పబ్లిక్ స్థలాల ఆక్రమణలకు సుప్రీం తీర్పు వర్తించదు
నీటి వనరులు, పర్యావరణాన్ని కాపాడాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామం పరిధిలోని కొత్తచెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 5లోని 5.25 ఎకరాల భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలపై పిటిషనర్ల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరపాలని, నీటి వనరులను పరిరక్షించాలని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది.
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ (హైడ్రా) విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. రోడ్లు, వీధులు, ఫుట్‌పాత్‌లు, నీటి వనరులు వంటి పబ్లిక్ స్థలాలను ఆక్రమించి చేపట్టే అనధికార నిర్మాణాలకు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు వర్తించవని తేల్చి చెప్పింది.
ఫిర్యాదులు పరిశీలించాల్సిందే
కొత్తచెరువు శిఖం ఆక్రమణపై తాము సెప్టెంబర్ 6వ తేదీన, అదే నెల 10న అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఖాజాగూడకు చెందిన ఆర్.రామకృష్ణతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు పత్రాలతో అత్యంత విలువైన భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు.
బిల్డర్స్, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీతో పాటు భరతేందర్‌రెడ్డి, ఘనేశ్వర్, రాఘవరావు ఈ ఆక్రమణలో కుట్రదారులని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టగా.. కొత్తచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) సుమారు 5.5 ఎకరాల్లో విస్తరించి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అక్రమ నిర్మాణాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ముంపు సమస్య తలెత్తుతోందని, నీటి వనరుల మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతోందని తెలిపారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రైవేట్ ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు. శిఖం భూమి లేదా ట్యాంక్ బండ్‌పై ఆక్రమణలు గుర్తిస్తే వాటిని తొలగించాలని, నీటి వనరులను పరిరక్షణతోపాటు పర్యావరణ వ్యవస్థకు మరింత నష్టం జరగకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment