నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్‌ | Five Arrested In Nepali Student Case At Odisha, Check More Details About This Case Inside | Sakshi
Sakshi News home page

నేపాలి విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు కీలక వ్యక్తులు అరెస్ట్‌

Published Wed, Feb 19 2025 7:22 AM | Last Updated on Wed, Feb 19 2025 1:47 PM

Five Arrested In Nepali Student Case At Odisha

భువనేశ్వర్‌: ఒడిశాలోని భువనేశ్వర్‌ పట్టణంలోని ప్రైవేట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ అయిన కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండ్రస్టియల్‌ టెక్నాలజీ(కేఐఐటీ)లో 20 ఏళ్ల నేపాలీ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో కాలేజీ హెచ్‌ఆర్‌ విభాగ డైరెక్టర్‌ జనరల్, పరిపాలనా విభాగ డైరెక్టర్, హాస్టల్స్‌ డైరెక్టర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.

వివరాల ప్రకారం.. విద్యార్థి వేధింపుల కారణంగా కేఐఐటీ హాస్టల్‌లో ప్రకృతి లాంసాల్‌ అనే బీటెక్‌ మూడో ఏడాది విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న 900 మంది నేపాలీ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు అణచివేసేందుకు వర్సిటీలోని ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు విచక్షణారహితంగా కొట్టడం, తర్వాత 800 మంది విద్యార్థులను హాస్టల్‌ ఖాళీ చేయించి పంపేయడం చర్చనీయాంశమైంది.  

ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ముగ్గురితో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్‌ లేఖలు జారీచేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఈ కమిటీ ఆరాతీసి ప్రభుత్వానికి నివేదించనుంది.

ఇక, ఘటనపై నేపాల్‌ ప్రభుత్వం స్పందించింది. తమ దేశ విద్యార్థులను కలిసి విషయం తెల్సుకుని తదుపరి కార్యచరణ కోసం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులను ఒడిశాకు పంపింది. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్‌లో చేర్పించడం లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు ఆ అధికారులు సలహాలు, సూచనలు చేస్తారు. విద్యార్థి మరణం వార్త తెల్సి నేపాల్‌ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సైతం విచారం వ్యక్తంచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement