submerged in water
-
కష్టమంతా వరదపాలు
ఈ చిత్రంలోని సంతోష్, దుర్గ దంపతులు విజయవాడ వన్‌టౌన్ సాయిరాం థియేటర్ వెనుక రాజీవ్‌శర్మ వీధిలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి డాబాపైకి వెళ్లిపోయారు. రూ.20 వేల విలువైన వాషింగ్ మెషిన్, రూ.22 వేల ఫ్రిడ్జ్, రూ.50 వేల విలువైన డబుల్ కాట్, రూ.15 వేల దివాన్, రూ.10 వేల మిక్సీ గ్రైండర్ నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.వీటి విలువే రూ.1.17 లక్షలు. ఇవి పనిచేసే పరిస్థితి లేదు. నాలుగు బియ్యం బస్తాలు, వంట సామగ్రి, సరుకులు ఏవీ మిగల్లేదు. భవన నిర్మాణంలో టైల్స్ అమర్చే పని చేసే సంతోష్ వాయిదా పద్ధతిలో 2016 నుంచి ఒక్కొక్కటిగా కొనుక్కొంటున్నారు. ఎనిమిదేళ్ల కష్టం ఒక్క రోజులో నీటిపాలైంది. మళ్లీ ఇన్ని వస్తువులు సమకూర్చుకోవడం ఇప్పట్లో తమ వల్ల అయ్యే పని కాదని సంతోష్, దుర్గ బోరున విలపిస్తున్నారు.(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): వరదల కారణంగా బెజవాడ, పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు ఇలా వేలు, లక్షల్లో నష్టపోయాయి. జీవిత కాలం కష్టమంతా వరద నీటి పాలైపోయింది. గృహావసరాలకు ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, మంచం, ఫ్యాను, గ్రైండర్ వంటికి కొనుక్కోవడానికి కూడా పేద, మధ్య తరగతి ప్రజలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రూపాయి రూపాయి పోగేసి, చిట్టీలు కట్టి, ఈఎంఐలతో కొంటుంటారు. ఇప్పుడు వరదలో అన్నీ పాడైపోయాయి. ఇవే కాదు.. పిల్లల విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆస్తి దస్తావేజులు, పాఠశాలల ఫీజు రసీదులు, కష్టపడి సంపాదించుకున్న నగదు, శుభకార్యాల కోసం, రోజువారీ అవసరాల కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బు బీరువాల్లో తడిసిముద్దయ్యాయి. కొన్ని వరదలో కొట్టుకొనిపోయాయి. ప్రతి ఇంటికీ రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ జీరో నుంచి జీవితం మొదలుపెట్టాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాకు మిగిలిందేమీ లేదు..ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. సామగ్రి మొత్తం మునిగిపోయింది. పాములు కూడా ఇళ్లలోకి చేరాయి. జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్నవన్నీ వరద పాలయ్యాయి. మాకు మిగిలిందేమీ లేదు. – సాయికుమారి, రాజరాజేశ్వరిపేటవిలువైన పత్రాలేవీ మిగల్లేదుపిల్లల సర్టిఫికెట్లు, ఇంటి పట్టాలు, గుర్తింపు కార్డులన్నీ నీటిలో నానిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ పోయి దుర్బర స్థితిలోకి వచ్చేశాం. మా స్కూటీ కూడా కొట్టుకెళ్లిపోయింది. పూలు అమ్ముకునే నాలాంటోళ్లు ఎన్నేళ్లు కష్టపడితే ఇంటి సామగ్రిని సమకూర్చుకోగలం? – గోపమ్మ, రాజరాజేశ్వరి పేటమళ్లీ వస్తువులు కొనుక్కోవడం మా వల్ల కాదుఇంట్లో ప్రతి వస్తువూ వాయిదాల్లో కొన్నవే. రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కొన్నాం. వాటి కోసం ఇతర ఖర్చులూ తగ్గించేసుకున్నాం. ఒక్కో వస్తువు రూ.20వేలుపైనే ఉంటుంది. అవన్నీ మళ్లీ కొనుక్కోవాలంటే మావల్ల కాదు. – జగన్నాథం దుర్గ, బాధితురాలు, రాజరాజేశ్వరిపేటడ్రోన్లతో ఆహారం ఎవరికిస్తున్నారో..?నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సింగ్‌నగర్ పైపులరోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ఆదివారం ఉదయం మా ఇంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు మొదటి అంతస్తుకు చేరాం. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. వారు ఆకలి అని ఏడుస్తుంటే ఆదివారం సాయంత్రం అటుగా వెళ్తున్న బోటు అడిగితే రూ.4 వేలు ఇవ్వమన్నారు. అంత ఇవ్వలేక అక్కడే ఉండిపోయాం. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. ఆహారం, నీరు కూడా అందించలేదు. మా బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంకులో నీళ్లు తాగి బతికాం. ఆ ట్యాంకులో కూడా నీళ్లు ఖాళీ కావడంతో పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరాం. డ్రోన్లు, హెలికాప్టర్లలో ఆహారం ఎవరికి ఇస్తున్నాయో తెలియడం లేదు. – బూర అనీల్, పైపులరోడ్డు, అజిత్సింగ్నగర్మానవ తప్పిదమే..ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇది ప్రకృతి వైపరీత్యం అని సరిపెట్టుకునేందుకు వీల్లేదు. ఇది కచ్చితంగా మానవ తప్పిదంగానే భావిస్తున్నాను. ప్రాణ భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒకటి, రెండు అంతస్తుల్లోకి వెళ్లిపోయాం. ఎవరు ఎక్కడికి వెళ్లిపోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి. అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీళ్లు వచ్చేసి అన్నీ మునిగిపోయాయి. ప్రాణ భయం అంటే ఏమిటో తెలిసింది. – నక్కా ప్రభుదాస్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్
అహ్మదాబాద్: హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను వణికించిన వర్షాలు ఇక గుజరాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నేడు గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కేవలం కొన్ని గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. దీంతో రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. రానున్న మరికొన్ని గంటల్లో దక్షిణ గుజరాత్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది. వర్షాల ధాటికి గుజరాత్లో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. రహదారులపై నీరు పేరుకుని రాకపోకలు దెబ్బతిన్నాయి. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. #WATCH | Gujarat | Severe waterlogging in Dhoraji city of Rajkot district due to incessant rainfall. (18.07) Around 300 mm of rainfall has been recorded in the last few hours. 70 people have been shifted to safer places. pic.twitter.com/oaf5Z03q5R — ANI (@ANI) July 18, 2023 గుజరాత్లో నేడు ఉదయం 6 గంటల నుంచి దాదాపు 14 గంటల్లోనే గిర్ సోమనాథ్ జిల్లాలోని సుత్రపడ తాలూకాలో అత్యధికంగా 345 మీమీ వర్షపాతం సంభవించింది. రాజ్‌కోట్‌లోని ధోరాజీ తాలూకాలో 250 మీమీ వర్షపాతం రాగా.. కేవలం రెండు గంటల్లోనే 145 మీమీ వర్షం సంభవించడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా గుజరాత్లో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ జారీ చేశారు. 18 డ్యామ్‌లకు అలర్ట్ జారీ చేశారు. భారత విపత్తు నిర్వహణ శాఖా కూడా అలర్ట్ అయింది. ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంట్ షాక్‌తో 15 మంది దుర్మరణం -
బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్..
-
బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్..
పట్నా: బిహార్‌లోని సోన్ నదిలో చిక్కుకున్న లారీలను బయటకు తీస్తున్నారు అధికారులు. ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఆ దృశ్యాలు బీతికొల్పుతున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సగం లారీ మునిగిపోయినప్పటికీ ప్రవాహంలో వాహనాలను బయటికి తీయడం సాహసంతో కూడిన పని అని నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. సోన్ నదీ ప్రవాహంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. ఇటీవల కురిసిన విపరీత వర్షాల కారణంగా సోన్ నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటికే నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న 28 లారీలు నదిలో చిక్కుకుపోయాయి. అదీగాక జులై 1 నుంచి సోన్ నదిలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత వారం రోజుల నుంచి వాహనాలను బయటికి తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే.. రోహ్టాస్ జిల్లాలో ఖటూర్ బాలు ఘాట్ వద్ద లారీలను నదిలో వరద నీరు ఉద్దృతంగా ప్రవహిస్తున్నప్పటికీ బయటకు తీశారు. వాహనం సగంపైనే మునిగిపోయినప్పటికీ ఏమాత్రం వెనకకు తగ్గకుండా ప్రవాహాన్ని దాటేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..! -
తెలంగాణ: ఒక్కరోజే ఆరుగురి మృతి.. దాంతో ఆటలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘ఊరోడికి కాటి భయం... పొరుగోడికి నీటి భయం...’ నీరు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ నానుడి చాలు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉదంతాల్లో ఏకంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వేసవి తాపానికి తోడు ఇతర పరిణామాల నేపథ్యంలో ఆహ్లాదం కోసం అనేక మంది ‘నీటి’ని ఆశ్రయిస్తున్నారు. ఆయా చెరువులు, కుంటలు, కాలువలు తదితరాలపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు... ఇలా వివిధ కారణాలతో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా అశువులు బాస్తున్న వారిలో చిన్నారులు, యువతే ఎక్కువగా ఉంటున్నారు. కనిపించని అగాథాలు ఎన్నో... సాధారణంగా చెరువులు, కుంటలు ఓ దశలో ఎండిపోతుంటాయి. ఆ సమీపంలో నివసించే ప్రజలు ఆయా సమయాల్లో వాటిలోని మట్టిని తవ్వి చిన్న చిన్న అవసరాలకు వాడుతుంటారు. ఈ రకంగా ఆయా ప్రాంతాల్లో గోతులు ఏర్పడుతుంటాయి. ఎండిన సమయంలో ఈ గుంతలు కనిపించినా.. నీరు చేరినప్పుడు అవీ నిండిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడ గొయ్య ఉందో, ఎక్కడ ఎత్తు ఉందో ఆ ప్రాంతంతో పరిచయం లేని వాళ్లు ఈ విషయాలు గుర్తించడం అసాధ్యం. ఈత రాని వారు నీళ్లల్లో దిగినప్పుడు మొల్లగా నడుచుకుంటూ మెడ లోతు వరకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు. ఇలా నడుస్తున్న క్రమంలో హఠాత్తుగా నీటి లోపల ఉన్న గుంటలోకి వెళ్తే... తేరుకునే లోపే మునిగిపోతున్నారు. వచ్చీరాని ఈతతో ముప్పే... ఏ మాత్రం ఈతరాని వారి పరిస్థితి ఇలా ఉంటే... వచ్చీరాని ఈతతో చెరువులు, కుంటలు తదితరాల్లోకి దిగేవాళ్లూ మృత్యువాత పడుతున్నారు. ఈతపై పూర్తి పట్టులేకపోవడంతో కొంతసేపు జోష్‌తో చెరువులో కొంత దూరం వెళ్తున్నారు. ఆపై అలసిపోవడంతో వెనక్కు రాలేక నీట మునిగిపోతున్నారు. మరోపక్క తమ బృందంలో ఒకరు మునిగిపోతున్నట్లు గుర్తించిన ఇతరులు వారిని రక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా రక్షించే సమయాల్లో సమయస్ఫూర్తి, నైపుణ్యం లేక వీరు కూడా మునిగిపోయి చనిపోతున్నారు. ఈ జాగ్రత్తలు అవసరం... ►కొత్త ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో దిగేప్పుడు వాటి వివరాలు స్థానికుల్ని అడిగి తెలుసుకోవాలి. ►స్నానం/ఈత కోసం అంతా ఒకేసారి చెరువుల్లో దిగకూడదు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కొందరైనా గట్టుపై ఉండాలి. ►ఈత రాని, దానిపై పట్టు లేని వాళ్లు నీటిలో దిగేప్పుడు ట్యూబు, గాలితో నింపిన ప్లాస్టిక్ సంచులు... కనీసం ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలను తమ వెంట ఉంచుకోవాలి. ►గట్టుపై ఉండే వాళ్లు తాడు, కర్రలు వంటిని సిద్ధంగా ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపకరిస్తాయి. ►నీటిలో మునిగిపోతున్న వారిని అనాలోచితంగా, ఎలాంటి ఉపకరణాలు లేకుండా రక్షించడానికి ప్రయత్నించడమూ ప్రమాదహేతువే. ►నీళ్లల్లో మునిగిపోతున్న వారిని రక్షించేప్పుడు ముందుగా వారి వద్దకు వెళ్లిన వెంటనే కంగారు పడద్దని, రక్షించే వ్యక్తి కాళ్లు, చేతులు పట్టుకోవద్దని ధైర్యం చెప్పాలి. ►నీటిలో మునిగిపోతున్న వారిని వెనుక నుంచి పట్టుకుని రక్షించే ప్రయత్నం చేయాలి. తాడుతో పాటు ఈతకు ఉపకరించే ఉపకరణాలు అందించడం ఉత్తమం. ►ఇటీవల కాలంలో యువతకు సెల్ఫీ మోజు పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఈ ఫొటోలు దిగుతున్నాయి. అయితే చెరువులు వంటి వాటి వద్ద వీటికి దూరంగా ఉండటం ఉత్తమం. -
విషాదం మిగిల్చిన ఈత సరదా
అబ్దుల్లాపూర్‌మెట్: సరదాగా కుంటలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మహబూబ్‌నగర్ జిల్లా కొమిరెడ్డిపల్లికి చెందిన ఎస్.క్రాంతికుమార్‌రెడ్డి (20), సంగారెడ్డి జిల్లా పాంపాడ్‌కు చెందిన పటోళ్ల శ్రీకాంత్ (20) శుక్రవారం సప్లిమెంటరీ పరీక్షలు రాసి మిగతా ఆరుగురు స్నేహితులతో కలిసి సంఘీనగర్ దేవాలయాల పరిసరాలకు వచ్చారు. కొహెడ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన మిగతా విద్యార్థులు.. 100కు డయల్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుంటలోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
జడిపించిన జడివాన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం తో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలాచోట్ల పంటలు నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో పలు కాలనీలు జల మయమయ్యాయి. హైదరాబాద్‌లోని చార్మినార్, గన్‌ఫౌండ్రి, జూపార్క్ తదితర ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వాననీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఊర్కొండ మండలం గుడిగాన్‌పల్లి శివారులో కేఎల్ఐ కాల్వ తెగిపోయింది. చాలాచోట్ల వందలాది ఎకరాల పంటచేలల్లో వర్షపునీరు నిలిచిపోయింది. కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్నసంగమేశ్వర ఆలయం సమీపంలోకి నీళ్లు చేరాయి. ♦నిజామాబాద్ పట్టణంతోపాటు మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలో లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి వర్షపునీరు చేరింది. ♦సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లో గంటపాటు కురిసిన వానలకు రహదారులు జలమయమయ్యాయి. వరుస వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకుంది. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వివరించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మట్టి మిద్దె కూలి మహిళ మృతి రాజోళి (అలంపూర్): మట్టిమిద్దె కూ లి ఓ మహిళ మృతి చెందగా, ఆమె కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని చిన్నధన్వాడకు చెం దిన బోయ సరస్వతమ్మ (50), కృష్ణ య్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆషాఢమాసం కావడంతో చిన్నకూతురు నాలుగు రోజుల క్రితమే పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం అర్ధరాత్రి ఇల్లు కూలింది. నిద్రిస్తున్న సరస్వతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. కొడుకు ఆరుబయట నిద్రించడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సంఘటనస్థలాన్ని డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ పరిశీలించారు. -
నీట మునిగి 8 మంది దుర్మరణం
కవిటి/కొత్తపట్నం/పెనమలూరు: నాలుగు వేర్వేరు ఘటనల్లో 8 మంది యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో మునిగి ఐదుగురు మృతిచెందగా, కృష్ణా నదిలో మునిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ముగ్గురిని మింగేసిన సుడిగుండం.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన బొర్ర సాయిలోకేష్ పుట్టిన రోజు సందర్భంగా 15 మంది స్నేహితులు పుక్కళ్లపాలెం తీరం వద్ద సముద్ర స్నానానికి వెళ్లారు. అంతలో ఉవ్వెత్తున వచ్చిన కెరటం తాకిడిని తట్టుకోలేక నలుగురు యువకులు అక్కడే ఉన్న సుడిగుండంలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎవ్వరూ సాహసించలేకపోవడంతో మారిడి తిరుమల(21), బొర్ర మనోజ్(24), బొర్ర సాయిలోకేష్(20)లు ప్రాణాలు విడిచారు. కాసేపటికి వారి మృతదేహాలు ఒడ్డుకు చేరాయి. బొర్ర గోపీచంద్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఉసురు తీసిన అల ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాల్‌నగరానికి చెందిన ఈర్ల సుజిత్(21), టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలేనికి చెందిన శనగపల్లి శ్రీనివాస్(21), పేర్నమిట్టకు చెందిన ఆకుల అనుదీప్, ఒంగోలుకు చెందిన షేక్ ఆలీష్‌లు పదో తరగతి చదివేప్పుడు స్నేహితులు. ప్రస్తుతం వివిధ కాలేజీల్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ నలుగురూ కలిసి కొత్తపట్నం బీచ్‌కు వెళ్లారు. సముద్రంలోకి దిగి ఈర్ల సుజీత్, శనగపల్లి శ్రీనివాస్‌లు కొద్దిగా ముందుకెళ్లారు. ఒక్కసారిగా అల రావడంతో ఇద్దరూ లోనికి కొట్టుకుపోయారు. ఒడ్డునే ఉన్న అనుదీప్, ఆలీష్‌లు పెద్దగా కేకలు వేశారు. మత్స్యకారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సుజీత్, శ్రీనివాస్‌లు శవాలై ఒడ్డుకు కొట్టుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఊపిరి తీసిన ఊబి కృష్ణా జిల్లా తాడిగడప కార్మికనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ పోతార్లంక జయసాయిశ్రీనివాస్(25), గురునానక్ కాలనీకి చెందిన కె.గోవిందు(22) రామవరప్పాడు బల్లెంవారి వీధికి చెందిన కార్పెంటర్ కె.సతీష్(21), పటమట ఆటోనగర్‌కు చెందిన పొలగాని శివ(20)లు చేపలు పట్టేందుకు పెదపులిపాక ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి దిగారు. జయసాయిశ్రీనివాస్, గోవిందు, సతీష్ నదిలోకి దిగగా, శివ ఒడ్డున కూర్చున్నాడు. నదిలోకి దిగిన కొద్ది సమయానికే ఊబిలో పడి ముగ్గురూ మునిగిపోయారు. ఫైర్ సిబ్బంది సాయంతో మూడు మృతదేహాలనూ వెలికి తీసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయా ఘటనల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరిలో నలుగురు గల్లంతు పి.గన్నవరం: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం సమీపాన ఆదివారం గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్ (15), యర్రంశెట్టి రత్నసాగర్ (15), పంతాల పవన్ (15), ఖండవిల్లి వినయ్ (15) గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. -
నీట మునిగిన ‘కేఎల్ఐ’ మోటార్లు
సాక్షి, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) మొదటి లిఫ్ట్ మోటార్లు నీట మునిగాయి. కొల్లాపూర్ నియోజకవర్గం కృష్ణానది తీరంలోని ఎల్లూరు వద్ద కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం 1, 3వ మోటార్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మూడో మోటార్ నీటిని ఎత్తిపోసే పైపులైన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల సర్జ్‌పూల్ పక్కనే గల భూగర్భంలోని ఐదు మోటార్లు నీట మునిగాయి. లీకేజీ ఏర్పడి నీరు మోటార్లకు వస్తుండగా అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు మొదటి మోటార్‌ను, సాయంత్రం 3.40 గంటలకు మూడో మోటార్‌ను ప్రారంభించారు. మూడో మోటార్ ఆన్‌చేసిన 10 నిమిషాల తర్వాత ఆ మోటార్ కింద ఉన్న బేస్మెంట్ బ్లాస్ట్ కావడం వల్ల నీళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. లిప్ట్‌లోని 45 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చాయి. లిఫ్ట్‌లోని ఎనిమిది అంతస్తులతో పాటు ప్యానల్ బోర్డు సహా నీట మునిగాయి. ఈ విషయంపై కేఎల్ఐ ఎస్ఈ అంజయ్యను వివరణ కోరగా.. మోటార్లు లీక్ కావడం వల్ల నీరు వచ్చిందని, డీ వాటరింగ్ చేస్తామని వివరించారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే వెల్లడిస్తామని తెలిపారు. కాగా కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద 2015లో కూడా ఇదే విధంగా మోటార్లు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి రాత్రి 10 గంటల సమయంలో ఘటన జరిగిన ఎల్లూరు వద్ద కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీంచారు. సాంకేతిక లోపం వల్లే.. మంత్రి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ రూరల్: కేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్‌లో సాంకేతిక లోపం వల్ల వరద నీరు వచ్చి ఐదు పంపులు మునిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యపై ప్రస్తుతం ఎలాంటి పరిష్కారం దొరకదని, నీటిని డీవాటరింగ్ చేస్తే తప్ప.. విషయం చెప్పడానికి వీలుకాదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మునిగిపోయిన పంపులను ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాగునీటి కోసం మిషన్‌భగీరథ పథకం అవసరం నిమిత్తం మధ్యాహ్నం 2.54 నిమిషాలకు మొదటి లిఫ్ట్‌లోని మొదటి పంపును ప్రారంభించారు. 3.45 నిమిషాలకు మూడో పంపును ప్రారంభించిన వెంటనే పెద్ద ఎత్తున మోటార్ల శబ్ధం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను సాంకేతిక లోపంగా గుర్తించామని పేర్కొన్నారు. -
కృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు
సాక్షి, నారాయణపేట : జిల్లాలోని మక్తల్ మండలం పసుపుల గ్రామం వద్ద సోమవారం కృష్ణానదిలో పుట్టి మునిగిన దుర్ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. పుట్టిలో ప్రయాణించిన వారు కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారు. నిత్యావసర సరకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న పుట్టి మునిగింది. గల్లంతైనవారు సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ చేతన ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. (వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు) భారీ వర్షాలతో కృష్ణానదిలో రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గల్లంతైన వారి ఆచూకీపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే ప్రాంతంలో వల్లభాపురం దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు పుట్టిల్లోనే ప్రమాదకర ప్రయాణం కొనసాగిస్తుంటారు. -
మహానదిలో పురాతన ఆలయం
భువనేశ్వర్ : వందల ఏళ్ల కిందట మహానదిలో మునిగిన అత్యంత పురాతన ఆలయాన్ని పరిశోధకులు గుర్తించిన ఘటన ఒడిషాలోని నయాగఢ్ జిల్లాలో వెలుగుచూసింది. 500 ఏళ్లనాటి పురాతన ఆలయం ఇదని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.మహానదిలో తాము ఇటీవల నీటమునిగిన పురాతన ఆలయాన్ని గుర్తించామని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్)కు చెందిన పురావస్తు సర్వే బృందం వెల్లడించింది. ఇంటాక్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీపక్ కుమార్ నాయక్ పలుసార్లు ప్రయత్నించిన మీదట ఆలయాన్ని విజయవంతంగా గుర్తించారు. నయాగఢ్‌కు సమీపంలోని పద్మావతి గ్రామంలో నదీమధ్యంలో మునిగిన ఆలయ శిఖరాన్ని కనుగొన్నారు. 60 అడుగుల ఎత్తున్న ఈ ఆలయ నిర్మాణ శైలి, నిర్మాణంలో వాడిన మెటీరియల్‌ను బట్టి ఈ ఆలయం 15వ లేదా 16వ శతాబ్ధం నాటిదని భావిస్తున్నారు. విష్ణు స్వరూపమైన గోపీనాథ్ దేవ్‌కు చెందిన 60 అడుగుల ఎత్తైన ఈ ఆలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాస్త్రవేత్త దీపక్ కుమార్ వెల్లడించారు. ఈ ఆలయం కనుగొన్న ప్రాంతం పద్మావతి గ్రామం ఏడు గ్రామాల కలయికగా ఆవిర్భవించిన సతపట్టణగా గుర్తింపుపొందింది. 150 ఏళ్ల కిందట భారీ వరదలు పోటెత్తడంతో మహానది ఉప్పొంగడంతో మొత్తం గ్రామం నీటమునిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 22 దేవాలయాలు వరదలతో నీటమునిగాయని అత్యంత పొడవైన గోపీనాథ్ దేవాలయం శిఖరం మాత్రమే కొన్నేళ్ల పాటు కనిపించిందని పద్మావతి గ్రామస్తులు చెబుతున్నారు. స్ధానికుడు రవీంద్ర రాణా సహకారంతో దీపక్ నాయక్ ఈ పురాతన ఆలయాన్ని గుర్తించారు. 11 ఏళ్ల కిందట వేసవిలో చివరిసారిగా ఈ ఆలయ శిఖరం స్ధానికులకు కనిపించిందని చెబుతారు. గత ఏడాదిలో నీటి ఉధృతి తగ్గిన నాలుగైదు రోజులు ఆలయ ఆనవాళ్లు కనిపించాయని రవీంద్ర రాణా తెలిపారు. మహానది నీటి గర్భంలో ఆలయం ఉందని ప్రజలకు తెలిసినా 25 సంవత్సరాలుగా అది బయటపడలేదని మహానది ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనిల్ ధీర్ చెప్పారు. మహానదిలో పురాతన ఆలయాన్ని గుర్తించామని ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రజలు నదిలోకి వెళ్లవద్దని తాము గ్రామస్తులను కోరామని నయాగఢ్ సబ్ కలెక్టర్ లగ్నజిత్ రౌత్ పేర్కొన్నారు. చదవండి : ఆధార్ కార్డులను మట్టిలో పాతిపెట్టాడు..! -
సముద్రంలో మునిగిపోయిన స్టీల్ బార్జి
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఆఫ్రికాకు వెళ్లే ఓడలోకి బియ్యం లోడ్ చేసేందుకు వెళ్తున్న స్టీల్ బార్జి ఆదివారం ఉదయం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 12 మంది కళాసీలు తృటిలో తప్పించుకున్నారు. రూ.5 కోట్ల మేర నష్టం సంభవించి ఉంటుందని పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మెస్సర్స్ లోటస్ మెరైన్ కంపెనీ ఇచ్చిన ఆర్డర్ మేరకు కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా వెళ్లే ఓడలోకి 600 టన్నుల బియ్యం లోడ్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మేళం తాండవకృష్ణకు చెందిన బి–81వ నంబర్ స్టీల్ బార్జిలోకి శనివారం రాత్రి బియ్యం లోడ్ చేశారు. ఆదివారం ఉదయమే ఓ బోటుతో ఈ బార్జిని ఓడ వద్దకు చేర్చారు. ఓడ సమీపంలోకి వెళ్లేసరికి బలమైన గాలులు వీయడంతో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో బార్జిపై 12 మంది కళాసీలున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన కళాసీలు బార్జిని తిరిగి యాంకరేజ్ పోర్టుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు వీచాయి. దీంతో అలలు ఎగసిపడి బార్జిలోకి నీరు ప్రవేశించింది. అది మునిగిపోతుండడాన్ని గమనించిన కళాసీలు కేకలు పెట్టారు. దీంతో బార్జిని తీసుకెళ్తున్న బోటులోని వారు వెంటనే స్పందించి బార్జికి, బోటుకు ఉన్న రోప్‌ను కట్ చేశారు. లేకుంటే బోటు కూడా మునిగిపోయేదని బార్జిలో ఉన్న సరంగు దుర్గారావు చెప్పారు. బార్జి మునిగిపోతుండటంతో దానిలో ఉన్న 12 మంది కళాసీల్లో 8 మంది బోటు ఎక్కేశారు. మరో నలుగురు కళాసీలు బోటు ఎక్కే ప్రయత్నంలో సముద్రంలో పడిపోయారు. వారిని బోటులోని వారు రక్షించారు. దీంతో వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారు చూస్తుండగానే 600 టన్నుల బియ్యంతో బార్జి సముద్రంలో మునిగిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి వాతావరణంలో మార్పులొచ్చి, వర్షం కూడా పడింది. అయినా పోర్టు అధికారుల ఒత్తిడి మేరకే బార్జిని సముద్రంలోని ఓడ వద్దకు తీసుకెళ్లినట్టు కొందరు కళాసీలు చెబుతున్నారు. ప్రమాదంలో బార్జి యజమానికి రూ.3 కోట్ల వరకూ నష్టం వాటిల్లి ఉంటుందని, అందులోని బియ్యం విలువ మరో రూ.2 కోట్లు ఉండొచ్చని పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై బార్జి యజమాని మేళం తాండవకృష్ణ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ మెరైన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హమ్మయ్య.. అందరూ క్షేమం ; వీడియో వైరల్
జైపూర్ : 50 మంది విద్యార్ధులతో ప్రయాణిస్తున్న ఓ స్కూల్ బస్సు నీటిలో సగం మునిగిపోయింది. అయితే బస్సులోని పిల్లలందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని దౌసాలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. దౌసా ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడ ఉన్న అండర్ పాస్‌లో నీళ్లు చేరాయి. అయితే, డ్రైవర్ ఈ విషయాన్ని గమనించపోవడంతో బస్సును ఆ అండర్ పాస్‌లోకి తీసుకెళ్లాడు. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే బస్సు అంతకంతకు నీళ్లలో మునుగుతోన్న సమయంలో దానిలోని విద్యార్థులంతా సమయస్ఫూర్తితో వ్యవహరించి కిటికీల్లోంచి బస్సు పైకి ఎక్కడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సు నీళ్లలో మునగడం గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని విద్యార్ధులను కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా విద్యార్ధులను బయటకు తీసుకొచ్చేందుకు ముందుగా ఓ గోడపై నుంచి తాడును వదిలారు. కానీ ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో.. ఈతగాళ్లు ఆ నీళ్లలోకి దూకి వారిని బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ ఫోన్లలో బంధించి, ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. -
జలసమాధి
చెరువులో మునిగి ఏడుగురు మృతి మృతుల్లో నలుగురు యువతులు.. వీరంతా హైదరాబాద్‌వాసులు చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలో ఘటన ఆమనగల్లు: సరదా వారి పాలిట శాపంగా మారింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని చెరువులోకి దిగిన ఏడుగురు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈతరాక పోవడంతో వారు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన వారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు.. ముగ్గురు యువకులు ఉన్నారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట సమీపంలోని అల్‌జుబేల్ కాలనీలో అహ్మద్‌బేగ్ కుటుంబానికి చెందిన 13 మంది టవేరా వాహనంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో తమ సమీప బంధువుల ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో స్నానాల కోసం వీరంతా దగ్గరలో ఉన్న చరికొండ గౌరమ్మ చెరువుకు చేరుకున్నారు. ముందుగా ముస్కాన్ (18) చెరువులోకి దిగింది. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ఆమె మునిగి పోయింది. దీంతో పక్కనే ఉన్న సల్మాన్ (30), రెహమాన్ (19), షేక్ బాసిత్(30), రొఖియా బేగం(28), మస్రత్ ఫాతిమా(19), మౌనాబేగం(18) కూడా చెరువులోకి దిగి ముస్కాన్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే పట్టు దొరకక వారు కూడా చెరువులో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే వారంతా ప్రాణాలు వదిలారు. మృతుల్లో సల్మాన్, రెహమాన్, మౌనబేగం, రుకియా బేగం, బాసిత్లు ఒకే కుటుంబానికి చెందిన వారు. సంఘటన స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి తదితరులు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేగ్ కుటుంబంలో విషాదం బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా మృతి చెందింది. ఇద్దరు కుమార్తెలకు గాను చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు ఒక పెద్ద కుమార్తె మాత్రమే మిగిలింది. బేగ్ భార్య మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె హైదరాబాద్‌కు రానుంది. కాగా ఆరు నెలల క్రితమే అస్మాతో బాసిత్ వివాహం జరిగింది. ప్రస్తుతం అస్మా గర్భణి కూడా. తన తండ్రే మళ్లీ పుడతాడని స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్న బాసిత్ అంతలోనే చెరువులో పడి మృతి చెందడం తలచుకొని బంధువులు, స్నేహితులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక మోనా సుల్తానాకు సల్మాన్‌తో నాలుగైదు నెలల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లులో ఈతకు వెళ్లి చెరువులో మునిగి ఏడుగురు వ్యక్తులు మరణించిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం బాధాకరమని, వేసవి సెలవులలో పిల్లల విహారాలు, సరదాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కె.చంద్రశేఖర్ రావు సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.