submerged in rain water
-
కష్టమంతా వరదపాలు
ఈ చిత్రంలోని సంతోష్, దుర్గ దంపతులు విజయవాడ వన్‌టౌన్ సాయిరాం థియేటర్ వెనుక రాజీవ్‌శర్మ వీధిలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి డాబాపైకి వెళ్లిపోయారు. రూ.20 వేల విలువైన వాషింగ్ మెషిన్, రూ.22 వేల ఫ్రిడ్జ్, రూ.50 వేల విలువైన డబుల్ కాట్, రూ.15 వేల దివాన్, రూ.10 వేల మిక్సీ గ్రైండర్ నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.వీటి విలువే రూ.1.17 లక్షలు. ఇవి పనిచేసే పరిస్థితి లేదు. నాలుగు బియ్యం బస్తాలు, వంట సామగ్రి, సరుకులు ఏవీ మిగల్లేదు. భవన నిర్మాణంలో టైల్స్ అమర్చే పని చేసే సంతోష్ వాయిదా పద్ధతిలో 2016 నుంచి ఒక్కొక్కటిగా కొనుక్కొంటున్నారు. ఎనిమిదేళ్ల కష్టం ఒక్క రోజులో నీటిపాలైంది. మళ్లీ ఇన్ని వస్తువులు సమకూర్చుకోవడం ఇప్పట్లో తమ వల్ల అయ్యే పని కాదని సంతోష్, దుర్గ బోరున విలపిస్తున్నారు.(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): వరదల కారణంగా బెజవాడ, పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు ఇలా వేలు, లక్షల్లో నష్టపోయాయి. జీవిత కాలం కష్టమంతా వరద నీటి పాలైపోయింది. గృహావసరాలకు ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, మంచం, ఫ్యాను, గ్రైండర్ వంటికి కొనుక్కోవడానికి కూడా పేద, మధ్య తరగతి ప్రజలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రూపాయి రూపాయి పోగేసి, చిట్టీలు కట్టి, ఈఎంఐలతో కొంటుంటారు. ఇప్పుడు వరదలో అన్నీ పాడైపోయాయి. ఇవే కాదు.. పిల్లల విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆస్తి దస్తావేజులు, పాఠశాలల ఫీజు రసీదులు, కష్టపడి సంపాదించుకున్న నగదు, శుభకార్యాల కోసం, రోజువారీ అవసరాల కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బు బీరువాల్లో తడిసిముద్దయ్యాయి. కొన్ని వరదలో కొట్టుకొనిపోయాయి. ప్రతి ఇంటికీ రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ జీరో నుంచి జీవితం మొదలుపెట్టాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాకు మిగిలిందేమీ లేదు..ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. సామగ్రి మొత్తం మునిగిపోయింది. పాములు కూడా ఇళ్లలోకి చేరాయి. జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్నవన్నీ వరద పాలయ్యాయి. మాకు మిగిలిందేమీ లేదు. – సాయికుమారి, రాజరాజేశ్వరిపేటవిలువైన పత్రాలేవీ మిగల్లేదుపిల్లల సర్టిఫికెట్లు, ఇంటి పట్టాలు, గుర్తింపు కార్డులన్నీ నీటిలో నానిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ పోయి దుర్బర స్థితిలోకి వచ్చేశాం. మా స్కూటీ కూడా కొట్టుకెళ్లిపోయింది. పూలు అమ్ముకునే నాలాంటోళ్లు ఎన్నేళ్లు కష్టపడితే ఇంటి సామగ్రిని సమకూర్చుకోగలం? – గోపమ్మ, రాజరాజేశ్వరి పేటమళ్లీ వస్తువులు కొనుక్కోవడం మా వల్ల కాదుఇంట్లో ప్రతి వస్తువూ వాయిదాల్లో కొన్నవే. రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కొన్నాం. వాటి కోసం ఇతర ఖర్చులూ తగ్గించేసుకున్నాం. ఒక్కో వస్తువు రూ.20వేలుపైనే ఉంటుంది. అవన్నీ మళ్లీ కొనుక్కోవాలంటే మావల్ల కాదు. – జగన్నాథం దుర్గ, బాధితురాలు, రాజరాజేశ్వరిపేటడ్రోన్లతో ఆహారం ఎవరికిస్తున్నారో..?నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సింగ్‌నగర్ పైపులరోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ఆదివారం ఉదయం మా ఇంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు మొదటి అంతస్తుకు చేరాం. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. వారు ఆకలి అని ఏడుస్తుంటే ఆదివారం సాయంత్రం అటుగా వెళ్తున్న బోటు అడిగితే రూ.4 వేలు ఇవ్వమన్నారు. అంత ఇవ్వలేక అక్కడే ఉండిపోయాం. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. ఆహారం, నీరు కూడా అందించలేదు. మా బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంకులో నీళ్లు తాగి బతికాం. ఆ ట్యాంకులో కూడా నీళ్లు ఖాళీ కావడంతో పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరాం. డ్రోన్లు, హెలికాప్టర్లలో ఆహారం ఎవరికి ఇస్తున్నాయో తెలియడం లేదు. – బూర అనీల్, పైపులరోడ్డు, అజిత్సింగ్నగర్మానవ తప్పిదమే..ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇది ప్రకృతి వైపరీత్యం అని సరిపెట్టుకునేందుకు వీల్లేదు. ఇది కచ్చితంగా మానవ తప్పిదంగానే భావిస్తున్నాను. ప్రాణ భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒకటి, రెండు అంతస్తుల్లోకి వెళ్లిపోయాం. ఎవరు ఎక్కడికి వెళ్లిపోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి. అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీళ్లు వచ్చేసి అన్నీ మునిగిపోయాయి. ప్రాణ భయం అంటే ఏమిటో తెలిసింది. – నక్కా ప్రభుదాస్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
వైరల్ వీడియో: వరద నీటిలో ముగినిపోయిన వందలాది కార్లు
-
షాకింగ్ వీడియో.. వరద నీటిలో ముగినిపోయిన వందలాది కార్లు
దేశ వ్యాప్తంగా వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు. కుండపోత వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. రహదారులు, కాలనీలు ఇలా ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ముందుకు కదలడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతోసహా ఉత్తర భారత దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. యమునా ఉప నది అయిన హిండన్ నది నీటిమట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడా మునిపోయింది. ఓ బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన దాదాపు 200కు పైగా కార్లు నీట మునిగాయి. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వరస క్రమంలో పార్క్ చేసిన తెలుపు రంగు కార్ల పైకప్పుల వరకు వరద నీరు కప్పేసి ఉండటం కనిపిస్తోంది. హిండన్‌లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారిని తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) మించి ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయిలో ఉంది. -
ఎటుచూసినా నీరే!
సాక్షి, చెన్నై: తుపాను ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షానికి చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. నగరం శివార్లలో గురువారం ఎటుచూసినా నీరే కనిపించింది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. జనం ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటున్నారు. చెన్నై నగరం, శివారు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో అన్ని సబ్‌వేలు నీట మునగడంతో వాటిని మూసివేశారు. ఉత్తర చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాలు, టీ నగర్, నుంగంబాక్కం, కొళత్తూరు, పెరంబూరు, పులియాంతోపు, పురసైవాక్కం పరిసరాలు, శివారులోని ఆవడి, పట్టాబిరాం, తాంబరం, వేళచ్చేరి, ముడిచ్చూర్ పరిసరాల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో జనం ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతవాసులు ఇళ్లను ఖాళీచేశారు. చెన్నైలోని సెంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదల చేస్తుండడంతో ఆ తీరం వెంబడి వరద ఉధృతి పెరిగింది. చొచ్చుకొచ్చిన సముద్రం మహాబలిపురం నుంచి పట్టినంబాక్కం – ఎన్నూర్ వరకు అలల తాకిడి ఎక్కువగా ఉంది. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. పుదుచ్చేరిలో సముద్రం ముందుకు రావడంతో 50 ఇళ్లు దెబ్బతిన్నాయి. మహాబలిపురం మార్గాన్ని అధికారులు మూసివేశారు. మైలాపూర్‌లో ఓ వృద్ధుడు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. నీటి ఉధృతి, అలల తాకిడితో మనలి–తిరువొత్తియూరు హైరోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. టేకాఫ్‌కు మాత్రమే అనుమతి చెన్నై విమానాశ్రయం రన్‌వే మీద నీటి ఉధృతి పెరిగింది. విమానాల టేకాఫ్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. చెన్నైలోని తాంబరం, చోళవరం పరిసరాల్లో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గిండీ చిల్డ్రన్స్‌ను పార్కును వరద ముంచెత్తడంతో అక్కడున్న 50 రకాల వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం ఉదయమే సచివాలయం చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
అదే వర్షం.. అవే కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: మాటలకు అందని వేదన.. ఊహకు అందని నష్టం..! ఎటు చూసినా క‘న్నీరే’.. ఎవరిని కదిపినా వరదలా పొంగుకొచ్చే దుఃఖమే.. ఓవైపు వర్షాలకు కూలిన వేల ఇళ్లు.. మరోవైపు లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు.. కనీవినీ ఎరుగని వర్షాలతో వారం రోజుల నుంచి రాష్ట్రం అల్లాడుతుతోం ది. ముఖ్యంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాం ధ్ర జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి.మొన్నటి పై-లీన్ దెబ్బనుంచి ఇంకా కోలుకోని శ్రీకాకుళం జిల్లాలపై వరుణుడు మళ్లీ విరుచుకుపడ్డాడు. ఆదివారం ఆరు గంటల పాటు కుండపోత వర్షం కురిపించాడు. దీంతో శ్రీకాకుళం నడుములోతు నీటిలో మునిగిపోయింది. పట్టణంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 60 కాలనీల్లో సుమారు 50 వేలమంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. పెట్రోల్ బంకులు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం ముంపు బారిన పడ్డాయి. మిగతా జిల్లాల్లో కూడా పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. ఎక్కడికక్కడ దారులు తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది. ఆస్తి నష్టం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక సమాచారం ప్రకారమే ఆదివారం నాటికి 21,760 ఇళ్లు కూలిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వాస్తవానికి కూలిన ఇళ్ల సంఖ్య 50 వేలపైనే ఉంటుందని అనధికారిక అంచనా. నిత్యావసర వస్తువుల కోసం ముంపు గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 42 మంది వర్షాలవల్ల మృత్యువాత పడ్డారు. పంట నష్టం అయితే ఊహకందడం లేదు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారమే 20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. క్షేత్రస్థాయిలో ఇది 30లక్షల ఎకరాలపైనే ఉంటుందని తెలుస్తోంది. భారీ వర్షాలు, వరదల వల్ల చాలా గ్రామాలకు నేటికీ అధికారులు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో పూర్తిస్థాయి ఆస్తి, పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి అందలేదు. 4,172 గ్రామాల్లో వరద నష్టాలు వర్షాలకు 16 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాల్లో 521 మండలాల పరిధిలోని 4,172 గ్రామాల్లో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, కంది, వేరుశెనగ గత నాలుగైదు రోజులుగా నీటిలో మునిగి కుళ్లిపోతున్నాయి. చాలాచోట్ల వేరుశెనగ, మొక్కజొన్న, వరి పొలాల్లోనే మొలకెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,760 ఇళ్లు కూలిపోగా.. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 5,494 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 3,054, గుంటూరు జిల్లాలో 2,397, వరంగల్ జిల్లాలో 1,826, మెదక్ జిల్లాలో 1,739 ఇళ్లు కూలిపోయాయి. 1,020 చెరువులకు గండ్లు పడ్డాయి. రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన 4,047 కిలోమీటర్ల పొడవునా రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ శాఖకు చెందిన 1,060 కి.మీ. రహదారులు కొట్టుకుపోయాయి. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. వాస్తవంగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ముగిసి, వరదలు తగ్గిన తర్వాత బృందాలు పర్యటించి అంచనా వేస్తేగానీ వాస్తవ నష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. నష్టం కొండంత.. లెక్కలు గోరంత.. భారీ వర్షాలు, వరదలతో వేల కోట్ల నష్టం వాటిల్లినా ప్రభుత్వ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో రూ.1,868 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆదివారం మధ్యాహ్నానికి ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. గుంటూరు జిల్లాలో రూ.712 కోట్లు, ప్రకాశంలో రూ.596 కోట్లు, వరంగల్‌లో రూ.411 కోట్లు, నల్లగొండలో రూ.250 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.142 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.37 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.20 కోట్లు నష్టం జరిగినట్లు జిల్లాల నుంచి సమాచారం అందింది. అయితే వర్ష ప్రభావిత జిల్లాలు 16 కాగా కేవలం ఏడు జిల్లాల నుంచే స్వల్ప సమాచారం వచ్చింది. మిగిలిన జిల్లాల నుంచి నష్టం వివరాలు రాలేదు. పొంచి ఉన్న వ్యాధుల ముప్పు భారీ వర్షాలవల్ల నీరు కలుషితమైంది. పారిశుధ్యం దెబ్బతినడం, మురుగు నీరు నిల్వ ఉండటంవల్ల అతిసారం, జ్వరాలు, టైఫాయిడ్ ప్రబలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. నాలుగైదు జిల్లాలపై కాకుండా వర్షాల ప్రభావం 16 జిల్లాల్లో అత్యధిక గ్రామాల్లో ఉన్నందున వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వస్తే తక్షణమే నియంత్రించడం కష్టమని అధికారులు అంటున్నారు. యలమంచిలిలో రికార్డు స్థాయి వర్షం.. గడచిన 24 గంటల్లో విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో రికార్డు స్థాయిలో 32 సెం.మీ.ల వర్షం కురిసింది. రణస్థలంలో 22, అనకాపల్లిలో 20, శృంగవరపు కోట, చింతపల్లిల్లో 15 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎస్‌కోట, చింతపల్లిలో 15, పాడేరులో 10, నూజువీడు, చీపురుపల్లి, తాడేపల్లిగూడెం, విజయనగరం, వెంకటాపురం, హుజూరాబాద్‌లో 9, నర్సీపట్నంలో 8, భీమడోలు, కాకినాడ, ప్రత్తిపాడు, కళింగపట్నం, విశాఖ, తుని, కూనవరం, ఏటూరునాగారంలలో 7 సెం.మీ వర్షం కురిసింది. పునరావాస కేంద్రంలో కరెంట్ షాక్.. యువకుడి మృతి కృష్ణా జిల్లా పటమటలంకలోని మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆదివారం విద్యుత్ షాక్‌కు గురై రాము(20) అనే వ్యక్తి మరణించాడు. తన స్నేహితుడు ఏలియ్యతో కలిసి భవనంపై కొబ్బరి మట్టలతో సరదాగా ఆడుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొబ్బరి మట్టలను పైకి విసరడంతో అవి పైనున్న హైటెన్షన్ వైర్లకు తగిలాయి. దీంతో మంటలు రేగి, ఇద్దరూ షాక్‌కు గురై మంటల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ రాము మరణించాడు. ఏలియ్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వర్షాలకు 18 మంది బలి వర్షాలు, పిడుగుపాటుకు గురై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మరణించారు. పిడుగులు పడి కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఒకరు, తూర్పుగోదావరి ఇద్దరు మృతి చెందారు. వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సిక్కోలులో ఆకాశానికి చిల్లు శ్రీకాకుళం పట్టణం అతలాకుతలమైంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో పట్టణం నీటమునిగింది. వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణం పరిసర ప్రాంతాల్లోనే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం కురిసిన 21 సెం.మీ, వర్షానికి ఆదివారం కురిసిన వాన తోడు కావడంతో పట్టణంలో ఎక్కడ చూసినా నడుము లోతు నీళ్లు కనిపించాయి. పట్టణంలో బలగ ప్రాం తం, డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు, పెద్దపాడు వైపు ఉన్న కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని 60 కాలనీల్లో సుమారు 50 వేల మంది ప్రజలు నీటిలోనే ఉన్నారు. మొత్తమ్మీద 10 వేల ఇళ్లు జలదిగ్బంధంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాలనీల్లోని అంగన్వాడీ సెంటర్లు మునగడంతో పౌష్టికాహారం నీటిపాలైంది. ఇళ్లలోని విలువైన సామాన్లు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంతోపాటు జిల్లాలో పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సమీపంలోని చెరువులకు గండి పడడంతో పొందూరు మేజర్ పంచాయతీ వరద ముట్టడితో విలవిల్లాడింది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బుడూరును నారాయణసాగరం చెరువు ముంచెత్తింది. గ్రామంలో సుమారు 400 మంది చిక్కుకుపోగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని కాపాడాయి. వంశధార కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగావళి వరద నాగావళి వరద కారణంగా 12 మండలాల్లోని 107 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. వంశధార నదిలో ఆదివారం సాయంత్రానికి 49 వేల క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. ఒడిశా నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రవాహం 80 వేల క్యూసెక్కులు దాటితే పంట పొలాలన్నీ ముంపు బారిన పడే ప్రమాదం ఉంది.