Cholas
-
రాజరాజ చోళుడి కంటే ముందే ‘సెంగోల్’!
ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన కర్ణాటకలోని పట్టదకల్ దేవాలయ సమీపంలోని విరూపాక్ష ఆలయం మీద ఉన్న నటరాజస్వామి శిల్పం. నంది ధ్వజం రూపంలో రాజదండం చెక్కి ఉండటాన్ని ఈ శిల్పం పక్కన చూడొచ్చు. అధికార మార్పిడికి గుర్తుగా క్రీ.శ.745లో దేవాలయాన్ని నిర్మించారని, రాజదండాన్ని (సెంగోల్) ఉపయోగించారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: సెంగోల్.. ధర్మదండం.. రాజదండం..కొన్ని రోజులుగా రాజకీయాలను కుదిపేస్తున్న పదాలివి. అంతకుముందు వాటి ప్రత్యేకతలపై సామాన్యుల్లో ఉన్న అవగాహన అంతంతమాత్రమే. ఇప్పుడు ఎక్కడ చూసినవా వాటి గురించిన చర్చే. కొత్త పార్లమెంటు భవనంలో స్పీకర్ చాంబర్ వద్ద కేంద్ర ప్రభుత్వం స్వర్ణతాపడం చేసిన వెండి ధర్మదండాన్ని ఉంచబోతున్న సంగతి తెలిసిందే. రాజరాజ చోళుడి కాలంలో అధికార మార్పిడికి చిహ్నంగా వినియోగించినట్టుగా భావిస్తున్న దండాన్ని, ఆంగ్లేయుల నుంచి భారతదేశానికి అధికార మార్పిడి జరిగే వేళ తిరిగి వినియోగించారు. ఇంతకాలం మ్యూజియంలో ఓ బంగారు చేతికర్ర లాగా ఉండిపోయింది. ప్రస్తుతం నరేంద్రమోదీ ప్రభుత్వం దానికి సముచిత గౌరవాన్ని కల్పించే పేరిట కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించనుంది. రాజరాజ చోళుడి కంటే ముందే.. తాజా పరిణామాల నేపథ్యంలో చరిత్ర పరిశోధకుల దృష్టి పడింది. రాజరాజ చోళుడి కంటే కొన్ని వందల ఏళ్ల ముందే నంది చిహ్నంతో కూడిన రాజదండాన్ని అధికారమార్పిడికి వినియోగించారని వారు పేర్కొంటున్నారు. కర్ణాటకలోకి విశ్వవిఖ్యాత పట్టదకల్ దేవాలయ సమూహంలోని విరూపాక్ష దేవాలయంపై నటరాజస్వామి శిల్పంలో నంది ధ్వజం రూపంలో ఈ రాజదండం చెక్కి ఉందని పురావస్తు పరిశోధకులు సీహెచ్ బాబ్జీరావు, ఈమని శివనాగిరెడ్డిలు పేర్కొంటున్నారు. ఈ దేవాలయాన్ని బాదామీ చాళుక్య చక్రవర్తి రెండో విక్రమాదిత్యుడి భార్య లోకమహాదేవి నిర్మించారు. అప్పట్లో రెండో విక్రమాదిత్యుడు పల్లవ నరసింహవర్మను ఓడించి ఆయన ఆధీనంలోని ప్రాంతాన్ని తన పాలనలోకి తీసుకున్న సందర్భంగా జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా రాణి ఈ ఆలయాన్ని నిర్మించి నటరాజస్వామి పక్కనే సెంగోల్‌ను ప్రముఖంగా ప్రదర్శించారు. ఇంతకూ నంది ఎందుకు? శివాలయాలకు నందీశ్వరుడు అధికారం వహిస్తాడని ఆగమశాస్త్రాల్లో ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే మూలమూర్తిని దర్శించేముందు నంది అనుమతి పొందాలన్న భావన ఉండేదని, అధికారానికి గుర్తుగా నంది రూపాన్ని వాడేవారని, అధికార మార్పిడికి చిహ్నంగా అందించే అధికార దండంపై నంది రూపాన్ని రూపొందించారని చెబుతున్నారు. ఈ సంప్రదాయం చోళుల కాలం కంటే ముందు నుంచే కొనసాగిందని వారు పేర్కొన్నారు. -
రేనాటి చోళులు ఏలారిక్కడ!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కొత్తరెడ్డివారిపల్లె వద్ద వ్యవసాయ భూముల్లో రేనాటి చోళుల కాలం నాటి శాసనం వెలుగుచూసింది. ఇది 7వ శతాబ్దానికి చెందిన రేనాటి చోళరాజు పుణ్యకుమారుడి శాసనంగా పరిశోధక విద్యార్థులు తేల్చారు. రాష్ట్రంలో క్రీ.పూ. 3–4 శతాబ్దాల్లోని శాసనాలు ప్రాకృత భాషలోను, 5వ శతాబ్దంలో సంస్కృతంలో ఉండగా.. 6వ శతాబ్దం నుంచి తెలుగులో ఉన్నట్టు చెబుతున్నారు. తెలుగులో మొదటి శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కిందని చరిత్ర చెబుతోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలూకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు ప్రాచీన ఆంధ్రదేశంలో రేనాడు ప్రాంతంగా గుర్తింపు పొందాయి. తెలుగును అధికార భాషగా స్వీకరించిన రేనాటి చోళులు తెలుగులోనే శాసనాలు వేసినట్టు తెలుస్తోంది. నాలుగు తామ్ర శాసనాలు, 50 శిలా శాసనాలు వీరి చరిత్రకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. చిప్పిలి రాజధానిగా.. రేనాటి రాజుల్లో ముఖ్యుడైన పుణ్యకుమారుడు ‘చెప్పలియ పట్టు’ రాజధానిగా పాలించినట్టు తిప్పలూరు శాసనం ద్వారా తెలుస్తోంది. దీనిని అప్పట్లో కొంతమంది మదనపల్లె తాలూకాలోని చిప్పిలి గ్రామంగా గుర్తించినా.. తర్వాత కాలంలో పరిశోధకులు తిప్పలూరు గ్రామ సమీపంలోని కమలాపురం మండలంలోని పెద్ద చెప్పలి గ్రామ పరిసర ప్రాంతాల్లో రేనాటి చోళుల తామ్ర శాసనాలు, శిలాశాసనాలు అనేకం లభించడంతో దానిని రేనాటి చోళుల రాజధానిగా నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం మదనపల్లె తాలూకా కొత్తరెడ్డివారిపల్లెలోని పొలంలో వెలుగు చూసిన పుణ్యకుమార శాసనం చిప్పిలి గ్రామానికి సమీపంలోనే ఉంది. ఈ శాసనం పుణ్యకుమారుడిదే కావడం, ఇలాంటివి అక్కడే కాకుండా వేంపల్లె, చిప్పిలి పరిసర ప్రాంతాల్లో గతంలో అనేకం ఉండేవని చెబుతున్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంక్ తవ్వకాల్లోనూ ఒకటి రెండు కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రాహ్మణుడికి దానమిచ్చిన భూమి అని.. కొత్తరెడ్డిగారిపల్లెలోని ఒక పొలంలో రాయిపై శాసనం, మరోచోట బండపై చేతిలో కత్తి పట్టుకున్నట్టుగా, వాటి మీద మూడు బొమ్మలు, చుట్టూ కొన్ని శాసన అక్షరాలు, ఇంకొంత దూరంలో మరో బండమీద కత్తి పట్టుకున్న వీరుడు, అందులో రెండు గుర్రాలు, పైన ప్రాచీన తెలుగు లిపిలో కొన్ని అక్షరాలు (వైదుంబుల వీరగల్లులు) కనిపిస్తున్నాయి. వీటిని ఆ కాలంలో వీరగల్లులుగా పేర్కొనే వారని చెబుతున్నారు. రేనాటి చోళుల్లో మూడో తరానికి చెందిన పుణ్యకుమారుడు సూర అనే బ్రాహ్మణుడికి భూమిని దానంగా ఇచ్చినట్టు ఈ శాసనంలో ఉందని వాటిని పరిశీలించేందుకు వచ్చిన పరిశోధక విద్యార్థి చెప్పినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ శిలాశాసనాలు తమ తండ్రుల కాలం నుంచీ అక్కడే ఉన్నాయని, వీటి గురించి తామెవరూ పట్టించుకోలేదని చెప్పారు. -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
రూ.35 కోట్లు విలువ చేసే విగ్రహం చోరి.. అమెరికాలో ప్రత్యక్షం!
తిరువొత్తియూరు: తంజావూర్‌లోని ఓ ఆలయంలో 50 సంవత్సరాల క్రితం చోరీ జరిగిన రూ.35 కోట్లు విలువ చేసే త్రిపుర సంహారమూర్తి విగ్రహం అమెరికాలో ఉన్నట్టు కనుగొన్నారు. తంజావూరు జిల్లా వరత్తనాడు సమీపం ముత్తమ్మాల్‌పురంలో కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఉంది. ఇక్కడ 50 ఏళ్ల క్రితం 83.3 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన త్రిపుర సంహారమూర్తి పంచలోహ విగ్రహం చోరీ జరిగింది. ఈ విగ్రహం రూ.35 కోట్లు చేస్తుందని తెలిసింది. పైగా ఈ విగ్రహానికి బదులుగా అదే రూపంలో మరో విగ్రహం తయారు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఉంచినట్లు సందేహం రావ డంతో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి సురేష్ ఈ విషయమై విగ్రహాల తరలింపు నిరోధక విభాగం పోలీసులకు 2020లో ఫిర్యాదు చేశాడు. దీంతో విగ్రహాల నిరోధక విభాగం కుంభకోణం ప్రత్యేక విభాగం డీఎస్పీ ముత్తు రాజ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పుదువైలో వున్న ఫ్రెంచ్ సంస్థకు వెళ్లి అక్కడ ఆధారాలను నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇతర దేశాల్లో ఉన్న ఎగ్జిబిషన్లో చూస్తున్న సమయంలో తంజావూరులో చోరీకి గురైన త్రిపుర సంహారస్వామి పంచలోహ విగ్రహం అమెరికాలో ఎగ్జిబిషన్లో ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి సంబంధించి అమెరికా నుంచి త్రిపుర సంహారమూర్తి విగ్రహాన్ని రాష్ట్రానికి తీసుకురావడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
న్యూయార్క్‌లో చోళ్ల కాలం నాటి పార్వతి దేవి విగ్రహం
చెన్నై: చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్‌లో ఉన్నట్లు ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్‌లోని బోన్హామ్స్ వేలం హౌస్‌లో ఈ విగ్రహాన్ని గుర్తించినట్లు సీఐడీ తెలిపింది. ఈ విగ్రహం విషయమై 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. గానీ 2019లో ఫిబ్రవరి కె వాసు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడూ కేసు నమోదు చేసి వదిలేశారు. ఐతే ప్రస్తుతం ఐడల్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం చిత్ర ఈ కేసును దర్యాప్తు చేయడంతో వివిధ మ్యూజియంలు, వేలం హౌస్‌లపై దర్యాప్తు చేయడం ప్రారంభించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ మేరకు ఆమె బోన్హామ్స్ వేలం హౌస్‌లో ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 52 సెం.మీటర్లు ఉంటుంది. పైగా ఈ విగ్రహం విలువ సుమారు ఒకటిన్నర కోట్లు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. విగ్రహం నుంచున్న ఆకృతిలో ఉండి కిరీటం, నెక్లెస్‌లు, ఆర్మ్బ్యాండ్లు, వస్త్రాలతో రూపొందించి ఉంటుంది. వాస్తవానికి ఈ విగ్రహం కుంభకోణంలో తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో అదృశ్యమైన పార్వతి దేవి విగ్రహం ప్రసుతం అధికారులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంబంధిత పత్రాలను సిద్ధం చేస్తున్నారు. (చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!) -
ఘన చరితం.. రేనాటి శాసనం
వైవీయూ: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామ సమీపంలో లభించిన శాసనం ఆధారంగా చోళ మహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన సాగించినట్లు రూఢీ అయిందని వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి అన్నారు. బుధవారం వైవీయూ చరిత్ర, పురావస్తుశాఖ పరిశోధకులు, సహాయ ఆచార్యులు డాక్టర్ వి. రామబ్రహ్మం రేనాటి చోళరాజు శాసనం వివరాలను, దాని వెనుక ఉన్న చరిత్ర సంగతులను వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నదుద్యాల సమీపంలో లభించిన రేనాటి చోళరాజు శాసనం అత్యంత అరుదైనదన్నారు. ఆ గ్రామానికి చెందిన బి.శివనారాయణరెడ్డి పొలంలో ఇది బయల్పడినట్లు తెలిపారు. వైవీయూ ఎంఏ చరిత్ర, పురావస్తుశాఖ విద్యార్థి వాసుదేవరెడ్డికి ముందుగా ఈ విషయం తెలియడంతో ఆయన డా. రామబ్రహ్మం దృష్టికి తీసుకువచ్చారు. శాసనం, ఆ సమాచారాన్ని మైసూర్‌లోని భారత పురాతత్వశాఖ(ఏఎస్ఐ)కు తెలియజేశారు. ఏఎస్ఐ, వైవీయూ చరిత్ర పురావస్తుశాఖ పంపిన శాసనం గురించి అధ్యయనం చేయగా పలు చారిత్రక అంశాలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. ►రేనాటి చోళుల రాజైన చోళమహారాజు ఈ శాసనం వేయించారు. అందులో (తొలితరం) తెలుగుభాష, తెలుగు లిపిలో క్రీ.శ. 8వ శతాబ్దంలో శాసనం వేయించినట్లు ఉంది. పిడుకుల గ్రామంలోని దేవాలయాన్ని దేవాలయ బ్రాహ్మణులకు ఆరు మర్తల (8పుట్ల ధాన్యం పండేభూమి) సేద్యానికి ఇచ్చినట్లు నమోదై ఉంది. అలానే ఈ శాసనంలో చోళమహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన కొనసాగించినట్లు తెలుస్తోంది. ఎవరైతే ధాన్యాన్ని పరిరక్షిస్తారో వారికి (శాసనంలో లైన్ నెంబర్ 21, నవారికి ఆశ్వ : 22 లైన్లో మేద : (ం) బుదీని’ ఉంది) అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని, ఎవరైతే హానిచేస్తారో వారు వారణాసిలో చంపిన పాపాన్ని (23. చెర్రివారు, 24 బారనసి ప్ర) పొందుతారని శాసనంలో లిఖించారు. ►పరిశోధకులు డాక్టర్ రామబ్రహ్మంను వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్‌లు అభినందించారు. వైవీయూ అధికారుల ఆదేశానుసారం ‘ఎక్స్‌ఫ్లోరేషన్ ఆఫ్ ఆన్ – ఎర్త్డ్ ఇన్స్క్రిప్షన్, స్ల్కప్ఫర్ అండ్ టెంప్లెస్ ఆఫ్ వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ పేరుతో యూనివర్సిటీ గ్రాంటు కమిషన్‌కు ప్రాజెక్టును పంపనున్నట్లు డాక్టర్ రామబ్రహ్మం తెలిపారు. -
పురాతన ఆలయం.. సౌమ్యనాథ క్షేత్రం
నందలూరులోని సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ భక్తులు ఉన్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. సాక్షి, రాజంపేట(కడప) : దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో నందలూరులోని సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్ విన్నగర్ అనే పేర్లు గలవు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడుతో ఈ ఆలయానికి చారిత్రాత్మక అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సౌమ్యనాథుడన్నా.. చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని అర్థం. స్వామి మూలవిరాట్ ఏడడుగుల ఎత్తు ఉండి చాలా సౌమ్యంగా అభయముద్రాలంకితమై ఉంటుంది. ప్రత్యేకత బ్రహ్మమానసపుత్రుడు.. తిలోకసంచారి.. లోకకల్యాణకారకుడు.. కలహాప్రియుడు నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎటువంటి దీపం లేకున్నా.. ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథస్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు. దేవాలయంలో మరో ఆలయం ఆలయంలో లోపలికి ప్రవేశించగానే రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సి ఉంది. ఈ మంటపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉన్నాయి. ఏ దేవాలయానికి అయినా ఆలయ పైభాగంలో సింహం తలలు అమర్చిబడివుంటాయి. కానీ సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉండటం కనిపిస్తుంది. కాబట్టి ఆలయ పైభాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయ లోపల ఉండటం వల్ల.. భూగర్భలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తోంది. రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు. మత్స్య, సింహం చిహ్నాలు ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహం చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు.. ఆలయానికి పైభాగంలో ఉండే మత్స్యకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్థానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్థం వస్తుందని చెబుతుంటారు. చరిత్ర 11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగరాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. పతిరాజులు కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయప్రతాపరుద్రుడు రాజగోపురం కట్టించారు. ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున.. అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని దర్శించుకునేవారు. స్వామిపై శృంగార కీర్తనలు రచించారు. ఆలయ నిర్మాణం ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తుయుక్తముగా సువిశాలంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాలలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతిదీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడమందిర, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయాలు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి. దేవాలయ ఆవరణలో పెద్ద కోనేరు ఉంది. శాసనాలు ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078 లోనిది గాను, క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనంగా గుర్తించారు. ఇందులో దాన శాసనాలే అధికంగా ఉన్నాయి. ఈ శాసనాలలో ఉన్న వాటికి సంబంధించి ఇప్పుడైతే ఏమీ లేవనే స్పష్టమవుతోంది. క్రీ.శ 11వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొదటి వైష్ణవ ఆలయంగా గుర్తించారు. ఆళ్వారుల విగ్రహాలు ఒకే రాతిపీఠంపై ఉండేవి.. ఇప్పుడు లేవు. వీటిలో కొన్ని ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారని అంటున్నారు. కోర్కెలు తీర్చే దేవుడు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా సౌమ్యనాథస్వామి ప్రసిద్ధి చెందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. స్వామిని దర్శించి స్మరిస్తే పాపాలు తొలిగిపోతాయట. మనసారా పూజించే వారికి భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలిగిపోవడమే కాక చెడు కలలు రావడం ఉండవని చెబుతున్నారు. విదేశీయానానికి సిద్ధమవుతున్న వారు ఇక్కడికి వచ్చి.. స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతోంది. ఎలా వెళ్లాలి కడప–రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ ఆలయానికి కడప, తిరుపతి, రాజంపేట నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరుకు.. ముంబయి–చెన్నై మార్గంలో వెళ్లే ఏ రైలు ద్వారానైనా చేరుకోవచ్చును. విమానాశ్రయం అయితే రేణిగుంటకు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా నందలూరుకు చేరుకోవచ్చు. -
కూలిన వరదరాజస్వామి ఆలయ ప్రహరీ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని అతి పురాతనమైన మాణిక్య వరదరాజస్వామి ఆలయ ప్రహరీ ఆదివారం కూలిపోయింది. ఈ శిధిలాలు గర్భగుడిపై పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బలహీనపడిన గోడ కూలిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే చోళుల కాలం నాటి ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే. రాగి చెట్లు పెరుగుతూ శిధిలావస్థకు చేరిన ఆలయ ప్రహారీ గురించి 'సాక్షి' ఎన్నో సార్లు కథనాలను ప్రచురించింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ ప్రహారీ కుప్ప కూలింది.