గరిష్టంగా జలాలు విస్తరించే ప్రాంతాన్నీ తేల్చేందుకు ఏర్పాట్లు
ఇందుకోసం ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహా వివిధ ఏజెన్సీల నుంచి డేటా సేకరణ
లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
భవిష్యత్తులో ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువులకు సంబంధించిన పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం (ఫుల్ ట్యాంక్ లెవల్ –ఎఫ్‌టీఎల్)ను గుర్తించడంతోపాటు గరిష్టంగా జలాలు విస్తరించే ప్రాంతం (మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా– ఎండబ్ల్యూఎస్‌ఏ)ను తేల్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ‘లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్‌పీసీ)’శాస్త్రీయ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. ఎల్‌పీసీ చైర్మన్‌గా ఉన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో దీనిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నీటిపారుదల, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఎన్ని చెరువులు ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని రంగనాథ్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆయా చెరువులకు గతంలో నిర్ధారించిన ఎఫ్‌టీఎల్ పక్కాగా లేకున్నా, సహేతుకమైన అభ్యంతరాలు వ్యక్తమైనా.. సమీక్షించి, సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచి్చన నివేదికను పరిశీలించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు రంగనాథ్ స్పష్టం చేశారు.
45 ఏళ్ల లెక్కలను తీసుకుని..
ఇక చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, వాటర్ స్ప్రెడ్ ఏరియాను గుర్తించడానికి 45 ఏళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 1979 నుంచి ఆయా జల వనరులకు సంబంధించిన విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమాచారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్‌లను క్రోడీకరించి ఖరారు చేయనున్నారు. హిమాయత్‌సాగర్‌లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుతో ఈ విధానం ప్రారంభించి మిగతా వాటికీ వర్తింపజేయనున్నారు.
గట్టి నిఘా పెట్టేలా చర్యలు
చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది. ఆయా ప్రాంతాలను జియో ఫెన్సింగ్, ట్యాగింగ్ చేయడంతోపాటు ప్రత్యేక యాప్‌ను వినియోగంలోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఎక్కడ, ఎలాంటి ఆక్రమణలు జరుగుతున్నా తక్షణమే ఆ సమాచారం హైడ్రాకు చేరేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారానే ప్రజలు సమాచారం తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదు చేయడానికీ ఆస్కారం ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు చేపట్టే పరిశీలనలు, వాటి ఫలితాలతోపాటు తీసుకున్న చర్యలను ఇందులో నమోదు చేస్తారు.
ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడమే కాకుండా, పూర్వవైభవం తీసుకురావడంపైనా హైడ్రా అధికారులు దృష్టి పెడుతున్నారు. కూలి్చవేతలకు సంబంధించిన వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో ఈ పనులు ప్రారంభించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. చెరువుల పరిరక్షణ కోసం ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment