అదే వర్షం.. అవే కన్నీళ్లు | Andhra Pradesh hit by heavy rains | Sakshi
Sakshi News home page

అదే వర్షం.. అవే కన్నీళ్లు

Published Mon, Oct 28 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

Andhra Pradesh hit by heavy rains

సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: మాటలకు అందని వేదన.. ఊహకు అందని నష్టం..! ఎటు చూసినా క‘న్నీరే’.. ఎవరిని కదిపినా వరదలా పొంగుకొచ్చే దుఃఖమే.. ఓవైపు వర్షాలకు కూలిన వేల ఇళ్లు.. మరోవైపు లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు.. కనీవినీ ఎరుగని వర్షాలతో వారం రోజుల నుంచి రాష్ట్రం అల్లాడుతుతోం ది. ముఖ్యంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాం ధ్ర జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి.మొన్నటి పై-లీన్ దెబ్బనుంచి ఇంకా కోలుకోని శ్రీకాకుళం జిల్లాలపై వరుణుడు మళ్లీ విరుచుకుపడ్డాడు. ఆదివారం ఆరు గంటల పాటు కుండపోత వర్షం కురిపించాడు. దీంతో శ్రీకాకుళం నడుములోతు నీటిలో మునిగిపోయింది. పట్టణంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 60 కాలనీల్లో సుమారు 50 వేలమంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. పెట్రోల్ బంకులు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం ముంపు బారిన పడ్డాయి. మిగతా జిల్లాల్లో కూడా పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. ఎక్కడికక్కడ దారులు తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది.
 
 

ఆస్తి నష్టం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక సమాచారం ప్రకారమే ఆదివారం నాటికి 21,760 ఇళ్లు కూలిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వాస్తవానికి కూలిన ఇళ్ల సంఖ్య 50 వేలపైనే ఉంటుందని అనధికారిక అంచనా. నిత్యావసర వస్తువుల కోసం ముంపు గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 42 మంది వర్షాలవల్ల మృత్యువాత పడ్డారు. పంట నష్టం అయితే ఊహకందడం లేదు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారమే 20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. క్షేత్రస్థాయిలో ఇది 30లక్షల ఎకరాలపైనే ఉంటుందని తెలుస్తోంది. భారీ వర్షాలు, వరదల వల్ల చాలా గ్రామాలకు నేటికీ అధికారులు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో పూర్తిస్థాయి ఆస్తి, పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి అందలేదు.
 
 4,172 గ్రామాల్లో వరద నష్టాలు
 
 వర్షాలకు 16 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాల్లో 521 మండలాల పరిధిలోని 4,172 గ్రామాల్లో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, కంది, వేరుశెనగ గత నాలుగైదు రోజులుగా నీటిలో మునిగి కుళ్లిపోతున్నాయి. చాలాచోట్ల వేరుశెనగ, మొక్కజొన్న, వరి పొలాల్లోనే మొలకెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,760 ఇళ్లు కూలిపోగా.. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 5,494 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 3,054, గుంటూరు జిల్లాలో 2,397, వరంగల్ జిల్లాలో 1,826, మెదక్ జిల్లాలో 1,739 ఇళ్లు కూలిపోయాయి. 1,020 చెరువులకు గండ్లు పడ్డాయి. రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన 4,047 కిలోమీటర్ల పొడవునా రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ శాఖకు చెందిన 1,060 కి.మీ.  రహదారులు కొట్టుకుపోయాయి. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. వాస్తవంగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ముగిసి, వరదలు తగ్గిన తర్వాత బృందాలు పర్యటించి అంచనా వేస్తేగానీ వాస్తవ నష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పలేమని అధికారులు చెబుతున్నారు.
 
 నష్టం కొండంత.. లెక్కలు గోరంత..
 
 భారీ వర్షాలు, వరదలతో వేల కోట్ల నష్టం వాటిల్లినా ప్రభుత్వ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో రూ.1,868 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆదివారం మధ్యాహ్నానికి ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. గుంటూరు జిల్లాలో రూ.712 కోట్లు, ప్రకాశంలో రూ.596 కోట్లు, వరంగల్‌లో రూ.411 కోట్లు, నల్లగొండలో రూ.250 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.142 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.37 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.20 కోట్లు నష్టం జరిగినట్లు జిల్లాల నుంచి సమాచారం అందింది. అయితే వర్ష ప్రభావిత జిల్లాలు 16 కాగా కేవలం ఏడు జిల్లాల నుంచే స్వల్ప సమాచారం వచ్చింది. మిగిలిన జిల్లాల నుంచి నష్టం వివరాలు రాలేదు.
 
 పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
 
 భారీ వర్షాలవల్ల నీరు కలుషితమైంది. పారిశుధ్యం దెబ్బతినడం, మురుగు నీరు నిల్వ ఉండటంవల్ల అతిసారం, జ్వరాలు, టైఫాయిడ్ ప్రబలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. నాలుగైదు జిల్లాలపై కాకుండా వర్షాల ప్రభావం 16 జిల్లాల్లో అత్యధిక గ్రామాల్లో ఉన్నందున వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వస్తే తక్షణమే నియంత్రించడం కష్టమని అధికారులు అంటున్నారు.
 
 యలమంచిలిలో రికార్డు స్థాయి వర్షం..
 
 గడచిన 24 గంటల్లో విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో రికార్డు స్థాయిలో 32 సెం.మీ.ల వర్షం కురిసింది. రణస్థలంలో 22, అనకాపల్లిలో 20, శృంగవరపు కోట, చింతపల్లిల్లో 15 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఎస్‌కోట, చింతపల్లిలో 15, పాడేరులో 10, నూజువీడు, చీపురుపల్లి, తాడేపల్లిగూడెం, విజయనగరం, వెంకటాపురం, హుజూరాబాద్‌లో 9, నర్సీపట్నంలో 8, భీమడోలు, కాకినాడ, ప్రత్తిపాడు, కళింగపట్నం, విశాఖ, తుని, కూనవరం, ఏటూరునాగారంలలో 7 సెం.మీ వర్షం కురిసింది.
 
 పునరావాస కేంద్రంలో కరెంట్ షాక్.. యువకుడి మృతి
 
 కృష్ణా జిల్లా పటమటలంకలోని మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆదివారం విద్యుత్ షాక్‌కు గురై రాము(20) అనే వ్యక్తి మరణించాడు. తన స్నేహితుడు ఏలియ్యతో కలిసి భవనంపై కొబ్బరి మట్టలతో సరదాగా ఆడుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొబ్బరి మట్టలను పైకి విసరడంతో అవి పైనున్న హైటెన్షన్ వైర్లకు తగిలాయి. దీంతో మంటలు రేగి, ఇద్దరూ షాక్‌కు గురై మంటల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ రాము మరణించాడు. ఏలియ్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
 
 వర్షాలకు 18 మంది బలి
 
 వర్షాలు, పిడుగుపాటుకు గురై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మరణించారు. పిడుగులు పడి కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఒకరు, తూర్పుగోదావరి ఇద్దరు మృతి చెందారు. వర్షాలతో  శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
 
 సిక్కోలులో ఆకాశానికి చిల్లు
 
 శ్రీకాకుళం పట్టణం అతలాకుతలమైంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో పట్టణం నీటమునిగింది. వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణం పరిసర ప్రాంతాల్లోనే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం కురిసిన 21 సెం.మీ, వర్షానికి ఆదివారం కురిసిన వాన తోడు కావడంతో పట్టణంలో ఎక్కడ చూసినా నడుము లోతు నీళ్లు కనిపించాయి. పట్టణంలో బలగ ప్రాం తం, డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు, పెద్దపాడు వైపు ఉన్న కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని 60 కాలనీల్లో సుమారు 50 వేల మంది ప్రజలు నీటిలోనే ఉన్నారు. మొత్తమ్మీద 10 వేల ఇళ్లు జలదిగ్బంధంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాలనీల్లోని అంగన్‌వాడీ సెంటర్లు మునగడంతో పౌష్టికాహారం నీటిపాలైంది. ఇళ్లలోని విలువైన సామాన్లు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంతోపాటు జిల్లాలో పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సమీపంలోని చెరువులకు గండి పడడంతో పొందూరు మేజర్ పంచాయతీ వరద ముట్టడితో విలవిల్లాడింది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బుడూరును నారాయణసాగరం చెరువు ముంచెత్తింది.
 
 

గ్రామంలో సుమారు 400 మంది చిక్కుకుపోగా.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వారిని కాపాడాయి.  వంశధార కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగావళి వరద నాగావళి వరద కారణంగా 12 మండలాల్లోని 107 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. వంశధార నదిలో ఆదివారం సాయంత్రానికి 49 వేల క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. ఒడిశా నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రవాహం 80 వేల క్యూసెక్కులు దాటితే పంట పొలాలన్నీ ముంపు బారిన పడే ప్రమాదం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement