జలసమాధి
చెరువులో మునిగి ఏడుగురు మృతి
మృతుల్లో నలుగురు యువతులు.. వీరంతా హైదరాబాద్‌వాసులు
చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు
మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలో ఘటన
ఆమనగల్లు: సరదా వారి పాలిట శాపంగా మారింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని చెరువులోకి దిగిన ఏడుగురు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈతరాక పోవడంతో వారు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన వారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు.. ముగ్గురు యువకులు ఉన్నారు.
ఈ విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట సమీపంలోని అల్‌జుబేల్ కాలనీలో అహ్మద్‌బేగ్ కుటుంబానికి చెందిన 13 మంది టవేరా వాహనంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో తమ సమీప బంధువుల ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో స్నానాల కోసం వీరంతా దగ్గరలో ఉన్న చరికొండ గౌరమ్మ చెరువుకు చేరుకున్నారు.
ముందుగా ముస్కాన్ (18) చెరువులోకి దిగింది. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ఆమె మునిగి పోయింది. దీంతో పక్కనే ఉన్న సల్మాన్ (30), రెహమాన్ (19), షేక్ బాసిత్(30), రొఖియా బేగం(28), మస్రత్ ఫాతిమా(19), మౌనాబేగం(18) కూడా చెరువులోకి దిగి ముస్కాన్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే పట్టు దొరకక వారు కూడా చెరువులో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే వారంతా ప్రాణాలు వదిలారు. మృతుల్లో సల్మాన్, రెహమాన్, మౌనబేగం, రుకియా బేగం, బాసిత్‌లు ఒకే కుటుంబానికి చెందిన వారు. సంఘటన స్థలాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి తదితరులు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బేగ్ కుటుంబంలో విషాదం
బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా మృతి చెందింది. ఇద్దరు కుమార్తెలకు గాను చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు ఒక పెద్ద కుమార్తె మాత్రమే మిగిలింది. బేగ్ భార్య మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె హైదరాబాద్‌కు రానుంది.
కాగా ఆరు నెలల క్రితమే అస్మాతో బాసిత్ వివాహం జరిగింది. ప్రస్తుతం అస్మా గర్భణి కూడా. తన తండ్రే మళ్లీ పుడతాడని స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్న బాసిత్ అంతలోనే చెరువులో పడి మృతి చెందడం తలచుకొని బంధువులు, స్నేహితులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక మోనా సుల్తానాకు సల్మాన్‌తో నాలుగైదు నెలల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్లులో ఈతకు వెళ్లి చెరువులో మునిగి ఏడుగురు వ్యక్తులు మరణించిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం బాధాకరమని, వేసవి సెలవులలో పిల్లల విహారాలు, సరదాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కె.చంద్రశేఖర్ రావు సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.