కష్టమంతా వరదపాలు | house submerged in flood water: Andhra pradesh | Sakshi
Sakshi News home page

కష్టమంతా వరదపాలు

Published Wed, Sep 4 2024 5:00 AM | Last Updated on Wed, Sep 4 2024 5:00 AM

house submerged in flood water: Andhra pradesh

ఎన్నో ఏళ్లుగా రూపాయి రూపాయి పోగేసి కొన్న వస్తువులు

వరద నీటిలో మునగడంతో ఇంట్లో ఒక్కటీ పనికొచ్చేలా లేదు

పాడైపోయిన మంచాలు, టీవీలు, ఫ్రిజ్‌ లు, మిక్సీలు, గ్రైండర్లు 

తడిసి, కొట్టుకుపోయిన విలువైన ఆస్తి, విద్య ధ్రువపత్రాలు

ప్రతి ఇంటికీ రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నష్టం

మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలంటూ బాధితుల గగ్గోలు

ఈ చిత్రంలోని సంతోష్, దుర్గ దంపతులు విజయవాడ వన్‌టౌన్‌ సాయిరాం థియేటర్‌ వెనుక రాజీవ్‌శర్మ వీధిలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి డాబాపైకి వెళ్లిపోయారు. రూ.20 వేల విలువైన వాషింగ్‌ మెషిన్, రూ.22 వేల ఫ్రిడ్జ్, రూ.50 వేల విలువైన డబుల్‌ కాట్, రూ.15 వేల దివాన్, రూ.10 వేల మిక్సీ గ్రైండర్‌ నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.

వీటి విలువే రూ.1.17 లక్షలు. ఇవి పనిచేసే పరిస్థితి లేదు. నాలుగు బియ్యం బస్తాలు, వంట సామగ్రి, సరుకులు ఏవీ మిగల్లేదు. భవన నిర్మాణంలో టైల్స్‌ అమర్చే పని చేసే సంతోష్‌ వాయిదా పద్ధతిలో 2016 నుంచి ఒక్కొక్కటిగా కొనుక్కొంటున్నారు. ఎనిమిదేళ్ల కష్టం ఒక్క రోజులో నీటిపాలైంది. మళ్లీ ఇన్ని వస్తువులు సమకూర్చుకోవడం ఇప్పట్లో తమ వల్ల అయ్యే పని కాదని సంతోష్, దుర్గ బోరున విలపిస్తున్నారు.

(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): వరదల కారణంగా బెజవాడ, పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు ఇలా వేలు, లక్షల్లో నష్టపోయాయి. జీవిత కాలం కష్టమంతా వరద నీటి పాలైపోయింది. గృహావసరాలకు ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, మంచం, ఫ్యాను, గ్రైండర్‌ వంటికి కొనుక్కో­వడానికి కూడా పేద, మధ్య తరగతి ప్రజలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రూపాయి రూపాయి పోగేసి, చిట్టీలు కట్టి, ఈఎంఐలతో కొంటుంటారు. ఇప్పుడు వరదలో అన్నీ పాడైపో­యాయి. ఇవే కాదు.. పిల్లల విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆస్తి దస్తావేజులు, పాఠశాలల ఫీజు రసీదులు, కష్ట­పడి సంపాదించుకున్న నగదు, శుభ­కా­ర్యాల కోసం, రోజువారీ అవసరాల కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బు బీరువాల్లో తడిసిముద్ద­య్యాయి. కొన్ని వరదలో కొట్టుకొనిపోయాయి. ప్రతి ఇంటికీ రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ జీరో నుంచి జీవితం మొదలు­పెట్టాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాకు మిగిలిందేమీ లేదు..
ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. సామగ్రి మొత్తం మునిగిపోయింది. పాములు కూడా ఇళ్లలోకి చేరాయి. జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్నవన్నీ వరద పాలయ్యాయి. మాకు మిగిలిందేమీ లేదు.    – సాయికుమారి, రాజరాజేశ్వరిపేట

విలువైన పత్రాలేవీ మిగల్లేదు
పిల్లల సర్టిఫికెట్లు, ఇంటి పట్టాలు, గుర్తింపు కార్డులన్నీ నీటిలో నానిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ పోయి దుర్బర స్థితిలోకి వచ్చేశాం. మా స్కూటీ కూడా కొట్టుకెళ్లిపోయింది. పూలు అమ్ముకునే నాలాంటోళ్లు ఎన్నేళ్లు కష్టపడితే ఇంటి సామగ్రిని సమకూర్చుకోగలం? – గోపమ్మ, రాజరాజేశ్వరి పేట

మళ్లీ వస్తువులు కొనుక్కోవడం మా వల్ల కాదు
ఇంట్లో ప్రతి వస్తువూ వాయిదాల్లో కొన్నవే. రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కొన్నాం. వాటి కోసం ఇతర ఖర్చులూ తగ్గించేసుకున్నాం. ఒక్కో వస్తువు రూ.20వేలుపైనే ఉంటుంది. అవన్నీ మళ్లీ కొనుక్కోవాలంటే మావల్ల కాదు.      – జగన్నాథం దుర్గ, బాధితురాలు, రాజరాజేశ్వరిపేట

డ్రోన్లతో ఆహారం ఎవరికిస్తున్నారో..?
నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సింగ్‌నగర్‌ పైపులరోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ఆదివారం ఉదయం మా ఇంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు మొదటి అంతస్తుకు చేరాం. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. వారు ఆకలి అని ఏడుస్తుంటే ఆదివారం సాయంత్రం అటుగా వెళ్తున్న బోటు అడిగితే రూ.4 వేలు ఇవ్వమన్నారు. అంత ఇవ్వలేక అక్కడే ఉండిపోయాం. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. ఆహారం, నీరు కూడా అందించలేదు. మా బిల్డింగ్‌పై ఉన్న వాటర్‌ ట్యాంకులో నీళ్లు తాగి బతికాం. ఆ ట్యాంకులో కూడా నీళ్లు ఖాళీ కావడంతో పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరాం. డ్రోన్‌లు, హెలికాప్టర్లలో ఆహారం ఎవరికి ఇస్తున్నాయో తెలియడం లేదు. – బూర అనీల్, పైపులరోడ్డు, అజిత్‌సింగ్‌నగర్‌

మానవ తప్పిదమే..
ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇది ప్రకృతి వైపరీత్యం అని సరిపెట్టుకునేందుకు వీల్లేదు. ఇది కచ్చితంగా మానవ తప్పిదంగానే భావిస్తున్నాను. ప్రాణ భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి ఒకటి, రెండు అంతస్తుల్లోకి వెళ్లిపోయాం. ఎవరు ఎక్కడికి వెళ్లిపోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి. అప్పటికే గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి నీళ్లు వచ్చేసి అన్నీ మునిగిపోయాయి. ప్రాణ భయం అంటే ఏమిటో తెలిసింది.     – నక్కా ప్రభుదాస్, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement