చెన్నైలో నడుము లోతు నీళ్లలో వెళ్తున్న స్థానికులు
సాక్షి, చెన్నై: తుపాను ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షానికి చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. నగరం శివార్లలో గురువారం ఎటుచూసినా నీరే కనిపించింది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. జనం ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటున్నారు. చెన్నై నగరం, శివారు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో అన్ని సబ్‌వేలు నీట మునగడంతో వాటిని మూసివేశారు.
ఉత్తర చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాలు, టీ నగర్, నుంగంబాక్కం, కొళత్తూరు, పెరంబూరు, పులియాంతోపు, పురసైవాక్కం పరిసరాలు, శివారులోని ఆవడి, పట్టాబిరాం, తాంబరం, వేళచ్చేరి, ముడిచ్చూర్ పరిసరాల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో జనం ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతవాసులు ఇళ్లను ఖాళీచేశారు. చెన్నైలోని సెంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదల చేస్తుండడంతో ఆ తీరం వెంబడి వరద ఉధృతి పెరిగింది.
చొచ్చుకొచ్చిన సముద్రం
మహాబలిపురం నుంచి పట్టినంబాక్కం – ఎన్నూర్ వరకు అలల తాకిడి ఎక్కువగా ఉంది. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. పుదుచ్చేరిలో సముద్రం ముందుకు రావడంతో 50 ఇళ్లు దెబ్బతిన్నాయి. మహాబలిపురం మార్గాన్ని అధికారులు మూసివేశారు. మైలాపూర్‌లో ఓ వృద్ధుడు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. నీటి ఉధృతి, అలల తాకిడితో మనలి–తిరువొత్తియూరు హైరోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి.
టేకాఫ్‌కు మాత్రమే అనుమతి
చెన్నై విమానాశ్రయం రన్‌వే మీద నీటి ఉధృతి పెరిగింది. విమానాల టేకాఫ్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. చెన్నైలోని తాంబరం, చోళవరం పరిసరాల్లో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గిండీ చిల్డ్రన్స్‌ను పార్కును వరద ముంచెత్తడంతో అక్కడున్న 50 రకాల వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం ఉదయమే సచివాలయం చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment