అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సభకు హాజరైన భారీ జన సందోహంలో ఓ భాగం , ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మదనపల్లె నుంచి సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకతో మదనపల్లె కిక్కిరిసింది. సభా ప్రాంగణం, రోడ్లన్నీ కిటకిటలాడాయి. ఇంత వరకు ఏ రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి దక్కని ఘన స్వాగతం, జన నీరాజనం ఆయనకు లభించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో పోటెత్తారు. ఇసుక వేస్తే రాలనంతంగా కనుచూపు మేర తరలివచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల ఊహకందని రీతిలో సభకు జనం హాజరు కావటం మదనపల్లె చరిత్రలో ఇదే ప్రథమం అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అంచనాలకు మించి జనసంద్రంలా..
మదనపల్లెలో రాజకీయ నాయకుల సభలు మామూలుగా మిషన్ కాంపౌండ్‌లో జరుగుతుంటాయి. అయితే సీఎం సభకు భారీగా జనం తరలివస్తారని భావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, కలెక్టర్ గిరీషాలు కదిరి రోడ్డులోని టిప్పు సుల్తాన్ మైదానంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో 35 వేల మంది కూర్చునేలా.. ఇంకా జనం ఎక్కువైతే దాని చుట్టూ కూడా కూర్చొనేలా మరో పది వేల మందికి ఏర్పాట్లు చేశారు.
అయితే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊహించని విధంగా ఉదయం 7 గంటల నుంచే ప్రజలు సభా వేదిక వద్దకు తరలిరావటం మొదలైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లి, రాయచోటి, పుంగనూరు నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో మదనపల్లెకు చేరుకున్నారు. విద్యార్థులు, మహిళల కోసం రిజర్వు చేసిన గ్యాలరీలు నిండిపోయాయి. ఉదయం 10 గంటలకల్లా సభ ప్రాంగణం నిండిపోయింది.
ప్రాంగణం చుట్టూ.. పెద్ద సంఖ్యలో జనం ఉండిపోయారు. అప్పటికే పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి ఉండటంతో కదిరి రోడ్డు మొత్తం జనంతో కిటకిటలాడింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెలిప్యాడ్ చేరుకోగానే కదిరి రోడ్డు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. అంటే సభలో కూర్చున్న వారికంటే.. రెండు మూడింతల జనం కదిరి రోడ్డు, సభ ప్రాంగణం చుట్టూ నిలుచుండిపోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాన్ని అలానే తిలకించారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయటం ప్రజలకు ఊరటనిచ్చింది.
సభా ప్రాంగణం నిండిపోవడంతో బయట నుంచే సీఎం జగన్ ప్రసంగాన్ని ఆలకిస్తున్న అశేష జనవాహినిలో ఓ భాగం
హోరెత్తిన నినాదాలు
మదనపల్లె పట్టణం ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ రేణిగుంట నుంచి ఉదయం 10.45 గంటల ప్రాంతంలో మదనపల్లె హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11.33 గంటలకు సభ వేదిక వద్దకు వచ్చారు. బీటీ కళాశాల మైదానం నుంచి బెంగుళూరు రోడ్డు మీదుగా బీసెంట్ కూడలి, పటేల్ రోడ్డు, ఎన్టీఆర్ కూడలి, కదిరి రోడ్డు మీదుగా టిప్పు సుల్తాన్ మైదానం చేరుకున్నారు.
రహదారికి ఇరువైపులా ప్రజలు వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతూ.. జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభా వేదిక వరకు జనం రోడ్లపై కిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం 1.11 గంటలకు సభ ముగించి వైఎస్ జగన్ తిరుగు పయనమయ్యారు. ఈ రెండు సమయాల్లోనూ సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. నినాదాలతో నీరాజనం పలికారు.
సభా ప్రాంగణానికి మరోవైపు నిలిచిపోయిన జన సందోహంలో ఓ భాగం
సభ జరిగినంత సేపు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వైఎస్ జగన్‌కు మద్దతుగా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేయడంతో మైదానం దద్దరిల్లింది. జగనన్న విద్యాదీవెన ద్వారా లబ్ధి పొందిన మదనపల్లెకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని షేక్ మహీర్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ములకలచెరువు మండలానికి చెందిన సౌజన్య సభలో ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment