
రాజస్తాన్ దౌసాలో నీటిలో మునిగిపోయిన బస్, దానిపై నిల్చున్న విద్యార్ధులు
జైపూర్ : 50 మంది విద్యార్ధులతో ప్రయాణిస్తున్న ఓ స్కూల్ బస్సు నీటిలో సగం మునిగిపోయింది. అయితే బస్సులోని పిల్లలందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని దౌసాలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. దౌసా ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడ ఉన్న అండర్ పాస్‌లో నీళ్లు చేరాయి. అయితే, డ్రైవర్ ఈ విషయాన్ని గమనించపోవడంతో బస్సును ఆ అండర్ పాస్‌లోకి తీసుకెళ్లాడు. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
అయితే బస్సు అంతకంతకు నీళ్లలో మునుగుతోన్న సమయంలో దానిలోని విద్యార్థులంతా సమయస్ఫూర్తితో వ్యవహరించి కిటికీల్లోంచి బస్సు పైకి ఎక్కడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సు నీళ్లలో మునగడం గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని విద్యార్ధులను కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా విద్యార్ధులను బయటకు తీసుకొచ్చేందుకు ముందుగా ఓ గోడపై నుంచి తాడును వదిలారు. కానీ ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో.. ఈతగాళ్లు ఆ నీళ్లలోకి దూకి వారిని బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ ఫోన్‌లలో బంధించి, ఇంటర్‌నెట్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment