భువనేశ్వర్ : వందల ఏళ్ల కిందట మహానదిలో మునిగిన అత్యంత పురాతన ఆలయాన్ని పరిశోధకులు గుర్తించిన ఘటన ఒడిషాలోని నయాగఢ్ జిల్లాలో వెలుగుచూసింది. 500 ఏళ్లనాటి పురాతన ఆలయం ఇదని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.మహానదిలో తాము ఇటీవల నీటమునిగిన పురాతన ఆలయాన్ని గుర్తించామని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్)కు చెందిన పురావస్తు సర్వే బృందం వెల్లడించింది. ఇంటాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీపక్ కుమార్ నాయక్ పలుసార్లు ప్రయత్నించిన మీదట ఆలయాన్ని విజయవంతంగా గుర్తించారు. నయాగఢ్‌కు సమీపంలోని పద్మావతి గ్రామంలో నదీమధ్యంలో మునిగిన ఆలయ శిఖరాన్ని కనుగొన్నారు.
60 అడుగుల ఎత్తున్న ఈ ఆలయ నిర్మాణ శైలి, నిర్మాణంలో వాడిన మెటీరియల్‌ను బట్టి ఈ ఆలయం 15వ లేదా 16వ శతాబ్ధం నాటిదని భావిస్తున్నారు. విష్ణు స్వరూపమైన గోపీనాథ్ దేవ్‌కు చెందిన 60 అడుగుల ఎత్తైన ఈ ఆలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాస్త్రవేత్త దీపక్ కుమార్ వెల్లడించారు. ఈ ఆలయం కనుగొన్న ప్రాంతం పద్మావతి గ్రామం ఏడు గ్రామాల కలయికగా ఆవిర్భవించిన సతపట్టణగా గుర్తింపుపొందింది. 150 ఏళ్ల కిందట భారీ వరదలు పోటెత్తడంతో మహానది ఉప్పొంగడంతో మొత్తం గ్రామం నీటమునిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 22 దేవాలయాలు వరదలతో నీటమునిగాయని అత్యంత పొడవైన గోపీనాథ్ దేవాలయం శిఖరం మాత్రమే కొన్నేళ్ల పాటు కనిపించిందని పద్మావతి గ్రామస్తులు చెబుతున్నారు.
స్ధానికుడు రవీంద్ర రాణా సహకారంతో దీపక్ నాయక్ ఈ పురాతన ఆలయాన్ని గుర్తించారు. 11 ఏళ్ల కిందట వేసవిలో చివరిసారిగా ఈ ఆలయ శిఖరం స్ధానికులకు కనిపించిందని చెబుతారు. గత ఏడాదిలో నీటి ఉధృతి తగ్గిన నాలుగైదు రోజులు ఆలయ ఆనవాళ్లు కనిపించాయని రవీంద్ర రాణా తెలిపారు. మహానది నీటి గర్భంలో ఆలయం ఉందని ప్రజలకు తెలిసినా 25 సంవత్సరాలుగా అది బయటపడలేదని మహానది ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనిల్ ధీర్ చెప్పారు. మహానదిలో పురాతన ఆలయాన్ని గుర్తించామని ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రజలు నదిలోకి వెళ్లవద్దని తాము గ్రామస్తులను కోరామని నయాగఢ్ సబ్ కలెక్టర్ లగ్నజిత్ రౌత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment