Old Temple
-
స్వయం సిద్ధ క్షేత్రం ‘తొలి తిరుపతి’
పెద్దాపురం: ఏలేరు నది ఒడ్డున అతి పురాతన కాలంలో స్వయం సిద్ధ క్షేత్రంగా వెలసిన స్వయంభూ శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలాడ తొలి తిరుపతిలో వెలసిన స్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారు. సామర్లకోట–ప్రత్తిపాడు రహదారిలో పెద్దాపురం మండలంలోని దివిలి గ్రామానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది చదలాడ తొలి తిరుపతి. విశిష్ట నిర్మాణ శైలితో ఉండే ఈ పుణ్యక్షేత్రం సింహాచలం, తిరుమల తిరుపతి కంటే పురాతనమైనదిగా పేర్కొంటారు. తొలి తిరుపతిగా పేరొందిన ఈ గ్రామంలోని ఆలయం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటిదని, ఈ విషయం ‘చాతావళి’ అనే సంస్కృత గ్రంథంలో కూడా ఉందని ఆలయ ప్రధాన పూజారులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 108 తిరుపతిలు ఉండగా వాటిలో ‘తొలి తిరుపతి’దే తొలిస్థానమని పేర్కొంటున్నారు. ఈ ఆలయం మాదిరిగానే పెద్ద తిరుపతి (తిరుమల తిరుపతి)లో కూడా ఏడు ద్వారాలు ఉండడం విశేషం. ఇక ప్రతీ శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయానికి పాదయాత్రగా వచ్చి ఏడు వారాలు మొక్కు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఎడమ చేతిలో చక్రం... కుడి చేతిలో శంఖం ఇక్కడ స్వామి ఇతర పుణ్యక్షేత్రాల్లో విగ్రహాలకు భిన్నంగా ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ధరించి ఉండటం విశేషం. అలాగే ఇక్కడ స్వామి చేతుల్లో తామర పుష్పం ఉన్నట్లే తిరుమల, సింహాచలం ఆలయాల్లోని విగ్రహాల చేతిలోనూ ఉన్నట్లు చెబుతారు. ఇది మూడు క్షేత్రాల మహాక్షేత్రంగా గణుతికెక్కింది. ప్రధానంగా ఇది స్వయం సిద్ధక్షేత్రం. నారద మునీంద్రుడు ఇక్కడ లక్ష్మీదేవిని ప్రతిస్టించడంతో దివ్యక్షేత్రమవ్వగా శ్రీకృష్ణ దేవరాయలు గోదాదేవిని ప్రతిస్టించడంతో రాజక్షేత్రంగా మారి మహా క్షేత్రమైంది. భోజ మహారాజు ఈ ఆలయానికి సున్నం వేయించినట్టు, విక్రమాదిత్యుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్, విక్టోరియా మహారాణి ఈ ఆలయ దర్శనానికి వచ్చినట్లు శాసనాధారాల్లో ఉంది. బొడ్నబావి ప్రత్యేకత.. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఉన్న బావిని బొడ్నబావిగా పిలుస్తుంటారు. నేలబావిగా ఉన్న ఈ బావి చుట్టూ రాళ్లు పేర్చి నిరి్మంచడాన్ని పురాతన నిర్మాణానికి ఆనవాలుగా చెబుతారు. కార్తికమాసంలో ఈ బావి నీటిని ఆలయ అర్చకులతో తోడించుకుని స్నానం చేస్తే సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని, కార్తిక పౌర్ణమి నాడు ఆ స్నానం మరింత ప్రాశస్థ్యమని భక్తుల నమ్ముతారు. ఈ బావి నీటిని చుట్టుపక్కల గ్రామాల వారు ఇంటికి తీసుకువెళ్లి మామూలు నీళ్లతో కలుపుకొని స్నానం చేస్తారు. టీటీడీ సహకారంతో ఆలయ అభివృద్ధి ఈ ఆలయానికి ఉండే వందలాది ఎకరాల ఆస్తి కాలక్రమంగా అన్యాక్రాంతమై నేటికి 18 ఎకరాలు మాత్రమే మిగిలింది. అయితే జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేశారు. ఇక దాతల సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి శృంగార వల్లభ స్వామి దివ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రి 8 గంటలకు ఉభయ దేవేరులైన క్షీర సాగరనందని లక్ష్మీదేవి, భూదేవిలతో స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం ఉంటుంది. 20న గ్రామోత్సవం, 21న సదస్యం, 22న సుదర్శన హోమం, చోర సంవాదం, 23వ తేదీ ఉదయం 8 గంటలకు చక్ర స్నానం, బుక్కా పండగ, సామూహిక కుంకుమ పూజలు, 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి శ్రీ పుష్పయాగం ఉంటాయి. – వడ్డి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి -
ఆలయాల జీర్ణోద్ధరణకు.. టీటీడీ నుంచి ఏటా రూ. 50 కోట్లు
సాక్షి, అమరావతి : పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ఆదాయంలేక ఆదరణకు నోచుకోని గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇకపై ఏటా రూ.50 కోట్లను దేవదాయ శాఖకు సమకూర్చనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ప్రతి ఐదేళ్లకోసారి పది శాతం చొప్పున పెంచాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఈ నిధులేవీ ప్రభుత్వ ఖజానాకు చేరవు. దేవదాయ శాఖ నిర్వహించే హిందూ ధార్మిక కార్యక్రమాలకే వీటిని ఖర్చుచేస్తారు. ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలకుగాను టీటీడీ ఏటా రూ.2.25 కోట్లను అందజేస్తోంది. అయితే, ఈ కార్యక్రమాలకు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గగుడి, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం దేవస్థానాలు ఒక్కొక్కటీ రూ.10 కోట్లకు పైగా అందజేస్తున్నాయి. 2019–20లో శ్రీశైలం ఆలయం ఒక్కటే రూ.32 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో.. టీటీడీ ఏటా చెల్లించే మొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచుతూ దేవదాయ శాఖ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆగస్టులో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చట్ట సవరణ జరిగే వరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ విడుదల చేసింది. సర్వశ్రేయో నిధికే ఏటా రూ.40 కోట్లు కొత్తగా తీసుకొచ్చిన సవరణ ప్రకారం.. దేవదాయ శాఖ పరిధిలో ఉండే సర్వశ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్–సీజీఎఫ్)కి టీటీడీ ప్రస్తుతం ఏటా రూ.1.25 కోట్లు అందజేస్తుండగా.. ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ.40 కోట్లకు పెంచుతూ కూడా చట్ట సవరణ చేశారు. పాడుబడ్డ ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ధూపదీప నైవేద్య స్కీం (డీడీఎన్ఎస్) వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే.. అర్చకులు, ఇతర ఉద్యగుల సంక్షేమ నిధికి టీటీడీ ఇప్పటిదాకా ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.5 కోట్లకు పెంచుతూ చట్ట సవరణ చేశారు. అంతేకాక.. దేవదాయ శాఖ పరిపాలన నిధికి టీటీడీ ఇప్పటివరకు ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని కూడా రూ.5 కోట్లకు పెంచి చట్ట సవరణ చేశారు. -
మహానదిలో పురాతన ఆలయం
భువనేశ్వర్ : వందల ఏళ్ల కిందట మహానదిలో మునిగిన అత్యంత పురాతన ఆలయాన్ని పరిశోధకులు గుర్తించిన ఘటన ఒడిషాలోని నయాగఢ్ జిల్లాలో వెలుగుచూసింది. 500 ఏళ్లనాటి పురాతన ఆలయం ఇదని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.మహానదిలో తాము ఇటీవల నీటమునిగిన పురాతన ఆలయాన్ని గుర్తించామని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్)కు చెందిన పురావస్తు సర్వే బృందం వెల్లడించింది. ఇంటాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీపక్ కుమార్ నాయక్ పలుసార్లు ప్రయత్నించిన మీదట ఆలయాన్ని విజయవంతంగా గుర్తించారు. నయాగఢ్‌కు సమీపంలోని పద్మావతి గ్రామంలో నదీమధ్యంలో మునిగిన ఆలయ శిఖరాన్ని కనుగొన్నారు. 60 అడుగుల ఎత్తున్న ఈ ఆలయ నిర్మాణ శైలి, నిర్మాణంలో వాడిన మెటీరియల్‌ను బట్టి ఈ ఆలయం 15వ లేదా 16వ శతాబ్ధం నాటిదని భావిస్తున్నారు. విష్ణు స్వరూపమైన గోపీనాథ్ దేవ్‌కు చెందిన 60 అడుగుల ఎత్తైన ఈ ఆలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాస్త్రవేత్త దీపక్ కుమార్ వెల్లడించారు. ఈ ఆలయం కనుగొన్న ప్రాంతం పద్మావతి గ్రామం ఏడు గ్రామాల కలయికగా ఆవిర్భవించిన సతపట్టణగా గుర్తింపుపొందింది. 150 ఏళ్ల కిందట భారీ వరదలు పోటెత్తడంతో మహానది ఉప్పొంగడంతో మొత్తం గ్రామం నీటమునిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 22 దేవాలయాలు వరదలతో నీటమునిగాయని అత్యంత పొడవైన గోపీనాథ్ దేవాలయం శిఖరం మాత్రమే కొన్నేళ్ల పాటు కనిపించిందని పద్మావతి గ్రామస్తులు చెబుతున్నారు. స్ధానికుడు రవీంద్ర రాణా సహకారంతో దీపక్ నాయక్ ఈ పురాతన ఆలయాన్ని గుర్తించారు. 11 ఏళ్ల కిందట వేసవిలో చివరిసారిగా ఈ ఆలయ శిఖరం స్ధానికులకు కనిపించిందని చెబుతారు. గత ఏడాదిలో నీటి ఉధృతి తగ్గిన నాలుగైదు రోజులు ఆలయ ఆనవాళ్లు కనిపించాయని రవీంద్ర రాణా తెలిపారు. మహానది నీటి గర్భంలో ఆలయం ఉందని ప్రజలకు తెలిసినా 25 సంవత్సరాలుగా అది బయటపడలేదని మహానది ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనిల్ ధీర్ చెప్పారు. మహానదిలో పురాతన ఆలయాన్ని గుర్తించామని ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రజలు నదిలోకి వెళ్లవద్దని తాము గ్రామస్తులను కోరామని నయాగఢ్ సబ్ కలెక్టర్ లగ్నజిత్ రౌత్ పేర్కొన్నారు. చదవండి : ఆధార్ కార్డులను మట్టిలో పాతిపెట్టాడు..! -
పురాతన ఆలయం.. సౌమ్యనాథ క్షేత్రం
నందలూరులోని సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ భక్తులు ఉన్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. సాక్షి, రాజంపేట(కడప) : దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో నందలూరులోని సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్ విన్నగర్ అనే పేర్లు గలవు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడుతో ఈ ఆలయానికి చారిత్రాత్మక అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సౌమ్యనాథుడన్నా.. చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని అర్థం. స్వామి మూలవిరాట్ ఏడడుగుల ఎత్తు ఉండి చాలా సౌమ్యంగా అభయముద్రాలంకితమై ఉంటుంది. ప్రత్యేకత బ్రహ్మమానసపుత్రుడు.. తిలోకసంచారి.. లోకకల్యాణకారకుడు.. కలహాప్రియుడు నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎటువంటి దీపం లేకున్నా.. ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథస్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు. దేవాలయంలో మరో ఆలయం ఆలయంలో లోపలికి ప్రవేశించగానే రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సి ఉంది. ఈ మంటపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉన్నాయి. ఏ దేవాలయానికి అయినా ఆలయ పైభాగంలో సింహం తలలు అమర్చిబడివుంటాయి. కానీ సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉండటం కనిపిస్తుంది. కాబట్టి ఆలయ పైభాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయ లోపల ఉండటం వల్ల.. భూగర్భలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తోంది. రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు. మత్స్య, సింహం చిహ్నాలు ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహం చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు.. ఆలయానికి పైభాగంలో ఉండే మత్స్యకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్థానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్థం వస్తుందని చెబుతుంటారు. చరిత్ర 11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగరాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. పతిరాజులు కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయప్రతాపరుద్రుడు రాజగోపురం కట్టించారు. ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున.. అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని దర్శించుకునేవారు. స్వామిపై శృంగార కీర్తనలు రచించారు. ఆలయ నిర్మాణం ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తుయుక్తముగా సువిశాలంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాలలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతిదీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడమందిర, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయాలు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి. దేవాలయ ఆవరణలో పెద్ద కోనేరు ఉంది. శాసనాలు ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078 లోనిది గాను, క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనంగా గుర్తించారు. ఇందులో దాన శాసనాలే అధికంగా ఉన్నాయి. ఈ శాసనాలలో ఉన్న వాటికి సంబంధించి ఇప్పుడైతే ఏమీ లేవనే స్పష్టమవుతోంది. క్రీ.శ 11వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొదటి వైష్ణవ ఆలయంగా గుర్తించారు. ఆళ్వారుల విగ్రహాలు ఒకే రాతిపీఠంపై ఉండేవి.. ఇప్పుడు లేవు. వీటిలో కొన్ని ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారని అంటున్నారు. కోర్కెలు తీర్చే దేవుడు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా సౌమ్యనాథస్వామి ప్రసిద్ధి చెందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. స్వామిని దర్శించి స్మరిస్తే పాపాలు తొలిగిపోతాయట. మనసారా పూజించే వారికి భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలిగిపోవడమే కాక చెడు కలలు రావడం ఉండవని చెబుతున్నారు. విదేశీయానానికి సిద్ధమవుతున్న వారు ఇక్కడికి వచ్చి.. స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతోంది. ఎలా వెళ్లాలి కడప–రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ ఆలయానికి కడప, తిరుపతి, రాజంపేట నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరుకు.. ముంబయి–చెన్నై మార్గంలో వెళ్లే ఏ రైలు ద్వారానైనా చేరుకోవచ్చును. విమానాశ్రయం అయితే రేణిగుంటకు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా నందలూరుకు చేరుకోవచ్చు. -
అభివృద్ధికి నోచని ఆలయం
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : అదో పురాతన ఆలయం.. 256 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభుస్వా మి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దగ్గి గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే స్వామి గా భక్తుల విశ్వాసం పొందిన ప్రభుస్వామి ఆలయం ఇప్పటివరకూ అభివృద్ధికి నోచలేదు. గుట్టపై కొలువదీరిన స్వామి వారిని దర్శించు కోవడానికి ఉమ్మడి జిల్లాల నుంచే కర్ణాటక, మ హారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతి మాఘ అమావాస్య రోజున నిర్వహించే జాతర ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తు లు మొక్కులు చెల్లించుకుంటారు. తుక్కోజివాడి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన దగ్గి.. ప్రస్తుతం గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కావడంతో ఇప్పటికైనా ఆలయం అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి కనీస వసతులు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శివుని 101 అవతారాల్లో ప్రభుస్వామి అవతారం ఒకటని, ఏకనాథ అవతారమని.. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆల యం ఈ ప్రాంతంలో ఎక్కడా లేదని భక్తులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆలయ అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పై ఏళ్ల నుంచి నిత్య పూజలు.. ప్రభుస్వామి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడిగా ప్రభుస్వామి పేరొందారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ముప్పై ఏళ్ల నాటి నుంచి ఈ గుట్ట మీదికి వచ్చి నిత్య పూజలు చేస్తున్నా. – పాపయ్య, ఆలయ అర్చకుడు -
మన జిల్లాలో అరుదైన శాసనం..!
సాక్షి, కడప కల్చరల్ : మన జిల్లాలో మరో శాసనం వెలుగుచూసింది. కడప నుంచి గండి వాటర్ వర్క్స్‌కు వెళ్లే దారిలో తూర్పునగల గుట్టపై మగ్దూమ్ సాహెబ్ కొట్టాల గ్రామంలో పురాతన శాసనం వెలుగులోకి వచ్చింది. యానాదులు ఉంటున్న ఈ గ్రామం కడప నగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి పురాతనమైన శిథిలమై మొండిగోడలు మాత్రమే మిగిలి ఉన్న ఆలయంలో మూడేళ్ల క్రితం వరకు భైరవేశ్వరస్వామి విగ్రహం తల మాత్రమే ఉండేది. దానికి స్థానికులు పూజలు చేసేవారు. కాగా 2015లో కడపకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు, ‘బాసట స్వచ్ఛంద సంస్థ’ అధ్యక్షులు మేరువ బాలాజీరావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన సభ్యులతో కలిసి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించారు. భైరవేశ్వరుని నూతన విగ్రహాన్ని తయారు చేయించి మూలవిరాట్టుగా ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో కనిపించిన భైరవేశ్వరుని శిథిల మూలమూర్తి, ఇతర దేవతా విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రహరీగా నిలిపారు. వెలుగు చూసిందిలా... బాలాజీరావు ద్వారా సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి ఆ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వివరాలుగల శాసనాలు, ఇతర ఆనవాళ్ల గురించి ఆరా తీశారు. ఆలయం ఎదురుగా ముళ్లపొదల్లో ఉన్న శాసనాన్ని స్థానికులు బయటకు తీశారు. అందులోని లిపిని గమనించిన సాక్షి ప్రతినిధి దాన్ని చరిత్ర పరిశోధకులు విద్వాన్ కట్టా నరసింహులుకు పంపారు. ఆయన దాన్ని పరిశీలించి ఆ బండపై ‘శ్రీ సమరాదిత్య’ అన్న అక్షరాలు ఉన్నాయని తెలిపారు. ఆ పురాతన లిపిని మరింత స్పష్టంగా పరిశీలించేందుకు మైసూరు పురాతత్వశాఖ ప్రతినిధులకు పంపారు. దాంతో పాటు మరో ఇద్దరు చారిత్రక పరిశోధకులకు కూడా పంపారు. కాగా ఇంతవరకు చేసిన పరిశోధనలో జిల్లాలోని పెద్దముడియం గ్రామాన్ని సమరాదిత్య తదితర ప్రభువులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయం వద్ద లభించిన బండపై గల అక్షరాలు తక్కువే అయినా దీని ద్వారా జిల్లాకు సంబంధించిన మరింత చరిత్ర లభించే అవకాశం ఉందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు, చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. చరిత్ర వెలుగులోకి వస్తుంది... ఈ గ్రామంలోని శ్రీ భైరవేశ్వరస్వామి ఆలయాన్ని చూసిన పెద్దలంతా ఇది పురాతనమైన ఆలయమని చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన ఈ శాసనంలోని వివరాలు తెలిస్తే గ్రామచరిత్రతోపాటు జిల్లా చరిత్ర కూడా మరికొంత వెలుగుచూసే అవకాశం ఉంది. – మేరువ బాలాజీరావు, అధ్యక్షులు, బాసట స్వచ్ఛంద సేవా సంస్థ, కడప -
ప్రశాంత నిలయం.. దత్తాలయం
భక్తుల కొంగుబంగారం 600 ఏళ్ల చరిత్రగల పుణ్య క్షేత్రం రేపు గురుపౌర్ణమి ఉత్సవం హత్నూర : దత్తాత్రేయ స్వామి.. గురువులకే గురువు సద్గురువు.. సమస్త పాపాలను, రోగబాధలను, గ్రహ బాధలను హరించి సర్వసంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదించగల దేవుడు శ్రీ గురుదత్తాత్రేయ స్వామి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే శ్రీ దత్తాత్రేయస్వామి. దత్తాత్రేయుని అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి తపోభూమి, ఆయన ప్రధాన శిష్యులు నామదారకుల వారి తపస్సు చేసి నిర్యాణం పొందిన పుణ్యభూమే శ్రీ దత్తాచల క్షేత్రం. క్షేత్ర చరిత్ర మెదక్ హత్నూర మండలం మాదూర గ్రామ శివారులోని గుట్టల్లో వెలసిన దత్తాచలక్షేత్రం(దత్తాలయ గుట్ట) 600 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. అధర్మవర్తనులైన మానవులను సన్మార్గంలో నడిపించి ధర్మములను బోధించుటకు 12వ శతాబ్దంలో శ్రీపాద శ్రీవల్లబుల వారీగా, 15వ శతాబ్దంలో నృసింహ సరస్వతి స్వామిగా అవతరించారు. ఉపనయనం అనంతరం సన్యాసం స్వీకరించి మూగవాళ్లయిన తన సోదరులను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేసి తల్లిదండ్రుల ఆజ్ఞతో సన్యసించి భారత దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. గురుదర్శనమును, మానవుల బాధ్యతలను దేశవ్యాప్తంగా బహుళప్రచారం చేసి అనేకమంది భక్తులకు ఆరాధ్యదైవమై శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఎన్నో పుణ్యక్షేత్రాల్లో తపం ఆచరించి శ్రీ దత్తాచలక్షేత్రంలోని గుహలో కొంతకాలం తపస్సు చేసి కార్ణాటక రాష్ట్రంలోని గానగాపురంలో వారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అచట కొంతకాలం భక్తుల కోరికలు తీరుస్తూ సనాతన ధర్మంలు ఉపదేశించారని పురాణాలు శాస్త్రాలు తెలుపుతున్నాయి. గురుపౌర్ణమి ఉత్సవాలకు ఏర్పాట్లు గురుపౌర్ణమి సందర్భంగా ఈనెల 19న క్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నట్లు సబాపతిశర్మ తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకంలు, మృత్యుంజయ హోమం, చండీహోమంతోపాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. పుష్కరణిలో వరుణజపం చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో స్వామివారి ఉత్సవ మూర్తితో ఊరేగింపు ఉంటుందని తెలిపారు. రాతిబండపై పాదుకలు గుట్టల్లోని ఓ పెద్ద రాతిబండపై దత్తాత్రేయస్వామి వారి పాదుకలు ఉన్నాయి.ఈ పాదుకలను దత్తాత్రేయస్వామి పాదుకలుగా భక్తులు మొక్కుతు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొన్నేళ్ళ నుంచి బ్రహ్మోత్సవాలను ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటు దత్తాత్రేయస్వామి వారి అనుగ్రహం పొందుతున్నారు. ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా ఆంజనేయస్వామి ఉంటు క్షేత్రాన్ని రక్షిస్తూ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ ఆలయానికి ముందు భాగాన ఉన్నారు. దాతల సహకారంతో నిర్మాణం దత్తాచల క్షేత్రం గుహలో ఉన్న దత్తాత్రేయ స్వామివారికి కొంతమంది దాతలు ముందుకు రావడంతో రెండేళ్ళ నుంచి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు క్షేత్ర నిర్వాహకులు శ్రీచక్రార్చకులు, దత్త ఉపాసకులు సబాపతిశర్మ తెలిపారు. దత్తజయంతి, గురుపౌర్ణమి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ భక్తులకు స్వామివారి కృపను అందించేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. దత్తాత్రేయ స్వామి వారిని భక్తులందరూ దర్శించుకునేందుకు ఇబ్బందిగా ఉన్నందునే నూతనంగా అదే స్థానంలో బండరాళ్ళను కొంత మేరకు తొలగించి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పంతో ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు.