడిన మార్కెట్‌కి బహుమతి కూడా ఉంటుంది. భారతదేశం నలుమూలల నుంచి ఈ అద్బుతమైన ప్రదర్శన తిలకించడానికి సందర్శకులు వస్తారు. అంతేకాకుండా ఆ లైట్లకి అయ్యే విద్యుత్‌ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లించడం విశేషం.

శ్రీరాముడిని కొలుస్తూ..
దీపావళి వేడుకలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం చాలా ప్రత్యేకమైనది. దీపాలను వెలిగించి ఆరాధించడంతో పాటు ‘భరత్‌ మిలాప్‌’ పేరిట శ్రీరాముడిని కొలుస్తారు. రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు.  ప్రతీ సంవత్సరం అక్కడ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. 2018లో సరయు నది ఒడ్డున 3 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది. 

పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా..
దీపావళి వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నరక చతుర్దశికి ఒకరోజు ముందు ఇళ్లంతా శుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు. వంట చేయడానికి ముందు పొయ్యిని శుభ్రపరుచుకొని దానిపై  ఓంకారం  చిహ్నాలు వేస్తారు. సూర్యోదయానికి ముందే తలంటు స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరిస్తారు. కొత్తగా పెళ్లయిన వారు వధువు ఇంట్లో ఈ వేడుకని జరుపుకోవడం ఆనవాయితీ.  కొన్నిచోట్ల నరక చతుర్దశి నాడు తెల్లవారుజామునే తలంటుస్నానం ఆచరించి యముడికి తర్పణం వదులుతారు. సాయంకాలం దీపాలను వెలిగించి మహాలక్ష్మీ పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుకర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్నే పాటిస్తారు. 

‍బంగారానికి పూజ
ఇక ఉత్తర భారత దేశంలోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరగుతున్నాయన్న విషయం తెలిసిందే. గుజరాతీలు దీపావళి ముందు రోజు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. లక్ష్మీదేవిని వాహీ పూజ పేరుతో ఆరాధిస్తారు. ఇంట్లోని బంగారమంతా తెచ్చి దీపాల ముందు ఉంచి పూజ చేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి పాదముద్రలు గీస్తారు. అదే విధంగా దీపావళి రోజున కొత్త వాహనాలు కొనడం, కొత్త కార్యాలయాలు, దుకాణాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలయాలను నిర్వహిస్తారు.

నాలుగు రోజుల పండుగ
మహారాష్ట్రలో దీపావళిని 4 రోజులు జరుపుకొంటారు. మొదటి రోజు వసుబరస్ పేరుతో ఆవు, దూడలకు పూజ చేస్తారు. ఇది తల్లి బిడ్డల ప్రేమను ప్రతిబింబిస్తుంది. రెండోరోజు ధంతేరాస్ పేరుతో పూజలు నిర్వహిస్తారు. మూడవ రోజు అంటే నరకచతుర్దశి నాడు ఉదయాన్నే తల స్నానం ఆచరించి ఆలయాన్ని సందర్శిస్తారు. కరంజీ, లడ్డూ, చక్కి లాంటి స్వీట్లను తయారుచేస్తారు. ఇక నాల్గోరోజైన దీపావళి నాడు వ్యాపారులు జమాఖర్చులు చూసుకొని కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇంటిముందు దీపాలు వెలిగించి తమ ఇంట్లోకి రావాలని లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. అమ్మవారిముందు బంగారం, డబ్బు పెట్టి సంపదతో దేవిని పూజిస్తారు. 

ఇంకాస్త అందంగా..
వారణాసి....ఎప్పుడూ అందమైన ప్రదేశమే. దీపావళి రోజున వారణాసి ఇంకా ఎంతో అందంగా ముస్తాబవుతుంది. బాణాసంచా, దీపాల నిర్విరామ వెలుగులతో కాశీ విరాజిల్లుతుంది. దీపావళి సందర్భంగా ఇచ్చే గంగా హారతిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది హిందువులు వారణాసికి తరలివస్తారు. క్యాండిల్‌ లైట్లు, నదిలో తేలియాడే మట్టి దీపాలతో వారణాసి వెలుగులు  చూడటానికి ఏటా భక్తులు వారణాసిని సందర్శిస్తారు. దీపావళి పండగ అనంతరం రెండు వారాల తర్వాత కార్తిక పౌర్ణమి నాడు వారణాసిలో 10 లక్షల దీపాల మధ్య దేవతామూర్తుల ఊరేగింపు అక్కడి మరో ప్రత్యేకత. 

కాళీ మాత ఆరాధన
భారతదేశంలో చాలా మంది దీపావళి రోజున లక్ష్మీ దేవిని ఆరాధిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో కాళీ మాతను పూజిస్తుంటారు. దీపావళి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కాళీ మాత మండపాలు దర్శనమిస్తాయి. కోల్‌కతాలోని కాళీదేవీ ఆలయాలైన కలిఘాట్, బేలూర్ మఠం దక్షిణేశ్వర్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.  దీపావళి రోజున కాళికా దేవీని సందర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. దీపావళి రాత్రి పూర్వీకుల ఆత్మలు స్వర్గానికి వెళ్లేలా వారిని దిశానిర్దేశం చేయడానికి పొడవైన స్తంభాలపై దీపాలు వెలిగిస్తారు. ఆ వెలుగుల కాంతిలో వారు స్వర్గస్తులవుతారని వారి నమ్మకం. ఇప్పటికీ అక్కడ ఈ పద్దతిని పాటిస్తున్నారు.  ఒడిశాలో కూడా ఇదే పద్దతిని ఆచరిస్తారు. 

పర్యావరణహిత దీపావళి
పంజాబ్‌లో సిక్కులు బాణాసంచా కాల్చరు. కేవలం దీపాలు, క్యాండిల్స్‌, రం‍గోలితో ఇంటిని అలంకరిస్తారు. వెండినాణేలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక పంజాబీలు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు పితృదేవతలను కూడా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నాడు భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఒక మాసమంతా తమ వెంట ఉం‍టారని వారు విశ్వసిస్తారు. దీపావళి నాడు ఆరాధనలు అందుకొని తాము వెలిగించే దీపాలను చూసి పితృలోకాలకు తిరిగి వెళ్లిపోతారని వారి నమ్మకం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement