నందలూరులోని సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ భక్తులు ఉన్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
సాక్షి, రాజంపేట(కడప) : దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో నందలూరులోని సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్ విన్నగర్ అనే పేర్లు గలవు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడుతో ఈ ఆలయానికి చారిత్రాత్మక అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సౌమ్యనాథుడన్నా.. చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని అర్థం. స్వామి మూలవిరాట్ ఏడడుగుల ఎత్తు ఉండి చాలా సౌమ్యంగా అభయముద్రాలంకితమై ఉంటుంది.
ప్రత్యేకత
బ్రహ్మమానసపుత్రుడు.. తిలోకసంచారి.. లోకకల్యాణకారకుడు.. కలహాప్రియుడు నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి.
ఎటువంటి దీపం లేకున్నా..
ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథస్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు.
దేవాలయంలో మరో ఆలయం
ఆలయంలో లోపలికి ప్రవేశించగానే రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సి ఉంది. ఈ మంటపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉన్నాయి. ఏ దేవాలయానికి అయినా ఆలయ పైభాగంలో సింహం తలలు అమర్చిబడివుంటాయి. కానీ సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉండటం కనిపిస్తుంది. కాబట్టి ఆలయ పైభాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయ లోపల ఉండటం వల్ల.. భూగర్భలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తోంది. రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు.
మత్స్య, సింహం చిహ్నాలు
ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహం చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు.. ఆలయానికి పైభాగంలో ఉండే మత్స్యకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్థానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్థం వస్తుందని చెబుతుంటారు.
చరిత్ర
11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగరాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. పతిరాజులు కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయప్రతాపరుద్రుడు రాజగోపురం కట్టించారు. ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున.. అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని దర్శించుకునేవారు. స్వామిపై శృంగార కీర్తనలు రచించారు.
ఆలయ నిర్మాణం
ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తుయుక్తముగా సువిశాలంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాలలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతిదీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడమందిర, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయాలు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి. దేవాలయ ఆవరణలో పెద్ద కోనేరు ఉంది.
శాసనాలు
ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078 లోనిది గాను, క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనంగా గుర్తించారు. ఇందులో దాన శాసనాలే అధికంగా ఉన్నాయి. ఈ శాసనాలలో ఉన్న వాటికి సంబంధించి ఇప్పుడైతే ఏమీ లేవనే స్పష్టమవుతోంది. క్రీ.శ 11వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొదటి వైష్ణవ ఆలయంగా గుర్తించారు. ఆళ్వారుల విగ్రహాలు ఒకే రాతిపీఠంపై ఉండేవి.. ఇప్పుడు లేవు. వీటిలో కొన్ని ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారని అంటున్నారు.
కోర్కెలు తీర్చే దేవుడు
కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా సౌమ్యనాథస్వామి ప్రసిద్ధి చెందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. స్వామిని దర్శించి స్మరిస్తే పాపాలు తొలిగిపోతాయట. మనసారా పూజించే వారికి భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలిగిపోవడమే కాక చెడు కలలు రావడం ఉండవని చెబుతున్నారు. విదేశీయానానికి సిద్ధమవుతున్న వారు ఇక్కడికి వచ్చి.. స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతోంది.
ఎలా వెళ్లాలి
కడప–రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ ఆలయానికి కడప, తిరుపతి, రాజంపేట నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరుకు.. ముంబయి–చెన్నై మార్గంలో వెళ్లే ఏ రైలు ద్వారానైనా చేరుకోవచ్చును. విమానాశ్రయం అయితే రేణిగుంటకు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా నందలూరుకు చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment