
విజయవాడలో సిటీ బస్సు ఎక్కి నిరసన
బస్టాండ్ (విజయవాడ పశ్చిమ): మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకపోవడం శోచనీయమని ఏపీ మహిళా సమాఖ్య సభ్యులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలు గుప్పించి.. గెలిచాక విస్మరించారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని సిటీ బస్సుల ప్రాంగణం వద్ద నిరసన తెలిపారు. సిటీ బస్సు ఎక్కి నినాదాలు చేశారు.
సమాఖ్య విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పంచదారుల దుర్గమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలపై టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. మహిళల ఓట్లతో అధికారం చేపట్టి.. ఏడాదైనా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్నా, కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నిత్యావసర వస్తువులు, కరెంట్ చార్జీలు, గ్యాస్ ధరలు మండుతున్న నేపథ్యంలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఊరటగా ఉంటుందన్నారు. హామీ అమలు చేయకుంటే పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.