
క్రాంతికుమార్, శ్రీకాంత్ (ఫైల్)
అబ్దుల్లాపూర్‌మెట్: సరదాగా కుంటలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. నాదర్‌గుల్‌లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మహబూబ్‌నగర్ జిల్లా కొమిరెడ్డిపల్లికి చెందిన ఎస్.క్రాంతికుమార్‌రెడ్డి (20), సంగారెడ్డి జిల్లా పాంపాడ్‌కు చెందిన పటోళ్ల శ్రీకాంత్ (20) శుక్రవారం సప్లిమెంటరీ పరీక్షలు రాసి మిగతా ఆరుగురు స్నేహితులతో కలిసి సంఘీనగర్ దేవాలయాల పరిసరాలకు వచ్చారు.
కొహెడ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన మిగతా విద్యార్థులు.. 100కు డయల్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుంటలోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment