దేశ వ్యాప్తంగా వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు. కుండపోత వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. రహదారులు, కాలనీలు ఇలా ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ముందుకు కదలడం లేదు.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీతోసహా ఉత్తర భారత దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. యమునా ఉప నది అయిన హిండన్ నది నీటిమట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడా మునిపోయింది. ఓ బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన దాదాపు 200కు పైగా కార్లు నీట మునిగాయి. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వరస క్రమంలో పార్క్ చేసిన తెలుపు రంగు కార్ల పైకప్పుల వరకు వరద నీరు కప్పేసి ఉండటం కనిపిస్తోంది.
హిండన్‌లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారిని తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) మించి ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment