క్రీ.శ. 9వ శతాబ్దానికి చెందినవిగా పేర్కొంటున్న వైదుంబుల వీరగల్లు
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కొత్తరెడ్డివారిపల్లె వద్ద వ్యవసాయ భూముల్లో రేనాటి చోళుల కాలం నాటి శాసనం వెలుగుచూసింది. ఇది 7వ శతాబ్దానికి చెందిన రేనాటి చోళరాజు పుణ్యకుమారుడి శాసనంగా పరిశోధక విద్యార్థులు తేల్చారు. రాష్ట్రంలో క్రీ.పూ. 3–4 శతాబ్దాల్లోని శాసనాలు ప్రాకృత భాషలోను, 5వ శతాబ్దంలో సంస్కృతంలో ఉండగా.. 6వ శతాబ్దం నుంచి తెలుగులో ఉన్నట్టు చెబుతున్నారు. తెలుగులో మొదటి శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కిందని చరిత్ర చెబుతోంది.
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలూకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు ప్రాచీన ఆంధ్రదేశంలో రేనాడు ప్రాంతంగా గుర్తింపు పొందాయి. తెలుగును అధికార భాషగా స్వీకరించిన రేనాటి చోళులు తెలుగులోనే శాసనాలు వేసినట్టు తెలుస్తోంది. నాలుగు తామ్ర శాసనాలు, 50 శిలా శాసనాలు వీరి చరిత్రకు ఆధారాలుగా నిలుస్తున్నాయి.
చిప్పిలి రాజధానిగా..
రేనాటి రాజుల్లో ముఖ్యుడైన పుణ్యకుమారుడు ‘చెప్పలియ పట్టు’ రాజధానిగా పాలించినట్టు తిప్పలూరు శాసనం ద్వారా తెలుస్తోంది. దీనిని అప్పట్లో కొంతమంది మదనపల్లె తాలూకాలోని చిప్పిలి గ్రామంగా గుర్తించినా.. తర్వాత కాలంలో పరిశోధకులు తిప్పలూరు గ్రామ సమీపంలోని కమలాపురం మండలంలోని పెద్ద చెప్పలి గ్రామ పరిసర ప్రాంతాల్లో రేనాటి చోళుల తామ్ర శాసనాలు, శిలాశాసనాలు అనేకం లభించడంతో దానిని రేనాటి చోళుల రాజధానిగా నిర్ణయించారు.
అయితే, ప్రస్తుతం మదనపల్లె తాలూకా కొత్తరెడ్డివారిపల్లెలోని పొలంలో వెలుగు చూసిన పుణ్యకుమార శాసనం చిప్పిలి గ్రామానికి సమీపంలోనే ఉంది. ఈ శాసనం పుణ్యకుమారుడిదే కావడం, ఇలాంటివి అక్కడే కాకుండా వేంపల్లె, చిప్పిలి పరిసర ప్రాంతాల్లో గతంలో అనేకం ఉండేవని చెబుతున్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంక్ తవ్వకాల్లోనూ ఒకటి రెండు కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు.
బ్రాహ్మణుడికి దానమిచ్చిన భూమి అని..
కొత్తరెడ్డిగారిపల్లెలోని ఒక పొలంలో రాయిపై శాసనం, మరోచోట బండపై చేతిలో కత్తి పట్టుకున్నట్టుగా, వాటి మీద మూడు బొమ్మలు, చుట్టూ కొన్ని శాసన అక్షరాలు, ఇంకొంత దూరంలో మరో బండమీద కత్తి పట్టుకున్న వీరుడు, అందులో రెండు గుర్రాలు, పైన ప్రాచీన తెలుగు లిపిలో కొన్ని అక్షరాలు (వైదుంబుల వీరగల్లులు) కనిపిస్తున్నాయి.
వీటిని ఆ కాలంలో వీరగల్లులుగా పేర్కొనే వారని చెబుతున్నారు. రేనాటి చోళుల్లో మూడో తరానికి చెందిన పుణ్యకుమారుడు సూర అనే బ్రాహ్మణుడికి భూమిని దానంగా ఇచ్చినట్టు ఈ శాసనంలో ఉందని వాటిని పరిశీలించేందుకు వచ్చిన పరిశోధక విద్యార్థి చెప్పినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ శిలాశాసనాలు తమ తండ్రుల కాలం నుంచీ అక్కడే ఉన్నాయని, వీటి గురించి తామెవరూ పట్టించుకోలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment